కాపులు రోడ్డెక్కడానికి బాబే కారణం: ముద్రగడ
కర్నూలు (అర్బన్)/ సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్రంలో కాపులు రోడ్డెక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు బీసీ రిజర్వేషన్ వర్తింపజేయాలన్న ప్రధాన డిమాండ్‌పై ఆదివారం ఆయన కర్నూలులోని మెగా సిరి ఫంక్షన్ హాలులో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అవి సాధించే వరకు తాము నిద్రపోమని, బాబుకూ నిద్ర పట్టకుండా చేస్తామన్నారు.
ప్రతిపక్ష నేత జగన్ సహకారంతోనే తాను ఉద్యమం చేస్తున్నాన ని సీఎం వ్యాఖ్యానిం చడం తగదన్నారు. బావమరిది బాలకృష్ణను కాల్పుల కేసు నుంచి రక్షించుకునేందుకు అర్ధరాత్రి నెంబరు బోర్డులేని వాహనంలో వెళ్లిన బాబు.. అప్పటి సీఎం వైఎస్ కాళ్లు పట్టుకోలేదా అని ప్రశ్నించారు.
ముద్రగడ కర్నూలులో చేపట్టిన ఒక్క రోజు దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తింది. ముద్రగడకు వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర రెడ్డిలు కూడా వేర్వేరుగా తమ మద్ధతును ప్రకటించారు.