కాకినాడ రూరల్: ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఢిల్లీకి తీసుకెళ్లాలన్న డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎమ్మార్పీస్ నాయకులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఆలమూరు మండల ఎమ్మార్పీస్ నేత కొమ్ము నారాయుడు స్పృహ తప్పిపడిపోయాడు. ఈ తోపులాటలో కాకినాడ డీఎస్పీ రవివర్మ కూడా ఉండడంతో ఆయన కూడా ఆందోళనకారుల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చింది.
తమ నాయకుడు నారాయుడు అస్వస్థతకు గురి కావడంతో ఎమ్మార్పీస్ కార్తకర్తలు మరింత రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి చంద్రబాబు నశించాలి, మోసగాడు చంద్రబాబు మాకొద్దు బాబోయ్ అంటూ నినాదాలిచ్చారు. మరోసారి కలెక్టర్ కార్యాలయపు గేటును ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. అయితే డీఆర్‌ఓ జితేంద్ర నేరుగా ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడడంతో సద్దుమణిగింది. ఒకానొక దశలో ఆందోళనకారులు డీఆర్వో మాటను సైతం లెక్క చేయకుండా కలెక్టర్ బయటకురావాలంటూ నినాదాలిచ్చారు. అయితే ఆయన ఊరిలో లేరని కొందరు నాయకులు నిర్ధారించుకున్న తరువాత డీఆర్వో జితేంద్ర, డీఎస్పీ రవివర్మలతో చర్చించారు. ఆందోళనను విరమించారు.
ఈ ఆందోళనలో గాయపడిన కొమ్ము నారాయుడిని ప్రత్యేక వాహనంలో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మందా వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పచ్చి మోసకారి, వెన్నుపోటుదారుడని, నమ్మిన వారిని మోసం చేయడంలో ఆయనకు ఆయనే సాటని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగను అవుతానని బహిరంగంగా హామీ ఇచ్చి మాదిగలను నమ్మించి మోసం చేశాడన్నారు. ఎస్సీ వర్గీకరణను సాధించే వరకు ఎమ్మార్పీస్ కార్యకర్తలు ఎంతటి త్యాగానికైనా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మార్పీస్ జిల్లా నాయకులు కొత్తపల్లి రఘు మాదిగ, వల్లూరి సత్తిబాబుమాదిగ, గంపల సత్యప్రసాద్, ముందేటి డేవిడ్‌రాజు, ఆకుమర్తి ఆశీర్వాదం, పలివెల నవీన్‌మాదిగ, యార్లగడ్డ సత్తిబాబు, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు భూపతి అప్పారావు, బంగారు మంగారావు, మోచీ కులం నాయకులు బి.భద్రం తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు.
అరెస్టు.. విడుదల
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి చెందిన 60 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి కాకినాడ పోర్టు, సర్పవరం పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం ఐదు గంటల సమయంలో విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment