
‘సీఎం ఏమైనా హిట్లరా?, ఎంతకైనా తెగిస్తాం’
ఈ నెల 30న అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశమై, పాదయాత్రతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు.
సాక్షి, కిర్లంపూడి : ఈ నెల 30న అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశమై, పాదయాత్రతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆయన సోమవారం కిర్లంపూడిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చమని అడగటం తప్పా?. మేం ఓట్లు వేసింది కొట్టించుకోవాడానికా?. మేము ఏమైనా ఉగ్రవాదులమా?, హామీలను అమలు చేయాలని అడగొద్దా?. ముఖ్యమంత్రి ఏమైనా హిట్లరా?. ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుందా?.
ఎవరి అనుమతి తీసుకుని చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు?. సొల్లు ఉపన్యాసాలతో చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవా?. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చారా?. మాకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా చూస్తూ ఊరుకోవాలా?. కమీషన్లు తప్ప, ప్రజా సమస్యలు పట్టవా?. మా జాతి ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తాం. రిజర్వేషన్లు సాధించేవరకూ పోరాటం కొనసాగిస్తాం.’ అని ముద్రగడ స్పష్టం చేశారు. ఎవరికీ లేని ఆంక్షలు తన పాదయాత్రకే ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నిక గెలుపుపై ముద్రగడ మాట్లాడుతూ.. అభివృద్ధితో కాదని, అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీతో టీడీపీ గెలిచిందన్నారు.