మున్నంగి ఇసుక రీచ్‌లో అక్రమ వసూళ్లు
లబోదిబోమంటున్న లారీ డ్రైవర్లు
చర్యలు తీసుకుంటానన్న సీసీ
మున్నంగి (కొల్లిపర) : మండలంలోని మున్నంగి గ్రామ సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లో అక్రమ వసూళ్ల పర్వం కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా మహిళల చాటున అధికార పార్టీ నేత ఆధ్వర్యంలో సాగుతున్న ఈ రీచ్‌లో లారీ డ్రైవర్ల వద్ద నగదు వసూలు చేస్తున్నారు. ఇసుకను లారీలకు లోడ్ చేసే సమయంలో ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేనప్పటికి రూ.300 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే లోకల్ లారీల నుంచి కాకుండా గుంటూరు నుంచి వచ్చే వాటి నుంచి ఈ దందా చేస్తున్నారు. ఇలా రోజుకు 20కిపైగా లారీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేమని అడిగిన డ్రైవర్లకు మాత్రం ఇసుక ఎక్కువ లోడ్ చేస్తున్నాం కాబట్టి వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. దీంతో లారీ డ్రైవర్లు చేసేదేమీ లేక లోడ్ చేయించుకుని నిర్వాహకులు అడిగిన మేర ఇచ్చేస్తున్నారు. దీనిపై క్లస్టర్ కో ఆర్డినేటర్ (సీసీ) ఐ.ప్రసాద్‌ను వివరణ కోరగా అక్రమ వసూళ్లు జరుగుతున్న మాట వాస్తవమేనని చెప్పారు. రెండు మూడు రోజులుగా అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు తనకు కొందరు డ్రైవర్లు ఫిర్యాదు చేశారని, దీనిపై నిర్వాహకులను హెచ్చరించానని తెలిపారు. ఇకనుంచి అక్రమ వసూళ్లు లేకుండా చూస్తానన్నారు.
డంప్ చేయనున్నారా...
ఫ్రిబవరి నెల నుంచి నూతన పద్ధతిలో ఇసుక రీచ్‌లకు వేలం పాటల ద్వారా నిర్వహణ ఉంటుందనే ప్రచారం రావడంతో మున్నంగి రీచ్‌లోని ఇసుకను నది ఒడ్డున డంప్ చేసేందుకు చర్యలు ప్రారంభించారు. నది ఒడ్డున ఉన్న ఖాళీ ప్రాంతంలో భూమిని చదును చేసి శుభ్రం చేశారు. గత డిసెంబర్ 2వ తేదీన 41 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సోమవారం వరకు 22 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను రవాణా చేయగలిగారు. ఈ విషయంపై సీసీ ఐ.ప్రసాద్ వివరణ కోరగా పీడీ లేదా కలెక్టర్ అనుమతి మేరకు డంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. డంప్ చేసేందుకు అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు.