‘అడ్వాన్సు’గా మెక్కేశారు
కడప కార్పొరేషన్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలు వరంగా మారాయి. ఎన్నికల నిర్వహణపేరుతో అందినకాడికి దోచుకుని కార్పొరేషన్ ను ఖాళీ చేశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారోననే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే యత్నంలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. లక్షలకు లక్షలు మింగేసి నింపాదిగా కూర్చున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఖర్చు వివరాలపై సమగ్ర దర్యాప్తు జరిపితే అక్రమార్కుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలు కొందరు అధికారులకు వరంగా మారాయి. ఇచ్చేవాడుంటే చచ్చేవాడూ లేచి వస్తాడనే సామెత చందాన మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరు అధికారులు విచ్చలవిడిగా అడ్వాన్సులు తీసుకొని కడప నగరపాలక సంస్థను నిలువునా ముంచారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రూ.35 లక్షలు ఖర్చుచేయమంటే కడప కార్పొరేషన్‌లో మాత్రం దానికి నాలుగింతలు అంటే రూ. 1.35కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టే మన అధికారులు ఎన్నికలను ఎంత ‘కాస్ట్‌లీ’గా నిర్వహించారో తెలుస్తోంది.
కడప నగరపాలక సంస్థ పరిధిలోని 246 పోలింగ్ స్టేషన్లలో టేబుళ్లు ఉన్నాయి, అయినా అధికారులు ఇష్టారాజ్యంగా కొత్త టేబుళ్లు, ర్యాక్‌లు కొన్నారు. అన్నికేంద్రాలకు విద్యుదీకరణ ఉంది. మంచినీరు, బారికేడ్లు కట్టడానికి ఇంజనీరింగ్ అధికారులు లక్షలకు లక్షలు అడ్వాన్సులు తీసుకొన్నారు. అందరు ఇంజినీర్లకు సమానంగా పోలింగ్ స్టేషన్లు కేటాయించినందున ఇంచుమించు అందరికీ సమానంగా ఖర్చు కావాలి. కానీ కొందరికి లక్ష, రెండు లక్షలే ఖర్చుకాగా మరికొందరికి మాత్రం ఐదారు లక్షలు ఖర్చు అయ్యింది. ఒక చేయి తిరిగిన ఇంజినీరింగ్ అధికారైతే అత్యధికంగా రూ. 6లక్షలు అడ్వాన్సు తీసుకోవడమే గాక ఆఫీసులో కొత్త ఛాంబర్ల ఏర్పాటు, కార్పొరేషన్ గోడలకు, బారికేడ్లకు పెయింటింగ్‌ల పేరుతో అందినకాడికి వెనకేసుకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కార్పొరేషన్‌లో రెండు జిరాక్స్ మిషిన్‌లు ఉన్నాయి. అదనంగా ఒక పెద్ద జిరాక్స్ మిషిన్‌ను బాడుగకు తెచ్చారు. ఎన్నికలు జరిగినన్నిరోజులు దీనికి ఇచ్చిన బాడుగతో ఒక కొత్త జిరాక్స్ మిషినే కొనవచ్చు. దీనిప్రకారం కార్పొరేషన్‌లో మొత్తం మూడు జిరాక్స్ మెషీన్‌లు ఉండగా కొందరు మాత్రం జిరాక్స్ చేయించినట్లు బిల్లులు పెట్టడం గమనార్హం. ఇంకొందరైతే కంప్యూటర్లకు మరమ్మతులు చేయించామని బిల్లులు చేసుకొన్నట్లు తెలిసింది.
ఈవీఎం మిషన్లపై అతికించే సుమారు 500 బ్యాలెట్ పేపర్లను తీసుకురావడానికి కర్నూలుకు వెళ్లేందుకు మిగిలిన కార్పొరేషన్ల అధికారులు రూ. 5 వేల నుంచి 10వేలు తీసుకుపోతే మన కార్పొరేషన్ అధికారులు మాత్రం రూ. 30వేలు తీసుకుపోయినట్లు సమాచారం. ఈ బ్యాలెట్ పేపర్లను ప్రభుత్వమే ఉచితంగా ముద్రించి ఇస్తుంది. ఈ మొత్తమంతా కేవలం ప్రయాణచార్జీలు, బస చేసినందుకే.
కోడ్ ఆఫ్ కండక్ట్‌కు సంబంధించి వాల్‌రైటింగ్స్ ఉన్న చోట సున్నం కొట్టే పనిని కార్పొరేషన్ సిబ్బందితో చేయించి బిల్లులు మాత్రం లక్షల్లో చేసుకొన్నట్లు తెలుస్తోంది.
నామినేషన్ల సమయంలో నోటిఫికేషన్ వెలువడిన మార్చి 10వ తేదీనుంచి 18వ తేదీ వరకూ 8 నామినేషన్ కేంద్రాలలో ఆర్వోలు, ఏఆర్‌ఓలు, వారికి సహాయంగా 5 మంది కార్పొరేషన్ సిబ్బందిని నియమించారు. అంటే మొత్తం 40 మంది 8 రోజుల పాటు పనిచేశారు. వీరికి తోడు మరో 60 మంది పనిచేశారనుకొన్నా రోజుకు 100 మంది అవుతారు. వీరికి 8 రోజులకు రూ. 150లతో లెక్కేస్తే రూ. 1.20 లక్షలు. అలాగే పోలింగ్‌కు ముందురోజు, పోలింగ్‌రోజు రెండు రోజుల పాటు సుమారు 2వేల మంది చొప్పున విధులు నిర్వహించారు. ఈ లెక్కన రెండు రోజులకు నాలుగు వేలమందికి రూ. 6.00లక్షలు. మొత్తం 7.20 లక్షలు కావాలి. ఎంత దుబారాగా ఖర్చుపెట్టినా భోజనాల ఖర్చు రూ. 30 లక్షలు దాటదు. అయతే కార్పొరేషన్‌లో రిఫ్రెష్‌మెంట్స్ కోసం రూ. 44 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.
నగరపాలక ఉన్నతాధికారి మంచితనం, ఉదారస్వభావాన్ని ఆధికారులు తమకు అనుకూలంగా మలుచుకొన్నట్లు దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అవినీతి వ్యవహారంపై చాలామంది సమాచార హక్కు చట్టం ద్వారా కూపీ లాగాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ దుబారా ఖర్చుపై కొత్త పాలకవర్గం కూడా కఠిన చర్యలు తీసుకొనే అవకాశాలు లేకపోలేదు.
మున్సిపల్ కమిషనర్ వివరణ
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన నిధుల దుర్వినియోగంపై కడప కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసును న్యూస్‌లైన్ వివరణ కోరగా అదంతా అవాస్తవమన్నారు. ఖర్చు చేసిన మొత్తానికి సరిపడే బిల్లులు సిబ్బంది తెచ్చిఇచ్చారన్నారు. ఇది తప్పుడు సమాచారమని ఆయన కొట్టి పారేశారు. కాగా, ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
20 రోజుల్లో రూ. 44 లక్షలు తిన్నారు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పనిచేసిన వారికి ఒక రోజుకు రిఫ్రెష్‌మెంట్స్ కోసం రూ. 150 వరకూ ఖర్చు చేసే సౌలభ్యం ఉంది. అయితే మనవాళ్లు అంతకు రెట్టింపు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీలు తెప్పించుకొని కార్పొరేషన్‌ను కాల్చుకుతిన్నారు. నామినేషన్ల సమయంలో వేళాపాళా లేకుండా తెచ్చిన భోజనం తిని చాలామందికి విరేచనాలు అయ్యాయి. దీంతో చాలామంది అప్పట్లో ఆ భోజనం తినలేదు. పోలింగ్‌కు ముందురోజు వాటర్ క్యాన్‌లకు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని కనీవినీ ఎరుగని రీతిలో వాటర్‌ప్యాకెట్లు తెచ్చి పనికానిచ్చారు.