సాక్షి, కొత్తగూడెం :మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో స్తబ్దత నెలకొనడంతో అసలు జరుగుతాయా లేదా అనే చర్చ జోరుగా నడుస్తోంది. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని..బరిలో నిలిచే వారంతా వారివారి వార్డుల్లో ఇప్పటికే తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా ప్రక్రియ నిలిచిపోవడం, ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదనే వార్తలు వస్తుండడంతో అయోమయంలో పడ్డారు.2010 సెప్టెంబర్ 29న మున్సిపల్ కౌన్సిళ్ల పదవీ కాలం ముగిసింది. నాటినుంచి వివిధ కారణాలతో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకుండా వాయిదాలు వేస్తూ ప్రత్యేక అధికారుల పాలనకు తెరతీశారు. అప్పుడు ఇప్పుడంటూ కాలయాపన చేసిన ప్రభుత్వం మూడేళ్ల తర్వాత ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్, కొత్తగూడెం, మధిర, ఇల్లెందు మున్సిపాలిటీ, సత్తుపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. ఏజెన్సీ వివాదం కారణంగా పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడం లేదు.
మిగతా అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్ పూర్తి కావడంతో అప్పుడే మాజీ కౌన్సిలర్లు రిజర్వేషన్ అయిన వార్డులో తమ భవితవ్యం పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంకా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న పలువురు అభ్యర్థులు కూడా ఎన్నికలు జరుగుతాయని భావించి వార్డులలో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుత పరిణామాలతో..ఇప్పుడు ఎన్నికలు జరగకపోయినా రిజర్వేషన్లు మారవు కదా అనుకుంటూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌గా ఏర్పడడంతో ఇక్కడ పోటీకి అన్ని పార్టీలు సై అంటున్నాయి. ఇక చైర్మన్ల రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చాల్సిన సమయంలోనే ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. హడావుడి చేసిన అధికారులంతా ప్రస్తుతం మౌనం దాల్చారు.
ఆశావహుల్లో ఉత్కంఠ..
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో అధికారికంగా వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయింది. అయితే చైర్మన్ల రిజర్వేషన్ నిలిచిపోవడంతో.. బరిలో ఉండాలనుకుంటున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. అన్ని పార్టీలకు చైర్మన్ అభ్యర్థిత్వం కీలకం కావడంతో రిజర్వేషన్ పూర్తి అయితే ఎవరినో ఒకరిని ఎంపిక చేస్తే ఓపని అయిపోతుందని భావించాయి. చైర్మన్ అభ్యర్థి వార్డులో పోటీచేసే అభ్యర్థుల ఖర్చు భరించాలని ఇప్పటికే అన్ని పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. ఆదిశగా చైర్మన్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారంతా ఖర్చు కోసం ఇప్పటికే డబ్బును సమకూర్చుకునే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
డబ్బుకు వెనకాడితే చైర్మన్ రేసులో ఉండలేమని ఎవరికివారు పోటీపడుతున్నారు. అసలు చైర్మన్ల రిజర్వేషన్ పూర్తి అయితే తమకు అవకాశం ఉందోలేదో తేలిపోతుందని, ఇప్పటి నుంచే ఈ తంటాలు ఉండేవికావని వారు భావిస్తున్నారు. గతంలో పరిస్థితులను అంచనా వేసుకొని ఈ సారి ఎలాగైనా తమ కేటగిరికే మున్సిపల్ చైర్మన్ పదవి రిజర్వు అవుతుందని ఎవరికివారే ఆశల పల్లకిలో ఉన్నారు. రిజర్వేషన్ మళ్లీ తమ కు అనుకూలంగా ఉంటుందని, ఈ సారి కూడా నేనే చైర్మన్ అవుతానని గతంలో ఆ పీఠంపై కూర్చున్న వారు అంచనాలు వేస్తున్నారు. ఈనేపథ్యంలో అసలు ఎన్నికలు ఉంటాయా ఉండవా అన్న విషయానికి ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
ప్రత్యేక పాలన పొడగింపు ...?
వచ్చే సెప్టెంబర్ 29 నాటికి మున్సిపల్ పాలకవర్గం పదవికాలం ముగిసి మూడేళ్లు అవుతుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించి కౌన్సిల్ నియామకం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రత్యేక అధికారుల పాలన పొడిగించలేదు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోతే ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.