
ముద్రగడ పద్మనాభం, ఓమ్ ప్రకాష్ రావత్
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో సామాన్య ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓమ్ ప్రకాష్ రావత్‌ను కోరారు. ఓటరు లిస్టులో పేరున్నా, ఓటింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్దుకు ఓటువేయడానికి వెళితే లిస్టులో పేరుంది కానీ, ఓటు వేసే అర్హత లేదని, లిస్టులో పేరు కొట్టేసుందని పోలింగ్ స్టేషన్లో ఉన్న సిబ్బంది చెబుతుంటారని తెలిపారు. దీనిపై అక్కడున్న పై అధికారులకు ఇంటి పన్ను రశీదు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంటు బిల్లు, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు వగైరా ఆధారాలు చూపించినా అధికారులు నిస్సహాయులుగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముద్రగడ కోరారు.
ఎన్నికలలో ఓటింగు రోజు పోలింగ్ కేంద్రాల వద్ద పేజీలకు పేజీల పేర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. బ్లాక్ లిస్టులో తమ పేర్లు పెట్టారేంటి అని రిటర్నింగ్ అధికారినిగానీ, కలెక్టర్‌ను గానీ అడిగితే పై నుంచి ఆదేశాలు వచ్చాయంటారని చెబుతారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి కారణం తెలుసుకోవాలన్నారు. లేకపోతే భారతదేశంలో పుట్టిన తమకు ఓటు హక్కు లేదా అని యువత వాపోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఓటు హక్కును సరైన విచారణ జరపకుండానే తీసివేసే ఆలోచన మంచిది కాదని వివరించారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు ఎలాంటి ఆటంకం లేకుండా ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.