ఉపాధ్యాయునిపై దాడికి ప్రయత్నిస్తున్న బాలిక తల్లి
బోథ్: దళిత బాలికపై ఓ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక 8 వ తరగతి చదువుతోంది. ఆదివారం తనను చూడటానికి వచ్చిన తల్లితో.. ఉపాధ్యాయుడు, ఇన్‌చార్జి వార్డెన్ వసంత్‌రావ్ కొద్ది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని సదరు బాలిక వాపోయింది. దీంతో సోమవారం బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఉపాధ్యాయుడిని నిలదీశారు. అతడిపై దాడికి యత్నించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు.
ఎమ్మార్పీఎస్ ధర్నా: విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కీచక ఉపాధ్యాయుడు వసంత్‌రావును వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి డిమాండ్ చేశారు. వారం రోజుల్లో విచారణ చేపట్టి సంబంధిత ఉపాధ్యాయుడిపై తగు చర్యలు తీసుకుంటామని పీవో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అలాగే.. ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
విచారణ చేపట్టిన జేసీ సంధ్యారాణి: పల్లె ప్రగతిలో భాగంగా బోథ్ మండల కేంద్రంలో పర్యటిస్తున్న జేసీ సంధ్యారాణికి విషయం తెలియడంతో వెంటనే పాఠశాలకు వెళ్లి బాధిత బాలికతో పాటు, తోటి బాలికలను విచారించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రవర్తనపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment