- చిత్తూరు కార్పొరేషన్,ఆరు మున్సిపాల్టీల్లో ఎన్నికలు
- హోరాహోరీగా సాగిన ప్రచారం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాల్టీలకు నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం 48 గంటల ముందు ప్రచారం ముగిం చాలి. మార్చి 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండడంతో మైక్‌ల హోరు, అభ్యర్థనల జోరుకు నేటితో తెరపడనున్నది. 18వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు దాదాపు రెండు వారాలపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీల నుంచి చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి, పలమనేరు మున్సిపాల్టీల్లో అన్ని డివిజన్లు, వార్డులకు అభ్యర్థులను నిలిపారు. వీరి తరువాత స్వతంత్రులు పెద్ద సంఖ్యలో పోటీకి దిగారు. కాంగ్రెస్ శ్రీకాళహస్తి మున్సిపాల్టీలో మాత్రమే అన్ని వార్డులకు అభ్యర్థులను నిలిపింది. మొత్తం 813 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి గెలుపు కోసం వైఎస్‌ఆర్ సీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏఎస్ మనోహర్, ఆర్‌కే రోజా, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు జోరుగా ప్రచారం చేశారు.
తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు గాలి, బొజ్జల, జంగాలపల్లి శ్రీనివాసులు, కఠారి మోహన్, దొరబాబు ప్రచారం నిర్వహించారు. చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్ సీపీ, తెలుగుదేశంతోపాటు ఎమ్మేల్యే సీకే బాబు అనుచరులు స్వతంత్ర ప్యానల్‌గా రంగంలోకి దిగారు. దీంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం వార్డుల్లో పోటా పోటీగా సాగింది.