మునిసి‘పల్స్’నిధులు రాక.. పనులు పడక
Published Tue, Jan 7 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
తణుకు, న్యూస్‌లైన్ :జిల్లాలోని మునిసిపాలిటీల్లో పనులు పడకేశాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు.. కనీసం తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ వంటి పనులను సైతం చేపట్టలేని దుస్థితి నెలకొంది. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నా ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలకు 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.14 కోట్ల మేర నిధులు నిలిచిపోయాయి.
ఎన్నికలు నిర్వహించకపోవటం వల్లే...
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించకపోవటం వల్లే ఈ దుస్థితి దాపురించింది. 2010 సెప్టెంబర్ 29నాటికి మునిసిపాలిటీ పాలకవర్గాల గడువు ముగిసింది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, రాష్ట్రంలో పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో ప్రభుత్వం మొహం చాటేసింది. ప్రత్యేక అధికారులను నియమించి చేతులు దులిపేసుకుంది. ఆ తరువాత కూడా ఆరునెలలకు ఒకసారి ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ వస్తోంది. గత ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడం, సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్రలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో ఎన్నికల విషయం మరుగున పడింది.
14వ ఆర్థిక సంఘం అమల్లోకి వస్తున్నా...
జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు ఆర్థిక సంఘం పేరిట విడుదల చేస్తున్న విధంగానే పట్టణాలకు సైతం ఆర్థిక సంఘం నిధులు వస్తుంటాయి. ఐదేళ్లకు ఒకసారి కొత్త ఆర్థిక సంఘం ఏర్పాటవుతుంది. పట్టణాల్లోని జనాభా నిష్పత్తి ఆధారంగా తలసరి గ్రాంటు రూపంలో ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల అవుతుంటాయి.
పట్టణాలకు సంబంధించి 2009 ఏప్రిల్ 1నుంచి 2014 మార్చి 31వరకు 13వ ఆర్థిక సంఘం నడుస్తోంది. ఈ నిధులు ఐదేళ్లపాటు దఫదఫాలుగా మునిసిపాలిటీలకు, నగరపాలక సంస్థలకు విడుదల అవుతాయి. వీటిని మౌలిక సదుపాయూలు కల్పించేం దుకు వెచ్చిస్తారు. ప్రధానంగా తాగునీటి సరఫరా, పైపులైన్ల విస్తరణ, ముంపునీటిని తరలించేందుకు వీలుగా డ్రెరుున్ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, పారి శుధ్య నిర్వహణకు సంబంధించి మెరుగైన పనులు చేపట్టడానికి ఈ నిధులను వినియోగించాల్సి ఉం టుంది. మార్చి 31వ తేదీతో 13వ ఆర్థిక సంఘం ముగిసిపోతోంది. వచ్చే ఏప్రిల్ 1నుంచి 14వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కొత్త ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపింపాల్సిందిగా మునిసిపాలిటీలకు ఆర్థిక సంఘం కమిషన్ నుంచి ఉత్తర్వులు అందాయి.
రావాల్సిన నిధులు రూ.14 కోట్లకు పైనే
13వ ఆర్థిక సంఘం నుంచి ఏలూరు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని 8మునిసిపాలిటీలకు రూ.14 కోట్లకు పైగా నిధులు విడుదల కావాల్సి ఉంది. ఒక్క ఏలూరు నగరానికే రూ.4 కోట్లు నిలిచిపోగా, భీమవరం పట్టణానికి రూ.3 కోట్లు, పాలకొల్లుకు రూ.2.95 కోట్లు, తణుకు మునిసిపాలిటీకి రూ.70 లక్షలు, నిడదవోలుకు రూ.60 లక్షల చొప్పున నిలిచిపోరుునట్టు అధికారులు చెబుతున్నారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో మునిసిపాలిటీల్లో తాగునీటి సరఫరా, ఇతర పనుల నిర్వహణకు నిధుల అవసరం అధికంగా ఉంటుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహిస్తే తప్ప ఆర్థిక సంఘం నిధులకు మోక్షం కలిగే పరిస్థితి కనిపించడం లేదు.
Advertisement