పనుల పందేరం
పనుల పందేరం
Published Thu, Feb 27 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM
రాజాం, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ, ప్రజా ప్రతినిధుల పదవీకాలం దాదాపు ముగిసిపోయింది. కొద్దిరోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయడంతో అటు ప్రభుత్వం.. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అంపశయ్య మీదకు చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల వైపు క్యూ కడుతున్నారు. దీంతో బెంబేలెత్తిన రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేజారిపోకుండా తాయిలాల ఎర వేస్తున్నారు. పనుల పందేరం చేపట్టి వారిని కట్టడి చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. హడావుడిగా ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి సామాజిక అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు రూ.8.93 లక్షలు కేటాయించారు. ఈ మేర కు ఆర్‌సి నెం.49/12/ సిడిపి/ఎంఎల్‌ఏక్యూ/ఆర్‌జెఎం/17-2-14తో నిధులు విడుదల చేస్తు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులను నామినేషన్ పద్ధతిలో చేయిం చాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రాజాం మండలం కంచరాం-డిఆర్‌వలస రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి రూ.1.60 లక్షలు, వి.ఆర్.అగ్రహారంలో పైపులైన్ల విస్తరణకు రూ.50 వేలు, అంతకాపల్లిలో బోరువెల్ ఏర్పాటుకు రూ.60 వేలు, బొద్దాంలో అదనపు విద్యుత్ పోల్స్ ఏర్పాటుకు రూ.14,776, రాజయ్యపేటలో ఎల్.టి.లైన్ ఏర్పాటుకు రూ.32,416, బొద్దాంలో ఎల్.టి.లైన్ పోల్ మార్చడానికి రూ.5,714, 11 కె.వి.లైన్ మార్చడానికి రూ.90,305, మారేడుబాక, ఎం.జె.వలసగ్రామాల్లో వీధిలైట్ల ఏర్పాటుకు రూ.50 వేలు చొప్పన మంజూరు చేశారు. వంగర మండలం కొట్టిశలో మత్య్సకారుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.లక్ష, సంతకవిటి మండలం గోళ్లవలస జంక్షన్ వద్ద బస్సు షెల్టర్ నిర్మాణానికి రూ. 2 లక్షలు, మిర్తివలస, మండాకురిటిలలో రెండు బోర్‌వెల్స్ నిర్మాణానికి రూ.1.20 లక్షలు మంజూరు చేశారు. రేగిడిలో గోపెంపేటలో మరో నిర్మాణానికి రూ. 60 వేలు మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులను ద్వితీయ శ్రేణి నాయకులకు కట్టబె ట్టడానికి చకచక సన్నాహాలు సాగుతున్నాయి. అధికారం చివరి దశలో మంజూరైన ఈ పనులను దక్కించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు పైరవీలు ప్రారంభించారు.
Advertisement
Advertisement