సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని నిరసిస్తూ శుక్రవారం 10 వామపక్ష పార్టీలు నిర్వహించిన జిల్లా బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో బంద్ ప్రభావం కనిపించింది. అన్ని చోట్లా వామపక్ష పార్టీల శ్రేణులు బంద్‌కు నాయకత్వం వహించి ముందుకు నడిపాయి. ఈ బంద్‌కు ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు వైఎస్సార్‌సీపీ, టీడీపీ, పలు ట్రేడ్‌యూనియన్లు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి. ఉదయం నుంచే అన్ని సంఘాల నేతలు ఆర్టీసీ డిపోల వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.
బంద్‌లో భాగంగా ఆర్టీసీ బస్సులను అడ్డగించడంతో పాటు వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, పెట్రోల్‌బంక్‌లు, బ్యాంకులను ఆందోళనకారులు మూసివేయించారు. ఉదయం సమయంలో జిల్లా వ్యా ప్తంగా బంద్ ప్రభావం పెద్ద ఎత్తున కనిపించినా రంజాన్ పండుగ ఉన్న కారణంగా ఆందోళనకారులు కూడా పట్టుబట్టకపోవడంతో 12 గంటల సమయానికే మళ్లీ యథాతథ పరిస్థితులు నెలకొన్నాయి. గుర్రంపోడు, పోచంపల్లి పమండలాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయగా, ఆలేరులో మంత్రి కేటీఆర్ శవయాత్ర నిర్వహించారు. మేళ్లచెరువు మండల కేంద్రంలో ఆందోళనకారులు ఓ బస్సు అద్దాన్ని ధ్వంసం చేశారు. ఆందోళనల సందర్భంగా పోలీసులు పలువురు ఆందోళనకారులు, వివిధ పార్టీల నేతలను అడ్డుకుని అరెస్టు చేసి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. మొత్తంమీద బంద్ సందర్భంగా ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసు యంత్రాం గం ఊపిరిపీల్చుకుంది.
నియోజకవర్గాల వారీగా బంద్ జరిగిన తీరిది...
నల్లగొండ : వామపక్ష పార్టీల ఆద్వర్యంలో శుక్రవారం పట్టణంలో బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులను బయటకు వెల్లకుండా అడ్డుకునేందుకు తెల్లవారుజామునే బస్టాండ్‌కు చేరుకున్న వామపక్ష పార్టీలు, టీడీపీ నాయకులు ఆర్టీసి డిపోగేటు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. బంద్‌కు మద్దతుగా డీసీసీ అధ్య క్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆలేరు : ఆలేరులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూరు(ఎం), బొమ్మలరామారం, తుర్కపల్లి, గుండాల, రాజపేట మండలాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు. ఆలేరులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. భువనగిరి : భువనగిరి బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో ఆందోళన నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కార్మికులకు సంఘీభావంగా ప్రతిపక్ష పార్టీలు ర్యాలీ నిర్వహించాయి. బీబీనగర్, భువనగిరిలో రాస్తారోకోలు, పోచంపల్లిలో బస్‌లను నిలిపివే సి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
మునుగోడు : వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన బంద్ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతమైంది. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీ డీపీ పార్టీలు మద్దతు పలికాయి. చౌటుప్పల్‌లో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీ డీపీ పార్టీల ఆధ్వర్యంలో బస్టాండ్‌లో రాస్తారోకో చేశారు. సంస్థాన్ నారాయణపురంలో రాస్తారోకో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. చండూరులో రాస్తోరోకో సందర్బంగా పోలీసులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు 10మందిని అరెస్టు చేశారు. మునుగోడులో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేర్వేరుగా బంద్ నిర్వహించారు. దేవరకొండ : వామపక్షాలు తలపెట్టిన బంద్ దేవరకొండలో పాక్షికంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల సమయంలోనే దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నేతృత్వంలో పట్టణంలో బంద్ నిర్వహించారు. నాగార్జునసాగర్ : నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే వామపక్షపార్టీలతో పాటు టీడీపీ, కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపైకి వచ్చి దుకాణాలను మూసివేయించి రోడ్డుపై ర్యాలీ తీశారు.
హుజూర్‌నగర్ : సీపీఎం, సీపీఐ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల ఆధ్వర్యంలో హుజూర్‌నగర్, గరిడేపల్లి, మేళ్లచెరువు, మఠంపల్లి, నేరేడుచర్లలలో బంద్ పాటించారు. మేళ్లచెరువులో బంద్ పాటించి రాస్తారోకో చేస్తున్న సమయంలో కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆగకుండా వెళుతుండటంతో కొందరు బస్సును అడ్డగించి అద్దాన్ని ధ్వంసం చేశారు. కోదాడ : బంద్ కార్యక్రమం కోదాడ పట్టణంలో పాక్షి కంగా, ప్రశాంతంగా జరిగింది. ఈ బంద్‌లో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ,సీపీఐ-ఎంఎల్, బీజేపీ నాయకులు పాల్గొని బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని మునగాల, మోతె, నడిగూడెం, చిలుకూరు మండలాలలో బంద్ ప్రశాంతంగా జరిగింది. మిర్యాలగూడ : ఉదయం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని దుకాణాలు బంద్ చేయించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, సినిమాహాళ్లు, పెట్రోల్ బంక్‌లు మూసి వేశారు. నియోజకవర్గంలోని దామరచర్ల, వేముపల్లిలో రాస్తారోకోలు నిర్వహించారు.
తుంగతుర్తి : తుంగతుర్తిలో వామపక్షాల బంద్ విజయవంతమైంది. తిరుమలగిరి, మోత్కూర్, శాలిగౌరారం, తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్‌లలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, గ్రామపంచాయతీ సిబ్బందిల ఆధ్వర్యంలో బంద్‌చేసి రాస్తారోకోలు జరిపారు.
నకిరేకల్ : వామపక్షాలు పిలుపు మేరకు నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కట్టంగూర్,కేతేపల్లి, చిట్యాల, రామన్నపేట, నార్కట్‌పల్లి మండలాలలో బంద్ జరిగింది. నకిరేకల్‌లో చేపట్టిన బంద్‌కు సీపీఎం, సీపీఐ, టీ డీపీ,కాంగ్రెస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్, రైతు కూలీ సంఘం, ఉపాధి హామీ సిబ్బంది మద్దతు ప్రకటించాయి. సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో అఖిలపక్షాల నాయకులు బంద్‌ను పాటించారు. బంద్‌లో భాగంగా శుక్రవారం ఉదయం 4గంటల నుంచే అఖిల పక్షాల నాయకులు పట్టణంలోని బస్‌డిపో వద్దకు చేరుకొని బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. డిపో ఎదుట ధర్నా చేస్తున్న అఖిల పక్షం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు.
బంద్ ప్రశాంతం
Published Sat, Jul 18 2015 1:08 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement