శత వసంతాల గాన కోకిల.. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి | MS Subbulakshmi 102 Birth Anniversary September 16 Tirupati | Sakshi
Sakshi News home page

శత వసంతాల గాన కోకిల

Published Mon, Sep 16 2019 9:51 AM | Last Updated on Mon, Sep 16 2019 9:54 AM

MS Subbulakshmi 102 Birth Anniversary September 16 Tirupati - Sakshi

శ్రీవారి అనన్య భక్తురాలైన ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. ప్రపంచ ప్రసిద్ధ గాయనీమణిగా, భారత గానకోకిలగా, భారతరత్నగా, సంగీత విధుషీమణిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ప్రపంచ దేశాలను తన గాత్ర మాధుర్యంలో మెప్పించిన సుస్వరాల గాన కోకిలగా చరిత్రకెక్కారు. సోమవారం ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి 103వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

సాక్షి, తిరుపతి : శ్రీవేంకటేశ్వరస్వామి అనన్య భక్తురాలిగా ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి శ్రీవారి వైభవ విశ్వవ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. ఎలాంటి ప్రసార సామగ్రి లేని సమయంలోనే ఆమె  శ్రీవారు, అన్నమయ్య సంకీర్తనల తొలి ప్రచారకురాలుగా నిలిచారు. శ్రీవారు, అన్నమయ్య కీర్తనలను ప్రపంచానికి అందించడంలో ఎనలేని సేవచేశారు. శ్రీవారి సుప్రభాతాన్ని మారుమూల గ్రామాలకు తీసుకెళ్లిన ఘనత ఆమెకే దక్కుతుంది. శ్రీవారి సుప్రభాతం ప్రపంచవ్యాప్తంగా నేటికీ ఎమ్మెస్‌ గొంతుకతో వింటేనే  స్వామి నిదురనుంచి మేల్కొంటారనే నానుడు ఉంది. ఆ గొంతుక సుప్రభాతం వింటేనే సంగీత ప్రియులకు సంతృప్తి కలుగుతుంది. ఆమె ఆలపించిన బాలాజీ పంచరత్నాలు, అన్నమాచార్య కీర్తనలు, శ్లోకాలు, భజనలు, స్తోత్రాలు ప్రసిద్ధికెక్కాయి. ఆమె ఆలపించిన సంకీర్తనలు, సుప్రభాతం నేటికీ విరాజిల్లుతున్నాయి.

అప్పట్లోనే ఆ రికార్డులు, ప్రచారాల ద్వారా వచ్చిన నిధులను ఆమె టీటీడీకే అందజేసి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నారు. ఒక్క రూపాయి కూడా ఆశించికుండా శ్రీవారికే కానుకగా ఇచ్చిన ఆ నిధులు ఇప్పుడు వడ్డీతో సహా కోట్లాది రూపాయలు టీటీడీ ఖజానాలో జమ అయ్యాయి. తిరుపతి త్యాగరాజ మండపంలో సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదును ఆమె అందుకున్నారు. ఇదే వేదికలో తన గాత్రంతో శ్రోతలను మైమరపించారు. ఆమె 2004 డిసెంబర్‌ 11న పరమపదించగా, ఆమె తొలి కాంస్య విగ్రహం తిరుపతిలోనే ఏర్పాటు చేశారు. అప్పటి తుడా చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి సంగీతంపై తనకున్న మక్కువ, ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిపై ఉన్న అభిమానంతో ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి తిరుపతి పూర్ణకుంభం సర్కిల్‌లో కాంస్య విగ్రహం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 

కుటుంబ నేపథ్యం
ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలోని శ్రీమీనాక్షి అమ్మవారి ఆలయ మాడ వీధికి చెందిన వీణ విదూషిమణి షణ్ముఖవడివు, వకీలు మధురై సుబ్రమణ్య అయ్యర్‌ దంపతులకు 1916 సెప్టెంబర్‌ 16న జన్మించారు. తల్లి సంగీత విదూషిమణి కావడంతో అక్షరాలకన్నా ముందే సరిగమలను నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే ఆమె ఏకసంథాగ్రాహిగా సంగీతంలో రాణించడం మొదలుపెట్టారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన ఆమె 10వ ఏట ఆలపించిన పాటను గ్రామ్‌ ఫోన్‌ రికార్డు విడుదల చేయడం  సంచలనం సృష్టించింది. 17ఏళ్లకే మద్రాసు మ్యూజిక్‌ అకాడమీలో కచేరీ చేసి పండితుల చేత ప్రశంసలు అందుకున్నారు.

ఎమ్మెస్‌ గాత్ర ప్రత్యేకత
ఓంకారం ప్రజ్వలించే తంబుర శృతికి.. ఎమ్మెస్‌ తన గొంతు కలిపితే అదో మధురం. సుమధురం, ఆనంద తన్మయం, పరవశం, శ్రవణానందంతో ప్రతిఒక్కరూ భక్తి తన్మయం చెందాల్సిందే. అలాంటి సుమధుర కంఠం నుంచి సుస్వరాలు జాలువారితే ఇక సంగీత శ్రోతలకు వీనులవిందే. తమిళనాడుకు చెందిన ఆమె పరిపూర్ణ తెలుగులో సంకీర్తనలను గానం చేయడం మరో విశేషం. భక్తి, భావం, సాహిత్య సౌలభ్యం, సాహిత్య ఉచ్ఛారణ, రాగంలోని మాధుర్యాన్ని పలికించడంతో ఆమెకు ఆమే సాటి. ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి సంగీతం ప్రపంచంలో మరెవరికీ అందని కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నారు. దేశ అత్యున్నత పురస్కారాలను అంది పుచ్చుకున్నారు. శ్రీవారికి సేవచేసి చరిత్ర పుటల్లో నిలిచారు. ఐక్యరాజ్య సమితిలో ఆలపించిన తొలి మహిళగా, తొలి భారతీయురాలుగా కీర్తి గడించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రశంస లందుకున్నారు.

 

ఆమె సుప్రభాతంతోనే శ్రీవారి మేల్కొలుపు 
ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి గానం చేసిన శ్రీవారి సుప్రభాతంతోనే సప్తగిరులు సైతం ఉదయిస్తాయి. ఆ అమ్మ పాటలో ప్రాణం ఉంటుంది. శ్రీవారి భక్తురాలిగా ఎనలేని నిస్వార్థ సేవచేశారు. శ్రీవారి వైభవ విశ్వవ్యాప్తంలో ఆమె పాటదే మెదటి స్థానం. సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయురాలు. అలాంటి మహోన్నత వ్యక్తి కాంస్య విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. 
 – భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement