
కిర్లంపూడిలోని తన నివాసంలో కాపు జేఏసీ నాయకులతో సమావేశమైన ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపు ఉద్యమ నేతలు వ్యూహాన్ని మార్చనున్నారా?
కాపు ఉద్యమ వ్యూహం మారనుందా?
మరాఠాల ర్యాలీ నేపథ్యంలో మంతనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపు ఉద్యమ నేతలు వ్యూహాన్ని మార్చనున్నారా? తమ సత్తా ఏమిటో ప్రభుత్వానికి మరోమారు చూపాలనుకుంటున్నారా? ఇందుకు అవుననే అంటున్నారు కాపునాడు నాయకులు, వ్యూహకర్తలు. మరాఠాలు ముంబయి మహానగరంలో మిలియన్ మార్చ్ నిర్వహించి డిమాండ్లను సాధించుకున్న నేపథ్యంలో తాము కూడా మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని కాపు నేతలు తాజాగా చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగా మిలియన్ మార్చ్ తరహాలో అమరావతిలో శాంతియుతంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తే బావుంటుందని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దిశగా కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బృందంతో చర్చలు జరపాలని నిర్ణయించారు.
కాపు రిజర్వేషన్ల సమస్యపై గతంలో ముద్రగడ దీక్ష చేసినప్పుడు 2016 ఆగస్టులోగా సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రులు, మధ్యవర్తులుగా హాజరైన పలువురు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది గడిచినా ఎలాంటి ఫలితం లేని నేపథ్యంలో బల ప్రదర్శన చేయాలని కాపు ఉద్యమ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాపు గర్జన సందర్భంగా తునిలో రైలు దగ్ధం సంఘటనను సాకుగా చూపుతూ ఛలో అమరావతి పేరిట తలపెట్టిన ముద్రగడ బృందం పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. గత నెల 26 నుంచి ఇప్పటి వరకు ఆయన్ను అధికారికంగా కొంత కాలం, అనధికారికంగా మరికొంత కాలం గృహ నిర్బంధంలో ఉంచింది. నిత్యం ముద్రగడ బృందం కిర్లంపూడిలో ఇంటి నుంచి గేటు దాకా రావడం, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం 15 రోజులుగా పరిపాటిగా మారింది.
ముద్రగడ పాదయాత్రను ప్రభుత్వం సాగనిచ్చే అవకాశం లేనందున తాత్కాలిక సచివాలయం ఉన్న వెలగపూడి ప్రాంతంలో భారీ బహిరంగ నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదననూ కాపు నేతలు పరిశీలిస్తున్నారు. దీనిపై ఈ నెల 15 తర్వాత ముద్రగడ బృందంతో చర్చించనున్నట్టు తెలిసింది.