ఒంగోలు, న్యూస్‌లైన్: మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూలు విడుదలతోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు , రాజకీయ నాయకులకు, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు, ప్రచారానికి సంబంధించి పలు ముందస్తు హెచ్చరికలు అమలులోకి వచ్చినట్లయింది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళికి లోబడి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
మున్సిపాల్టీలకు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ సంబంధిత మున్సిపల్, నగర పంచాయతీల పరిధివరకే వర్తిస్తుంది
ఎన్నికల ప్రచార సమయంలో కుల, మత, భాషా ప్రతిపాదికన ఓట్లను అభ్యర్థించరాదు.
పోటీ ఉన్న అభ్యర్థికి సంబంధించి వ్యక్తిగత దూషణలు చేయరాదు.
ప్రభుత్వ సంస్థల భవనాలను ఎట్టి పరిస్థితుల్లోను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించకూడదు.
ప్రైవేటు వ్యక్తుల స్థలాలను వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా సంబంధిత భవనం యజమాని రాతపూర్వకంగా అనుమతి ఇచ్చి ఉండాలి. ఇచ్చిన అనుమతి పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారికి పంపాలి.
ప్రచారానికి వినియోగించే కరపత్రాలు, వాల్‌పోస్టర్లు వంటి వాటిపై ముద్రణా సంస్థ పేరుతోపాటు కరపత్రాల సంఖ్య, ఎవరు ముద్రింపజేశారు అనే వివరాలు తప్పనిసరి.
ఇతర పార్టీలకు సంబంధించిన కరపత్రాలను, జెండాలను తొలగించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టే.
మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు ఎవరైనా ఎన్నికల కోడ్ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనరాదు. అధికారులు సైతం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరాదు.
బహిరంగ సమావేశాల్లో అధికారులు కాని, ప్రభుత్వ ఉద్యోగులు కాని పాల్గొనరాదు.
ముందస్తు అనుమతి లేకుండా ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదు. లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రతిరోజూ ఉదయం 6గంటలనుంచి రాత్రి 10గంటలవరకు మాత్రమే ఉండాలి. లౌడ్ స్పీకర్ల వినియోగానికి పోలీసుశాఖ అనుమతి తప్పనిసరి.
ప్రచార పర్వం ఎన్నిక ముగిసే సమయానికి 48గంటలలోపుగా ముగించాలి. అంతకు మించి ప్రచారం నిర్వహించరాదు.
ఓటర్లను మభ్యపెట్టేలా మంత్రులు హామీలు ఇవ్వరాదు.
ప్రభుత్వ అతిథిగృహాలను ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఏ ప్రజాప్రతినిధికి కేటాయించకూడదు.
ఎన్నికల కోడ్ ఉన్న ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరూ వెంట ఉండరాదు.
అభ్యర్థి పోలింగ్‌రోజు పోలింగ్‌స్టేషన్‌కు వంద మీటర్ల దూరంలో మాత్రమే ప్రచారం చేసుకోవాలి. ఓటర్లను ప్రలోభపెట్టేలా వాహనాల్లో తరలించడం నిషిద్ధం.
ఓటర్లకు స్లిప్పులు పంపిణీచేసే సమయంలో కేవలం తెల్లకాగితం ఉపయోగించాలే కాని పార్టీకి సంబంధించిన చిహ్నమున్న కాగితాన్ని వినియోగించరాదు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆరాధనా ప్రాంతాలను వినియోగించడం కూడా నిషిద్ధం.
‘కోడ్’ కూసింది
Published Tue, Mar 4 2014 3:04 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement