వైఎస్సార్ సీపీ నాయకురాలు శ్రీలక్ష్మి, సీపీఎం
కార్యదర్శి బలరామ్ సహా 35 మంది అరెస్ట్
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) :డిమాండ్ల సాధన కోసం మునిసిపల్ కార్మికులు ఏలూరులో కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహిం చిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలోని 7 మునిసిపాలిటీల నుంచి కార్మికులు ఏలూరు చేరుకుని ప్రదర్శన జరిపారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. కార్మికులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోగా, తోపులాట జరి గింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికుల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. సీఎం చంద్రబాబు సింగపూర్ ఊహ ల్లో విహరిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చింతమనేని ఒక మహిళా తహసిల్దార్‌పై దౌర్జన్యం చేస్తే రాష్ట్ర కేబినెట్ ఆయనను వెనుకేసుకొస్తూ మహిళా తహసిల్దార్‌దే తప్పని మాట్లాడటం మహిళలను కించపర్చడమేనని ధ్వజమెత్తారు. పట్టణాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు పారిశుధ్య కార్మికులు తమ జీవితాలను పణంగా పెడుతున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ మునిసిపల్ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ సింగపూర్ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం మన రాష్ట్రాన్ని దోచిపెడుతోందని ధ్వజమెత్తారు.
రాజకీయ పార్టీల మద్దతు
మునిసిపల్ కార్మికుల సమ్మెకు వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ(యు) మద్దతు తెలిపాయి. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు మంతెన సీతారామ్, పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరామ్, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, ఇఫ్టూ నాయకుడు బద్దా వెంకట్రావు, ఎంసీపీఐ(యు) నాయకుడు కాటం నాగభూషణం, ఎన్‌జీవో సంఘాల నాయకులు ఎన్.హరనాథ్, యోగానంద్, నవ్యాంధ్ర హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మామూడూరి మహంకాళి తదితరులు కార్మికులకు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు.
నాయకుల అరెస్ట్
కలెక్టరేట్ ముట్టడికి హాజరైన వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, నగర శాఖ కార్యదర్శి గుడిపాటి నరసింహరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, నగర కార్యదర్శి రెడ్డి శ్రీనివాసడాంగే, ప్రజా సంఘాల నాయకులు కాటం నాగభూషణం, చింతకాయల బాబూరావు, డీఎన్‌వీడీ ప్రసాద్, పీవీ ప్రతాప్‌లతో పాటు మొత్తం 35మందిని పోలీసులు అరెస్ట్ చేసి త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కార్మికులు కలెక్టరేట్ నుంచి ప్రదర్శనగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. నాయకులను సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ కార్యక్రమానికి మునిసిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బి.సోమయ్య, నాయకులు సోమరాజు, దుర్గారావు, వివేకావతి, బి.జగన్నాథరావు, వి.సాయిబాబా, మావూరి శ్రీనివాస్, పి.కిషోర్ నాయకత్వం వహించారు.
కదం తొక్కిన మునిసిపల్ కార్మికులు
Published Sat, Jul 25 2015 2:05 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement