వీరఘట్టం : సీతంపేట మండలం కుసుమూరు గ్రామానికి చెందిన బాలిక అత్యాచారానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వీరఘట్టం ఎస్‌ఐ బి.రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో కుసుమూరు గ్రామానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. వీరఘట్టంకు చెందిన రాయిపిల్లి అశోక్, బాలిక మధ్య ఆరు నెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ నెల 2న వీరఘట్టం మండలం అచ్చెపువలసలో ఉంటున్న తన పిన్ని ఇంటికి బాలిక వచ్చినప్పుడు వీరఘట్టంకు చెందిన బండి షాజన్ అనే మరో యువకుడు వచ్చి మాయ మాటలు చెప్పి బాలికను లొంగదీసుకున్నాడు. మరుసటి రోజు బాలిక తన చిన్నాన్న నివాసముంటున్న సీతంపేట మండలం మానాపురం వెళ్లింది.
అక్కడికి వెళ్లిన షాజన్ బాలిక మెడలో తాళి కట్టాడు. మానాపురం గ్రామస్తులు బాలిక మెడలో తాళిని చూసి పెళ్లి ఎప్పుడైందని ప్రశ్నించారు. అనంతరం బాలిక బంధువులు విషయం తెలుసుకుని షాజన్‌ను నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా ఇద్దరు యువకులు తనను అన్ని విధాలుగా మోసగించారని బాలిక ఫిర్యాదు చేయడంతో అశోక్, షాజన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కాగా, బాలికపై అత్యాచారం కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీరఘట్టం, పాలకొండ, సీతంపేట మండలాల్లో కేసు పూర్తి వివరాలు తెలియక రెండు రోజుల నుంచి పోలీసులు గందరగోళానికి గురయ్యారు. చివరకు పాలకొండ డీఎస్పీ సి.హెచ్.ఆదినారాయణ, సీఐ వేణుగోపాలరావులు కేసును క్షుణ్నంగా పరిశీలించారు. బాలికను పలు విధాలుగా ప్రశ్నించి వివరాలు రాబట్టడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది.
నిర్లక్షమే కారణం!
సీతంపేట: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, వార్డెన్ల నిర్లక్ష్యమే గిరిజన బాలికపై అత్యాచారానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డెన్ సింహాచలం మార్చి 1న బాలికను పాఠశాల నుంచి వీరఘట్టానికి తీసుకెళ్లి ఆమె బంధువుల ఇంటికి అప్పగించి వచ్చేశారు. నిబంధనల ప్రకారం ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ఇంటికి పంపించాలంటే తప్పనిసరిగా గిరిజన సంక్షేమశాఖ డీడీ అనుమతి ఉండాలి. పిల్లలను ఎందుకు తీసుకెళ్తున్నారో తల్లిదండ్రులతో లిఖిత పూర్వకంగా కారణాలు రాయించాలి. అయితే ఇక్కడ మాత్రం కనీసం ఏటీడబ్ల్యూవోకు గానీ, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు గానీ ఎటువంటి సమాచారం అందించలేదు.
ఇక్కడి హెచ్‌ఎం పాలకొండ నుంచి, వార్డెన్ శ్రీకాకుళం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి సమయంలో ఎవ్వరూ ఉండరు. ఇదే అదునుగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఒకరు అన్నీ తానై వ్యవహరించడంతో పాటు బాలికను కొంతకాలంగా లోబర్చుకున్నాడని, ఆ గుట్టు పాఠశాలలో పొక్కడంతో బాధితురాలిపై దొంగతనం అంటగట్టి ఇంటికి పంపించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీతంపేట మండలంలోని స్వగ్రామమైన కుసుమూరు కాకుండా వీరఘట్టంలో బాలికను వదిలేసి వెల్లిపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. బాలిక అత్యాచారానికి గురై 11 రోజులైనా ఎవ్వరూ పట్టించుకోలేదు.
చివరకు సోమవారం రాత్రి బాధితురాలితోపాటు తల్లిదండ్రులు, గ్రామస్తులు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎల్.శివశంకర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పీవో మెళియాపుట్టి ఏటీడబ్ల్యూవో వెంకటరమణకు విచారణకు ఆదేశించారు. ఈయన మంగళవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. పాఠశాల హెచ్‌ఎం ఉమావాణి, డిప్యూటీ వార్డెన్ సింహాచలం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని నివేదిక తయారు చేసినట్లు సమాచారం. మార్చి 1న విద్యార్థినిపై దొంగతనం నింద వేసి పంపించేశారని, విద్యార్థినులను విచారించగా పాఠశాలలో ఎటువంటి దొంగతనాలకు పాల్పడలేదని తెలిపారు. తల్లిదండ్రుల ఇంటి వద్ద బాలికను పంపించకుండా మధ్యలో దించేయడంతోనే అఘాయిత్యం చోటుచేసుకుందని నివేదిక తయారు చేసినట్లు తెలిసింది.
గిరిజన బాలికపై అత్యాచారం
Published Wed, Mar 15 2017 11:16 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement