Yogita Bhayana: కింగ్‌ఫిషర్‌ టూ పరి..బాధితుల కోసం ‘భయనా’ | Yogita Bhayana the woman activist for Nirbhaya movement | Sakshi
Sakshi News home page

Yogita Bhayana: కింగ్‌ఫిషర్‌ టూ పరి..బాధితుల కోసం ‘భయనా’

Published Sat, Dec 4 2021 2:47 PM | Last Updated on Sat, Dec 4 2021 3:12 PM

Yogita Bhayana the woman activist for Nirbhaya movement sakshi special story - Sakshi

ఢిల్లీకి చెందిన యోగిత భయనా అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడం కోసం ఏవియేషన్‌ కెరీర్‌ నుంచి బయటకు వచ్చి ‘పరి (పీపుల్‌ అగైనెస్ట్‌ రేప్‌ ఇన్‌ ఇండియా)’ అనే ఎన్‌జీవో స్థాపించింది. వాళ్లకు పునరావాసం, పోషణ, న్యాయపోరాటంతోపాటు చదువు కూడా చెప్పిస్తోంది. వినడానికి ఇది రెండు వాక్యాల విషయం లాగానే అనిపిస్తుంది. కానీ...ఈ ప్రస్థానంలో ఆమె దరి చేర్చిన జీవితాల సంఖ్య ఎంత పెద్దదంటే ఓ వెయ్యికి పైగానే. అంతమంది బాధితుల జీవితాలను గాడిన పెట్టడంలో నిమగ్నమైన యోగిత తనకు అత్యంత పెద్ద సవాల్‌ న్యాయవ్యవస్థలో నెలకొన్న జాగు అని చెప్తోంది. నిర్భయ పోరాటంలో నిర్భయ తల్లికి అండగా నిలిచిన యోగిత జీవిత ప్రస్థానం ఇది.

చిన్నప్పటి నుంచి యాక్టివ్‌
యోగిత పద్నాలుగేళ్ల నుంచే సామాజిక సేవలో చురుగ్గా ఉండేది. ట్యూషన్‌లు చెప్పి ఆ డబ్బును వార్ధక్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ఆర్థిక సహాయం చేసేది. స్కూల్‌ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోపాటు సామాజకి కార్యకర్తగా ఎదిగింది. ఆ తర్వాత ఉమెన్‌ యాక్టివిస్ట్‌గా ఒక స్పష్టమైన దారిని ఎంచుకుంది. కెరీర్‌ పరంగా ఏవియేషన్‌ రంగం మీద ఏర్పడిన క్రేజ్‌తో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో చేరింది. కానీ ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయిందామె. జీవితంలో గొప్ప రిలీఫ్‌ పొందిన క్షణం ఏదంటే ఉద్యోగం మానేసినరోజేనంటోంది యోగిత. తన జీవితాన్ని సామాజిక సేవలో నిర్బంధించిన సంఘటనను గుర్తు చేసుకుంటారామె.

కట్టిపడేసిన సంఘటన
‘‘ఓ రోజు రోడ్డు మీద నా కళ్ల ముందే ఓ యాక్సిడెంట్‌ జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. గాయపడిన వ్యక్తిని కాపాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను, నా ఫ్రెండ్‌ ధైర్యం చేసి అతడిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. ఆ ప్రభుత్వ వైద్యశాలలో గాయపడిన వ్యక్తికి వైద్యం చేయడానికి అవసరమైన పరికరాలు కూడా సరిగ్గా లేవు. అన్నీ సమకూర్చుకుని వైద్యం మొదలుపెట్టేలోపు ఆలస్యం అయిపోయింది. అతడు దక్కలేదు. అతడి భార్య, బిడ్డలు దిక్కులేని వాళ్లయిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ సంఘటన వెంటాడుతూనే ఉండేది. నిద్రపోవడానికి కళ్లు మూసుకుంటే ఆ కుటుంబమే కళ్ల ముందు మెదిలేది. ఆలోచించే కొద్దీ పేదరికం ఎంత నరకమో అర్థం కాసాగింది. నిజానికి నన్ను మేల్కొలిపిన సందర్భం అది. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. కోర్టులో సాక్ష్యం చెప్పాను. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం లభించే వరకు వారికి సహాయంగా ఉన్నాను. ఆ సంఘటన రగిలించిన ఆవేదనతో 2007లో దాస్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ను స్థాపించాను. రోడ్డు ప్రమాదాల పట్ల చైతన్యవంతం చేయడం, కళ్ల ముందు ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలనే అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించాం. 

సేవామార్గంలో మలుపు
నా కార్యకలాపాలు ఇలా కొనసాగుతుండగా 2012 లో నిర్భయ ఘటన జరిగింది. దేశరాజధానిలో ఒక యువతి అమానవీయంగా అత్యాచారానికి గురి కావడం, ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస వదలడం గుర్తుండే ఉంటుంది. దేశాన్ని కుదిపేసిన ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ న్యాయపోరాటంలో తీర్పు రావడానికి ఏళ్లు పట్టింది. ఆంత కాలం నిర్భయ తల్లికి అండగా ఉన్నాను. ఆ సమయంలో నాకు ఎంతోమంది నుంచి వినతులు వస్తుండేవి. ‘మాకు కూడా ఇలాగే జరిగింది. న్యాయపోరాటం చేయాలంటే మాకు తోడుగా ఎవరూ రావడం లేదు’ అంటూ తమకు సహాయం చేయమని అడిగేవాళ్లు. తరచూ కోర్టుకు వెళ్లాల్సి రావడంతో మరికొన్ని సంగతులు కూడా తెలిశాయి. నిర్భయ కేసు... సామాన్యుల నుంచి పాలకుల వరకు అందరి దృష్టిలో పడింది కాబట్టి అప్పటికైనా విచారణ పూర్తి చేసుకుని తీర్పుకు నోచుకుంది.

పదిహేనేళ్లు దాటినా కూడా అతీగతీ లేకుండా కాగితాల్లో మూలుగుతున్న కేసులు లెక్కకు మించి ఉన్నాయని తెలిసింది. ఒక యాక్టివిస్టుగా నేను చేయల్సిన పని చాలా ఉందనిపించి పరి ఎన్‌జీవోను స్థాపించాను. ఈ వేదిక ద్వారా సహాయం పొందిన బాలికలు, యువతులు, మహిళల వివరాలను చెప్పలేను. కానీ వెయ్యికి పైగా జీవితాలు గాడిలో పడ్డాయని చెప్పగలను. వాళ్ల తరఫున న్యాయపోరాటం చేయడం, పునరావాసం కల్పించడం, చదువుకునే వాళ్లను చదివించడం వంటివన్నీ చేస్తున్నాను. అత్యాచార బాధితులతోపాటు ఒంటరి మహిళలకు కూడా మా దగ్గర కారు డ్రైవర్, కారు క్లీనర్, హౌస్‌ కీపింగ్‌ వంటి పనుల్లో శిక్షణ తీసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు’’ అని చెప్పింది యోగిత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement