సాక్షి, కర్నూలు : మూఢం ముంచుకొస్తోంది. వివాహాది శుభకార్యాలు జరుపుకునే వారికి మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ ముహుర్తాల్లోనే వివాహాలు జరుపుకునేందుకు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివాహాది శుభకార్యాలు భారీగా జరుగుతున్నాయి. ఈనెల 27వ తేదీతో ముహూర్తాలు ముగియనున్నాయి. ఆ తరువాత శుక్ర మూఢమి కారణంగా మరో మూడు నెలల పాటు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడనుంది.
ఈనెల 23, 25, 26, 27 తేదీల్లో ఉన్న ముహుర్తాల్లో శుభకార్యాలు జరుపుకోలేని వారు ఆశ్వయయుజ మాసమైన అక్టోబరు 2 వరకు వేచి ఉండాల్సిందే. ఆ మూఢమి కాలం ముగిసే వరకు పెళ్లి వారితో పాటు, పురోహితులు, కేటరింగ్, పూలు, మండపాలు డెకరేషన్ చేసే వారు, కల్యాణ మండపాల యజమానులు నిరీక్షించాల్సిందే. మరో మూడు నెలలు శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు, గృహ ప్రవేశాలను ఈనెల 27వ తేదీలోగా ముగించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అంతటా హడావుడి కనిపిస్తోంది. వస్త్ర, బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. మండపాల డెకరేషన్, పురోహితులు బిజీబిజీగా కనిపిస్తున్నారు. కల్యాణ మండపాలు దొరకని వారు శ్రీశైలం, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో వివాహాలకు మండపాలను ముందుగానే బుక్ చేసుకున్నారు. ఈ ఐదు రోజుల తర్వాత శుభకార్యాలకు బ్రేక్ పడనుంది.
శ్రావణ మాసంలోనూ శూన్యమే
జూలై ఆషాఢం కావడంతో అది శూన్యమాసం. ఆ తరువాత వచ్చే ఆగస్టు (శ్రావణమాసం)లో ఏటా వివాహాది శుభకార్యాలకు మంచి ముహుర్తాలు ఉండేవి. ఈ ఏడాది శ్రావణమాసంలో కూడా మూఢమి వచ్చింది. అలాగే సెప్టెంబర్ (భాద్రపద మాసం) శూన్యమాసమైంది. దీంతో వరుసగా ఈ మూడు నెలలు శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. తిరిగి అక్టోబర్ 2 నుంచి శుభ ముహుర్తాలున్నాయి.
– శ్రీకాంత్‌స్వామి, అర్చకులు
Comments
Please login to add a commentAdd a comment