సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని ప్రశంసించారు. సుమారు రూ. 80 కోట్లతో నరసాపురం నియెజకవర్గం అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గ చిరకాల వాంఛ అయిన నర్సాపురం వశిష్ఠ వారధి.. అలాగే బియ్యపుతిప్పలోని మినీ హార్బర్, విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు మంచినీటి పైపులైన్లకు జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. స్థానికంగా ఇల్లులేని 7841 మందిని గుర్తించామని, ఉగాది నాటికి వారందరికీ ఇల్లు కట్టిస్తామని తెలిపారు. ఇసుక విషయంపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల, అధిక వరదల వల్ల ఇసుక తవ్వడం ఆలస్యమైందే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకం లేదని వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment