గుడివాడ, న్యూస్‌లైన్: గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కౌన్సిలర్లు తమ సత్తా నిరూపించుకోనున్నారు. గత అనుభవాలకు పదును పెట్టి ప్రచారంలో ముందుకు దూసుకెళుతున్నారు. గుడివాడ మున్సిపాల్టీలో ఉన్న 36 వార్డుల్లోనూ ఇరు ప్రధాన పార్టీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు 18చోట్ల 19 మంది పోటీలో ఉన్నారు. వీరిలో వైఎసార్‌సీపీనుంచి 12మంది , టీడీపీ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు చొప్పున తలపడుతున్నారు.
వార్డుల కేటాయింపు లోనే వైఎస్సార్‌సీపీ సామాజిక సమతూకం పాటించడంతో పాటు ఆయా వార్డుల్లో ప్రజాదరణ కలిగిన వారిని మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) నాయకత్వంలో ఎంపిక చేశారు. 36 వార్డులకు గానూ 19 వార్డుల్లో బీసీ అభ్యర్థులకు స్థానం కల్పించి పెద్ద పీట వేశారు.
మాజీల గురి వీటిపైనే....
గుడివాడ పట్టణ బరిలో దిగిన ఏ ఇద్దరూ మాజీలు ప్రత్యక్ష పోరుకు తలపడే అవకాశాలు లేవు. ప్రధానపార్టీల అభ్యర్థులైన మాజీలతో తలపడే వారంతా కొత్తవారు కావడం విశేషం. 7వ వార్డునుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీలో ఉన్న అడపా బాబ్జీ గతంలో రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేశారు. ఈయనపై టీడీపీ నుంచి ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని నిలబెట్టారు. 8వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని వెంపల హైమావతి రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిచారు.
ఇక్కడ కూడా టీడీపీది ఇదే పరిస్థితి. 9వ వార్డులో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా యలవర్తి శ్రీనివాసరావును రంగంలో దింపారు. ఈయన గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గానూ, కోఆప్షన్ సభ్యుడుగానూ పనిచేసిన అనుభవం ఉంది. ఈ వార్డులో రాధాకృష్ణ అనే వ్యక్తిని టీడీపీ పోటీకి దింపింది. చివరి నిమిషంలో ఈయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. 10వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా షేక్ గౌస్ భార్యా హర్షతున్నీసా పోటీలో ఉన్నారు.
గతంలో భార్యాభర్తలు ఇద్దరూ కౌన్సిలర్‌గా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు. 11వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఫాతీమున్నీసాది మాజీ కౌన్సిలర్ కుటుంబమే. 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ తరపున పోటీలో ఉన్న మేరుగు మరియ కుమారి మాజీ కౌన్సిలర్. వార్డు ప్రజలతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా ఆమెకే పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చారు. 14వ వార్డులోటీడీపీ తరఫున పోటీలో ఉన్న కొయిలాపు పార్వతి భర్త కొయిలాపు కృష్ణ గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఈమెపై వైఎస్సార్‌సీపీ నుంచి జ్యోతుల సత్యవేణి పోటీ పడుతున్నారు.
15వవార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గంధం జూలీయమ్మ కుటుంబం నుంచి ఇప్పటికే మూడుసార్లు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. 19వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గణపతి లక్ష్మణరావు మునుపటి కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఆయనపై టీడీపీ కొత్త అభ్యర్థిని నిలబెట్టింది. 20 వార్డులో టీడీపీ చైర్మన్ అభ్యర్థి లింగం ప్రసాద్ భార్య గతంలో కౌన్సిలర్. ఆయనపై మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి బాబాయి వరుసఅయ్యే గిరిబాబాయి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీకి దిగుతున్నారు.
23వ వార్డులో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు భార్యా పద్మావతి బరిలో ఉంది. ఈయన గతంలో రెండుపర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆయనపై వైఎస్సార్ సీపీ నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన జిల్లా సుధారాణి పోటీచేస్తున్నారు. 24వ వార్డులో టీడీపీనుంచి మాజీ కౌన్సిలర్ రేమల్లి కమల కుమారికి చివరి నిమిషంలో పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆమేపై వైఎస్సార్‌సీపీ నుంచి యువకుడు చోరగుడి రవికాంత్ పోటీలో ఉన్నారు.
27 వవార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బెజవాడ నాగలక్ష్మీ గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. నాగలక్ష్మీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ఆమెకు అవకాశం కల్పించారు. 31వ వార్డు అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ వంగలపూడి కనకబాబు భార్యా వంగలపూడి వెంకటలక్ష్మీ పోటీలో ఉన్నారు. ఈమెపై పోటీలో ఉన్న అభ్యర్థి కొత్తవారే. 33వ వార్డులో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీలో ఉన్న నెరుసు చింతయ్య నాల్గవసారి విజయానికి సిద్ధంగా ఉన్నారు.
35వ వార్డులో సింగిరెడ్డి పుణ్యవతి గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆమెపై టీడీపీ అభ్యర్థి మేరీసంతోషం తొలిసారిగా పోటీకి దిగుతున్నారు. 36 వవార్డులో గొరిపర్తి కనకదుర్గ టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగొర్ల శ్రీను తలపడుతున్నారు. ఏది ఏమైనా మాజీలు తమభవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.
మున్సి‘పోల్స్’పై మాజీల గురి!
Published Sat, Mar 22 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM
Advertisement
Advertisement