ప్రతిపక్ష నేత హత్యకు కుట్ర కేసులో... 10 అంకాలు | Murder Attempt On YS Jagan Case Handed Over To NIA By Central Govt | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 5 2019 4:18 AM | Last Updated on Sat, Jan 5 2019 12:06 PM

Murder Attempt On YS Jagan Case Handed Over To NIA By Central Govt - Sakshi

అక్టోబరు 25, 2018.. 
మ.12.45 గం.–12.48 గం. : విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై నిందితుడు జునుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
మ.1.30గం. : డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నిందితుడు పేరు, ఊరు వెల్లడించి అతను వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు, జగన్‌ అభిమాని అని ప్రకటించారు. ప్రచారం కోసమే హత్యాయత్నం చేశాడని వెల్లడించారు.  
 
మ.2గం. : వైఎస్‌జగన్‌ బొమ్మతో ఉన్న ఫ్లెక్సీని ముగ్గురు మంత్రులు మొబైల్‌లో చూపించారు.  
(సా.4 గంటలు దాటిన తర్వాత సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4.30 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సీఆర్‌పీసీ–156 ప్రకారం.. ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ అయిన తర్వాత విచారణకు అవకాశం ఉంటుంది. సా.4.30 వరకు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వలేదని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. స్వయంగా సీఎంయే నిందితుడిని 4.30 తర్వాత కస్టడీలోకి తీసుకున్నామని చెబితే... అంతకు 3 గంటల ముందే డీజీపీ, మంత్రులు అన్ని వివరాలు ఎలా చెప్పగలిగారు?)  
 
మ.3.30గం. : తూర్పుగోదావరి జిల్లా ఠాణేలంకలోని నిందితుడు శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న స్థానిక టీడీపీ నేతలు. శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ అభిమాని అని ప్రకటన. మారుమూల ఉన్న ఆ ఇంటికి అంత తక్కువ సమయంలో ఎలా చేరుకోగలిగారు? 
  
రాత్రి 7గం. : సీఎం చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సానుభూతి కోసమే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం నాటకం ఆడారని ప్రకటించారు.   

1.ఏడాదిన్నర క్రితమే హత్యకు కుట్ర.. 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను హతమార్చడానికి చేసిన కుట్రకు బీజం.. హత్యాయత్నం జరగడానికి ఏడాదిన్నర ముందే ప్రారంభమైంది. జగన్‌ గొంతులో కత్తిదింపి అంతమొందించడానికి నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును ఏడాదిన్నర క్రితమే ఎంపిక చేసుకుని ఆ కుటుంబానికి ‘అన్నీ’ సమకూర్చారన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఆ కుటుంబం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని తమ స్వగ్రామం ఠానేలంకలో చకచకా ఇంటిని నిర్మిస్తుండటం ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఆ ఇంటి నిర్మాణానికి అధికార పార్టీ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం.. ఠానేలంకలోని నిందితుడి కుటుంబం నిర్మిస్తున్న ఇంటిని చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.  సాధారణంగా రోజువారీ కూలీ మీద జీవనం సాగిస్తున్న కుటుంబం ఉన్నట్లుండి ఇంటి నిర్మాణానికి రూ.20 లక్షలు వ్యయం చేయడానికి సిద్ధపడటం అనుమానాలను రేకెత్తిస్తోంది. నిందితుడి కుటుంబం ఠానేలంక గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణం చేపట్టి 60 శాతానికి పైగా పూర్తిచేసింది. ఇప్పటివరకు రూ.12 లక్షలు ఖర్చు చేశామని నిందితుడి తల్లి సావిత్రమ్మ చెప్పారు. ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణ పథకం కింద అందింది రూ.2 లక్షల లోపే. మిగతా రూ.10 లక్షలు వారి చేతి నుంచే పెట్టారు. 

ప్రశ్న : విపక్ష నేతను హత్య చేయడానికి రూపొందించిన ప్రణాళికలో నిందితుడు శ్రీనివాసరావును ‘ఇన్‌స్ట్రుమెంట్‌’గా వాడటానికి అప్పుడే ఎంపిక చేసుకున్నారని ‘ఇంటిగుట్టు’ చెప్పకనే చెబుతోంది. నిందితుడి కుటుంబానికి ఉన్నట్లుండి అంత సొమ్ము ఎలా వచ్చిందనే దిశగా ‘సిట్‌’ దర్యాప్తు ఎందుకు చేయలేదు? 

2.నిందితుడి కుటుంబం పక్కా టీడీపీ.. 
పీఎంఏవై–ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద ఠానేలంకలో 143 ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తే.. అవన్నీ టీడీపీ కార్యకర్తలకు, ఆ పార్టీ సానుభూతిపరులకే దక్కాయి. ఈ పథకంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు వాటిని మంజూరు చేయకపోవడం గమనార్హం. ప్రతిపక్షానికి చెందిన 16 మందికి అన్ని అర్హతలున్నాయని అధికార యంత్రాంగం నిర్ధారించిన తర్వాత కూడా ఇళ్లు మంజూరు చేయలేదు. ‘నిందితుడి కుటుంబం వైఎస్సార్‌సీపీ అయితే ఇల్లు వచ్చేదా? ఇంటి నిర్మాణంలోనూ నిబంధనలను ఉల్లంఘించినా.. వైఎస్సార్‌సీపీకి చెందిన కుటుంబమే అయితే టీడీపీ వాళ్లు చూస్తూ ఊరుకునే వారేనా?’.. అని నిందితుడు శ్రీనివాసరావు బాబాయి, టీడీపీ నాయకుడు, గ్రామ ఉప సర్పంచ్‌గా పనిచేసిన జనుపల్లి నాగేశ్వరరావు ప్రశ్నించడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు.. తమకు అన్ని అర్హతలున్నా ఇళ్లు మంజూరు చేయలేదని, నిర్మాణ సామగ్రి సమకూర్చుకున్న తర్వాత మంజూరు జాబితాలో తమ పేర్లు లేకుండా తొలగించారని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు వెల్లడించారు. శ్రీనివాసరావు కుటుంబం టీడీపీనే అంటూ ఇటు నిందితుడి బాబాయి నాగేశ్వరరావు చెప్పడం, తమకు అన్ని అర్హతలున్నా కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే ఏకైక కారణంతోనే ఇళ్లు ఇవ్వలేదని మిగతా వారంతా చెప్పడం ద్వారా శ్రీనివాసరావు కుటుంబానిది ఏ పార్టీ అనే విషయం స్పష్టమవుతోంది. నిందితుడి స్నేహితులు, ఇరుగుపొరుగు వారూ.. శ్రీనివాసరావు కుటుంబం టీడీపీనే అని చెప్పారు. 

వైఎస్సార్‌సీపీ అయితే రెండు ఇళ్లు ఇస్తారా? 
మా రోడ్డులో ఇళ్లు కట్టుకునే వాళ్లకు లోన్‌ ఇవ్వలేదు. పిల్లర్లలోనే ఇళ్లు ఆగిపోయాయి. ఇలాంటి (శ్రీనివాసరావు కుటుంబానికి) వాళ్లకు రెండు లోన్లు ఇచ్చారు.     ఒకసారి ఆ పార్టీ, మరోసారి ఈ పార్టీ అంటూ సుబ్బరాజు (శ్రీనివాసరావు సోదరుడు) అంటున్నారు. టీవీల్లో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. సుబ్బరాజు వాళ్లకు 2 లోన్లు ఎలా ఇచ్చారో తెలుసుకోండి. అందరూ బేస్‌మట్టం వేసుకుని లోన్లు కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరికీ వైఎస్సార్‌సీపీ అని ఇవ్వలేదు. మరి సుబ్బరాజు వాళ్లకు 2 లోన్లు ఎలా ఇచ్చారు? కనుక్కోండి. కాగిత బాబూజీ వైఎస్సార్‌సీపీ అని లోన్‌ ఇవ్వలేదు. సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటున్నాడు. మరి సుబ్బరాజుకు రెండు ఎలా ఇచ్చారు? ముందేమో టీడీపీ, తర్వాత ఎవరికి పడితే వారికి వేస్తాం. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అంటున్నారు. ప్రజలకు అంతా అర్థం అవుతోంది.  వాళ్లలో పశ్చాత్తాపంలేదు. మేం హడలిపోతున్నాం. వాళ్లేమో డేర్‌గా మాట్లాడుతున్నారు. మాకేమీ అర్థం కావడంలేదు.   
– జనుపల్లి నాగేశ్వరరావు (శ్రీనివాసరావు బాబాయి, ఠానేలంకకు ఉప సర్పంచ్‌గా పనిచేశారు. టీడీపీ నాయకుడు) 

ఏకగ్రీవంగా ఎన్నికైనా వైఎస్సార్‌సీపీ అని ఇల్లు ఇవ్వలేదు 
లోన్‌ పెట్టుకుంటే పార్టీవల్ల ఇవ్వడంలేదు. మా లోను కాగితాలు పక్కనబెట్టేశారు. ఏకగ్రీవంగా నన్ను ఠానేల్లంక పంచాయితీలో 8వ వార్డు మెంబర్‌గా ఎన్నుకున్నారు. మూడుసార్లు పంచాయితీకి వెళ్లి అప్లై చేశాను. పంచాయితీలో కనీసం కాగితాలు కూడా లేకుండా చేశారు. ఇల్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నాం. మా వార్డులో అంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నా నాకు మాత్రం ఇంటి లోను ఇవ్వడం లేదు. నా మరిది రాంబాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కన్వీనర్‌గా ఉన్నారని నాకు ఇల్లు ఇవ్వబోమంటున్నారు. అదేమని అడిగితే మీ పార్టీ వాళ్లకు ఇళ్లు ఇవ్వబోమని చెబుతున్నారు. 
– నక్కా అమృతవల్లి, బలుసుల్లంక, ముమ్మిడివరం 

ప్రశ్న : ఠానేలంకలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల్లో ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయలేదు. ఇల్లు మంజూరైన నిందితుడు శ్రీనివాసరావు మాత్రం వైఎస్సార్‌సీపీ అని టీడీపీ ప్రచారం చేస్తోంది. దీనివెనక ఉన్న అంతరార్థం ఏమిటి? 

3.తర్వాత అంకం ‘ఫ్లెక్సీ నాటకం’.. 
ఇంటి నిర్మాణానికి అన్ని రకాలుగా సహకారం అందించిన తర్వాత నిందితుడు, కుట్ర సూత్రధారుల మధ్య పరస్పరం నమ్మకం ఏర్పడి ఉండవచ్చు. తర్వాత అంకంలో.. నిందితుడిని జగన్‌ అభిమానిగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నంలో ‘ఫ్లెక్సీ నాటకం’  మొదలుపెట్టారు. కుట్రను అమలుచేయడానికి ఎంపిక చేసుకున్న జనుపల్లి శ్రీనివాసరావును జగన్‌ అభిమానిగా చిత్రీకరించడానికి వీలుగా 2018 జనవరి 1న నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీని.. సూత్రధారుల సూచనలకు అనుగుణంగా ఠానేలంకలో ఏర్పాటుచేశారు. హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే.. ఎక్కడో మారుమూల గ్రామంలో దాదాపు 10 నెలల క్రితం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ సమాచారాన్ని పోలీసులు వెల్లడించడం వెనక.. ‘సూత్రధారుల ప్రణాళిక’ ఉందనేది స్పష్టం. 

ప్రశ్న : జగన్‌ మీద హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే నిందితుడు జగన్‌ అభిమాని అని, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ (2018 జనవరి 1న) ఫ్లెక్సీ కూడా వేయించారని పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ఫ్లెక్సీ పీడీఎఫ్‌ కాపీని పోలీసులు విడుదల చేశారు. హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే.. 10 నెలల క్రితం వేయించిన ఫ్లెక్సీ గురించి పోలీసులకు ఎవరు చెప్పారు?   పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు? 

దొంగలను పట్టించిన ‘రోజాపూలు’ 
హత్యాయత్నం జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీలో రోజాపూలు లేవు. ‘రోజాపూలు లేకుండా ఫ్లెక్సీ పీడీఎఫ్‌ను జనుపల్లి శ్రీనివాసరావు ఆమోదం కోసం లేపాక్షి ప్రింటర్స్‌లో పనిచేస్తున్న చైతన్య స్నేహితుడు 2017 డిసెంబర్‌ 30న చైతన్య (శ్రీనివాసరావుకు బంధువు)కు మెయిల్‌ పంపించాడు. అయితే, శ్రీనివాసరావు నేరుగా పి.గన్నవరంలోని లేపాక్షి ప్రింటర్స్‌కు వచ్చి మెయిల్‌లో పంపించిన ఫ్లెక్సీ నమూనాకు కొద్దిపాటి మార్పులు చేశాడు. రోజాపూలు ఉండాలని ఫ్లెక్సీలో పెట్టించాడు. రోజాపూలు పెట్టిన తర్వాత ఫ్లెక్సీ నా ప్రింటర్స్‌లోనే ప్రింట్‌ చేసి పట్టుకెళ్లాడు’ అని చెప్పారు.
–ఫ్లెక్సీని ప్రింట్‌ చేసిన లేపాక్షి ప్రింటర్స్‌ యజమాని అయ్యప్ప

ఫ్లెక్సీ చిరిగిపోతే రోజాపూలు అంటించారు 
లేపాక్షి ప్రింటర్స్‌ యజమాని అయ్యప్ప చెబుతున్న దానికి, నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు చెబుతున్న విషయానికి పొంతనలేదు. ‘ఫ్లెక్సీ కట్టిన తర్వాత అది చిరిగిపోయింది. ఫ్లెక్సీ చిరిగిపోయిందని శ్రీనివాసరావు బాధపడి.. చినిగిన చోట రోజాపూలు బొమ్మతో ప్యాచ్‌ అతికించాడు. అందువల్ల పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీ పీడీఎఫ్‌ కాపీలో రోజాపూలు లేవు. పోలీసులకు లభించిన ఫ్లెక్సీలో రోజాపూలున్నాయి’. 
– సుబ్బరాజు (శ్రీనివాసరావు అన్న) 

అయ్యప్ప మాటలపైనా అనుమానాలు.. 
నిందితుడు శ్రీనివాసరావు స్వయంగా తమ ఆఫీసుకు వచ్చి రోజాపూలు పెట్టించుకుని ఫ్లెక్సీ ప్రింట్‌ తీసుకెళ్లాడని లేపాక్షీ ప్రింటర్స్‌ యజమాని అయ్యప్ప చెప్పారు. మరి రోజాపూలతో ఉన్న ఫ్లెక్సీ పీడీఎఫ్‌ కాపీ చూపించమని అడిగినప్పుడు.. ఓఎస్‌ (ఆపరేటింగ్‌ సిస్టం) పోయిందని, అందువల్ల 2017 డిసెంబరు ఫైళ్లు పోయాయని చెప్పారు. నిజానికి.. అయ్యప్ప చెబుతున్న మాటల్లో వాస్తవంలేదు. ‘ఓఎస్‌ పోతే.. మొత్తం ఫైళ్లు పోతాయి. ఒక నెల, ఒక వారం ఫైళ్లు మాత్రమే పోయే అవకాశం లేదు’ అని ఐటీ నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా డిసెంబర్‌ ఫైళ్లు మాత్రమే పోయాయని చెప్పడం అనుమానాలకు దారితీస్తోంది. 

‘ఎస్‌ఆర్‌టి ప్రింటర్స్‌’ కథ ఏమిటి? 
పోలీసులు బయటపెట్టిన ఫ్లెక్సీ.. ఎస్‌ఆర్‌టీ ప్రింటర్స్‌లో ప్రింట్‌ చేయించినట్లు ఫ్లెక్సీ కింద ముద్రించారు. ఎస్‌ఆర్‌టీ ప్రింటర్స్‌ అనేది ఎక్కడా లేదు. ఆ ప్రింటర్స్‌ పేరిట ఫ్లెక్సీలో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ లేపాక్షి ప్రింటర్స్‌ యజమాని అయ్యప్పది. ఇదే విషయాన్ని అయ్యప్పను అడిగితే.. ‘నా దగ్గర పనిచేసే కుర్రాడు తెచ్చుకునే ఆర్డర్స్‌ (వ్యాపారం)కు ఎస్‌ఆర్‌టీ ప్రింటర్స్‌ అని వేస్తామ’ని సమాధానం ఇచ్చారు. మరి ఫోన్‌ నంబర్‌ ఆ కుర్రాడిది కాకుండా.. యజమాని నంబర్‌ ఎందుకు పెట్టారనే ప్రశ్నకు సమాధానంలేదు. 


ప్రశ్న : ఫ్లెక్సీ ప్రింట్‌ చేసిన లేపాక్షి ప్రింటర్స్‌ యజమాని.. ఫ్లెక్సీలో రోజాపూలున్నాయని చెప్పారు. నిందితుడు సోదరుడు అందుకు భిన్నంగా.. ఫ్లెక్సీలో రోజాపూలు లేవు.. ఫ్లెక్సీ చినిగిపోతే ప్యాచ్‌లాగా రోజాపూలు బొమ్మ అతికించారని చెప్పారు. పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీ పీడీఎఫ్‌లో రోజాపూల బొమ్మ లేదు. పోలీసులు కనుక్కున్నామని చెబుతున్న ఫ్లెక్సీలో మాత్రం రోజాపూల బొమ్మ ఉంది. నిందితుడు కట్టిన ఫ్లెక్సీ ఒకే ఒకటి. ఈ పొంతనలేని సమాధానాలే చెబుతున్నాయి కదా ఇందులో ఏదో మతలబు దాగి ఉందని? ఈ దిశగా ఎందుకు విచారణ చేయలేదు? 

4.కుట్ర అమల్లో తదుపరి ఘటం.. విమానాశ్రయ ప్రవేశం 
కుట్ర అమలుకు విమానాశ్రయాన్ని ఎన్నుకోవడం వెనకా సూత్రధారులు పెద్ద కసరత్తే చేశారు. ప్రజల్లో జగన్‌ మీద పాశవిక దాడి చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో.. పెద్దగా జనంలేని ప్రాంతాన్ని కుట్రదారులు ఎంపిక చేసుకున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతమైతే.. హత్య తర్వాత పరిణామాల్లో తమ చేతులకు మట్టి అంటకుండా బయటపడొచ్చనే ఆలోచన కుట్రదారులకు ఉందని స్పష్టమవుతోంది. విమానాశ్రయంలోకి నిందితుడిని తీసుకెళ్లడానికి ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని, టీడీపీ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడు హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరి మార్గం సుగమం చేశారు. నిందితుడు శ్రీనివాసరావు మీద ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైన విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా.. నిందితుడికి ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) జారీ వెనక టీడీపీ నేతల ఒత్తిడి ఉందని అనుకోవచ్చు. దరఖాస్తుదారుడికి నేర చరిత్రలేదని నిర్ధారించడానికి మొట్టమొదట చేసే పని.. సొంత ఊరు పోలీస్‌స్టేషన్‌లో వాకబు చేయడం. సంబంధిత జిల్లా ఎస్పీకి లేఖ రాసి దరఖాస్తుదారుడి నేర చరిత్ర తెలుసుకుంటారు. దాడి చేయడం, చంపుతానని బెదిరించిన ఘటనలో ముమ్మిడివరంలో శ్రీనివాసరావు మీద కేసు నమోదైంది. నేర చరిత్రను దాచి, నిందితుడికి ఎన్‌వోసీ తెప్పించి నిందితుడిని విమానాశ్రయ ప్రవేశం చేయించడంలో సూత్రధారులు విజయవంతమయ్యారు. 

ముమ్మిడివరం పీఎస్‌లో కేసు 
2017 మార్చి 2న ముమ్మిడివరం పోలీసుస్టేషన్‌లో నిందితుడు శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఓ వివాహ వేడుకలో తనపై దాడిచేసి కొట్టి, చంపుతానని శ్రీనివాసరావు బెదిరించడంతో కాగిత వెంకటేష్‌ అనే వ్యక్తి కేసు పెట్టారు. క్రైమ్‌ నెంబర్‌ 48/2017, సెక్షన్‌ 323, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో  ఎ–4గా శ్రీనివాసరావు పేరు ఉంది. 41ఎ సీఆర్‌పీసీ కింద శ్రీనివాసరావుకు పోలీసులు నోటీసు జారీచేసి విచారించారు. కోర్టులో చార్జిషీటు కూడా పోలీసులు దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. 

ముమ్మిడివరం పీఎస్‌లో 2017 ఏప్రిల్‌ నుంచి ఎస్‌ఐగా పనిచేస్తున్నాను. నేను  శ్రీనివాసరావుకు ఎన్‌ఓసీ ఇవ్వలేదు. అంతకుముందు ఏం జరిగిందో తెలీదు  
– ముమ్మడివరం ఎస్‌ఐ పి. ప్రభాకర్‌

ప్రశ్న : రక్షణ శాఖ ఆధీనంలోని విమానాశ్రయం(విశాఖ విమానాశ్రయం పౌర విమానయాన శాఖ పరిధిలోది కాదు) లోకి ప్రవేశానికి వీలుగా ఎన్‌వోసీ జారీచేయడంలో నిందితుడి  నేర చరిత్రను పోలీసులు దాచి పెట్టడం వెనక ఉన్న సూత్రధారులు ఎవరు? పోలీసులు ఈ దిశగా ఎందుకు విచారణ చేయడంలేదు? సూత్రధారుల బండారం బయటపడుతుందనే ఎన్‌వోసీ జారీలో నిబంధనలను పాటించలేదనే విషయాన్ని ‘సిట్‌’ పట్టించుకోవడంలేదా? 

5.నిందితుడిపై హర్షవర్ధన్‌ చౌదరికి ఎంత ప్రేమ
శ్రీనివాసరావు మొదటి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వీరాభిమాని అని పోలీసులు పదే పదే చెప్పుకొచ్చారు. హర్షవర్ధన్‌కి ఉన్న పార్టీ (టీడీపీ) నేపథ్యం చూస్తే.. పొరపాటున కూడా తన సంస్థల్లో తన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. మరి శ్రీనివాసరావుకు ఎలా ఇచ్చారు? 

రెస్టారెంట్‌లో పనిచేస్తున్న అందరికంటే శ్రీనివాసరావుకే ఎక్కువ వేతనం ఇచ్చి ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించడానికి కారణమేంటి?.. 
ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే కుట్ర కోణం సులభంగానే అర్థమవుతుంది. తమ కుట్రను అమలుచేయడానికి ఎంపిక చేసుకున్న శ్రీనివాసరావుకు సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు మిగతా సిబ్బంది కంటే ఫ్యూజన్‌ రెస్టారెంట్‌ యజమాని నిందితుడ్ని ‘ప్రత్యేకంగా’ చూశారు. 

ప్రశ్న : అంత ప్రత్యేకంగా చూడటానికి కారణాలను ‘సిట్‌’ ఎందుకు అన్వేషించలేదు? అలా అన్వేషిస్తే సూత్రధారులెవరో తేలిపోతుందని పలువురు పోలీసు అధికారులు, విమానశ్రయం ఉన్నతాధికారులు ‘సాక్షి’ బృందానికి చెప్పారు.

6.మట్టుబెట్టేందుకే మాటేశారు.. 
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో అనధికారికంగా ఓ వ్యక్తి ఒక్కరోజైనా ఉండగలడా?.. ఏమాత్రం సాధ్యం కాదు. కానీ, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఏకంగా ఏడాదిపాటు ఉన్నాడు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌ రాజేష్‌ చంద్ర నివేదిక బహిర్గతం చేసింది. విమానాశ్రయంలో ప్రవేశానికి ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పర్మిట్‌ (ఏఈపీ) తప్పనిసరి. మరి శ్రీనివాసరావుకు ఏఈపీ ఎవరిచ్చారు.. ఎలా ఇచ్చారో తెలియజేయాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి బీసీఏఎస్‌ను కోరారు. దీనిపై బీసీఏఎస్‌ డీజీ ఇచ్చిన సమాధానంతో అసలు కుట్ర కోణం  బట్టబయలైంది. అసలు శ్రీనివాసరావుగానీ అతని తరఫున రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌గానీ ఏఈపీ కోసం దరఖాస్తు చేయనేలేదని ఆయన వెల్లడించారు. కాబట్టి తాము ఏఈపీ జారీ చేయలేదని చెప్పారు. కాగా, నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయం డి–జోన్‌లో పనిచేసేందుకు 2018 అక్టోబరు 1 నుంచి 30 వరకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ తాత్కాలిక ఏఈపీ జారీచేశారని కూడా ఆయన తెలిపారు. ఇక్కడే అసలు మతలబు ఉంది. వాస్తవం ఏమిటంటే, నిందితుడు శ్రీనివాసరావు దాదాపు ఏడాదిగా విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. సిట్‌ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. కేవలం 2018, అక్టోబరు నెలకు మాత్రమే అనుమతి ఉన్న అతను ఏడాదిగా విమానాశ్రయంలో ఎలా కొనసాగారు? అనుమతిలేని వ్యక్తి విమానాశ్రయంలో ఏడాదిగా దర్జాగా తిరుగుతుంటే విమానాశ్రయ భద్రతా విభాగం అధికారులు ఎందుకు పట్టించుకోలేదు?  విమానాశ్రయంలోని రెస్టారెంట్‌ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరికి విమానాశ్రయ ప్రధాన భద్రతా అధికారి వేణుగోపాలరావుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే సాధ్యమైందని సందేహాలు బలపడుతున్నాయి.  

7.తాత్కాలిక ఏఈపీ కట్టుకథేనా!? 
శ్రీనివాసరావుకు 2018 అక్టోబరు 1 నుంచి 30వరకు ఇచ్చామని చెబుతున్న తాత్కాలిక ఏఈపీ కూడా సందేహాస్పదమే. ఏఈపీ జారీకి కేంద్ర విమానయాన సంస్థ మార్గదర్శకాలను నిర్దేశించింది. ప్రైవేటు వ్యక్తులకు ఒక రోజు నుంచి 3 రోజులకు ఒక కేటగిరీ, 4 రోజుల నుంచి 90 రోజులకు మరో కేటగిరీ కింద ఏఈపీలు కేటాయిస్తారు. నెల రోజులకు తాత్కాలిక ఏఈపీ అన్నది ఏఏఐ మార్గదర్శకాల్లో లేదు. మరి నిందితుడికి అక్టోబరు నెల రోజులకు తాత్కాలిక ఏఈపీ ఎలా జారీచేశారు? అంటే.. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన తరువాత కేసును తప్పుదారి పట్టించేందుకే అప్పటికప్పుడు తాత్కాలిక ఏఈపీ అన్నది సృష్టించారని తేటతెల్లమవుతోంది. అనామకుడైన శ్రీనివాసరావుకు అంతటి పరపతి ఉండదు కదా. మరి దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు?   

మొదటి నుంచి శ్రీనివాసరావుది రెస్టారెంట్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉండే బీ షిఫ్ట్‌ డ్యూటీ. జగన్‌గారిపై దాడి చేసిన రోజు మాత్రం ఉదయమే విధుల్లోకి వచ్చినా.. రెస్టారెంట్‌లోనే ఉన్న హర్షవర్ధన్‌ చౌదరి నిందితుడు శ్రీనివాస్‌ను ఎందుకు ప్రశ్నించలేదు?  శ్రీనివాసరావు ఉద్యోగం అసిస్టెంట్‌ కుక్‌ అయితే సర్వీస్‌ అసిస్టెంట్‌ చేసే పని అతను చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? వీఐపీ లాంజ్‌లోకి సర్వీస్‌ అసిస్టెంట్‌గా వెళ్లడానికి ఎవరు అనుమతించారు

జగన్‌తో సెల్ఫీ కోసం అని శ్రీనివాసరావు చెప్పాడనుకున్నా.. అతని వద్ద కెమెరా ఫోన్‌ లేదని రెస్టారెంట్‌లో ఉన్న వారందరికీ తెలుసు. అప్పుడైనా కెమెరా ఫోన్‌ లేకుండా సెల్ఫీ ఏమిటని అడగాలి? కనీసం అప్పటివరకు అక్కడే ఉన్న హర్షవర్ధన్‌ చౌదరిని అయినా ప్రశ్నించాలి. కానీ, సిట్‌ ప్రశ్నించలేదు? ఎందుకు? 

గత రెండున్నర నెలలుగా జగన్‌గారు ఎయిర్‌పోర్ట్‌కు ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌సీపీ స్థానిక వార్డు అధ్యక్షుడు శ్రీధర్‌ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. హైదరాబాద్‌ నుంచి వచ్చేటప్పుడు ఆయన నేరుగా విమానం దిగి బయటకు వచ్చి పాదయాత్ర జరిగే ప్రాంతానికి వెళ్లిపోతారు. హైదరాబాద్‌కు వెళ్లేటప్పుడు కాస్త సమయముంటే వీవీఐపీ లాంజ్‌కు వెళ్లి పార్టీ నేతలతో భేటీ అవుతారు. అయితే, ఘటన జరిగే వారం ముందే జగన్‌గారికి బయటి నుంచి కాఫీ తీసుకురావడం కుదరదని ఎయిర్‌పోర్ట్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో) వేణుగోపాల్‌ అడ్డుకున్నారు. కాఫీ ఫ్లాస్క్‌ స్వాధీనం చేసుకుని సీరియస్‌ అయ్యారు. పక్కనే ఉన్న రెస్టారెంట్‌ నుంచే తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇలా అన్న రెండో వారమే ఆ రెస్టారెంట్‌ నుంచి శ్రీనివాసరావు వచ్చి కత్తి దూశాడు. రెస్టారెంట్‌ కేంద్రంగానే కుట్ర జరిగిందని తెలుస్తున్నా ఈ దిశగా కనీస విచారణ ఎందుకు జరగలేదు? 

అక్టోబరు 25న వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగే సమయానికి సరిగ్గా పది నిమిషాల ముందే హర్షవర్ధన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వెళ్లడం, ఘటన తర్వాత.. ‘శ్రీనివాసరావు చాలా మంచోడండీ.. అమాయకుడండీ, ఏదో అభిమానంతో పిచ్చి పనిచేసుంటాడు’.. అని హర్షవర్ధన్‌ చౌదరి వకాల్తా పుచ్చుకోవడం వెనక ఉద్దేశం ఏమిటి? హర్షవర్ధన్‌ను సిట్‌ కనీసం ప్రశ్నించడానికి కూడా ఎందుకు సాహసించలేకపోయింది? 

సీఎస్‌వో వేణుగోపాల్‌ మొదటి నుంచి టీడీపీ తొత్తుగా ఉంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై వ్యతిరేకత ప్రదర్శిస్తుంటాడనేది ఎయిర్‌పోర్ట్‌లో అందరికీ తెలుసు. గతంలో ఓసారి ఎంపీ విజయసాయిరెడ్డి పట్ల కూడా ఒకింత దురుసుగా ప్రవర్తించిన దాఖలాలున్నాయి. టీడీపీ నేతలతో అంటకాగే వేణుగోపాల్‌.. హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరికి కుట్రకోణంలో సహకరించాడన్న వాదనలకు బలం చేకూరుస్తోంది. మరి ఈ ఇద్దరిని నిందితులుగా సిట్‌ ఎందుకు చేర్చలేదు? అలా చేస్తే కుట్ర మొత్తం బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలకు భయమా? 

హర్షవర్ధన్‌ చౌదరినిగానీ, సీఎస్‌వో వేణుగోపాల్‌నుగానీ ఇంతవరకు ప్రశ్నించలేదు. అనుమానపు వేళ్లన్నీ వారిద్దరినీ చూపిస్తుంటే పోలీసులు వారిని ఎందుకు పిలిచి విచారించలేదు? 

జగన్‌పై హత్యాయత్నం జరిగిన వీఐపీ లాంజ్‌లో సీసీ కెమెరాలు లేవని అధికారులు చెబుతున్నారు. కానీ, ఫ్యూజన్‌ ఫుడ్స్‌ మొత్తం సీసీ టీవీ నిఘాలోనే ఉంది. నిందితుడు ఉపయోగించిన కత్తిని వాటర్‌ బాటిల్, నాప్కిన్‌ చాటుగా తెచ్చాడని చెబుతున్నారు. మరి రెస్టారెంట్‌లోనే భద్రపరిచిన కత్తిని అక్కడే నాప్కిన్‌లో పెట్టి తీసుకువచ్చినప్పుడు సీసీ ఫుటేజీ ఉంటుంది. కానీ, పోలీసులు ఎందుకు ఫ్యూజన్‌ రెస్టారెంట్‌ జోలికి వెళ్లలేదు? 

8.ఎన్‌వోసీ పోలీసుల సృష్టేనా? 
విమానాశ్రయంలో పనిచేసే వ్యక్తులకు ఎలాంటి నేరచరిత్ర లేదని నిర్ధారిస్తూ ఇచ్చిన ఎన్‌వోసీ తప్పనిసరిగా ఉండాలి. దాని ఆధారంగానే విమానాశ్రయంలో ప్రవేశానికి ఏఈపీ జారీచేస్తారు. నిందితుడు శ్రీనివాసరావు ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం చేసిన వెంటనే అందరి మదిలో మెదిలిన ప్రశ్న. ‘అతనికి ఎన్‌వోసీ ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు’? అని. అందులోనూ శ్రీనివాసరావుపై అతని స్వస్థలంలో ఓ క్రిమినల్‌  కేసు నమోదై ఉంది. మరి అతనికి ఎన్‌వోసీ ఎలా ఇచ్చారన్నది కీలకంగా మారింది. హత్యయత్నం కేసులో కుట్ర కోణాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు పోలీసుల ద్వారా కట్టుకథకు తెరతీశారు. మొదట శ్రీనివాసరావుకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులే ఎన్‌వోసీ ఇచ్చారని విశాఖ పోలీసులు చెప్పారు. తాము ఎన్‌వోసీ ఇవ్వలేదని ముమ్మడివరం ప్రస్తుత ఎస్సై, గతంలో పనిచేసిన ఎస్సై కూడా తెలిపారు. దాంతో విశాఖ పోలీసులు మరో కథ వినిపించారు. శ్రీనివాసరావు విశాఖలో నివసిస్తున్నందున ఆ పరిధిలోని విమానాశ్రయ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఎన్‌వోసీ తీసుకున్నాడని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్హా చెప్పారు. కాగా, ఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ డీజీ కుమార్‌ రాజేష్‌ చంద్ర వెల్లడించిన సమాచారంతో అసలు వాస్తవం బట్టబయలైంది. ఎంపీ విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో.. అసలు శ్రీనివాసరావు పేరిట తమకు ఎన్‌వోసీ రాలేదని ఆయన వెల్లడించడం గమనార్హం. విమానాశ్రయంలో ప్రవేశానికి అవసరమైన ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పర్మిట్‌ కోసం శ్రీనివాసరావుగానీ, రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరిగానీ దరఖాస్తు చేయనేలేదని తెలిపారు. ఏఈపీ కోసం దరఖాస్తు చేయనప్పుడు ఎన్‌వోసీ సమర్పించాల్సిన అవసరమే ఉత్పన్నం కాదని కుండబద్దలు కొ ట్టారు. అంటే శ్రీనివాసరావు పేరిట (బీసీఏఎస్‌)కి ఎలాంటి ఎన్‌వోసీ సమర్పించలేదని స్పష్టమవుతోంది.  

మరి శ్రీనివాసరావు పేరిట విశాఖ పోలీసులు ఎన్‌వోసీ ఇచ్చారని పోలీస్‌ కమిషనర్‌ చెప్పడం వెనుక లోగుట్టు ఏమిటి?  ఈ హత్యాయత్నం వెనుక ఎవరి పాత్రను కప్పిపుచ్చేందుకు పోలీసులు ఈ కట్టుకథ వినిపించారు? ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పకపోవడం వైఎస్‌ జగన్‌పై  హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్రను చెప్పకనే చెబుతోంది.

9.సీసీ కెమెరాలు ఆఫ్‌.. కుట్ర ఆన్‌..  
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించగానే సూత్రదారులు, పాత్రధారులు తమ కుట్ర కార్యాచరణను వేగవంతం చేశారు. ఆయన హత్యకు కార్యస్థలిగా ఎంపిక చేసుకున్న విశాఖ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆపేశారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు హైకోర్టులో విచారణ సందర్భంగా విమానాశ్రయంలో మూణ్ణెళ్లుగా సీసీ కెమెరాల ఫుటేజీలేదని సిట్‌ పోలీసులే చెప్పారు. అంటే ఆగస్టు నుంచి సీసీ కెమెరాలు పనిచేయడంలేదని స్పష్టమైంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 2018, ఆగస్టు 14న విశాఖ జిల్లాలో ప్రవేశించింది. అప్పటి నుంచి ఉత్తరాంధ్రలో పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రతివారం విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగించాలి. దాంతో ఆయన్ని విమానాశ్రయంలో అంతమొందించాలన్న కుట్రకు ముందస్తు వ్యూహంలో భాగంగానే సీసీ కెమెరాలు ఆఫ్‌ చేశారు. సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే జగన్‌పై హత్యాయత్నం కుట్ర ఆధారసహితంగా బట్టబయలయ్యేదని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. హత్యాయత్నం చేసిన అక్టోబరు 25న నిందితుడు శ్రీనివాసరావు విమానాశ్రయంలో ప్రవేశం, అతనికి సహకరించిన మరికొందరి చర్యలు, వీఐపీ లాంజ్‌ వద్ద నిందితుడి ప్రవర్తన.. అదను చూసి కత్తిదూయడం, ఆ వెంటనే అతనికి సహకరించిన వారి స్పందన మొదలైన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యేవి. ఈ కుట్రకు సహకరించిన వారేవరో తెలిసేది. వారిని విచారిస్తే ప్రభుత్వ పెద్దల బండారం బహిర్గతమయ్యేది. ఇది ఊహించే ప్రభుత్వ పెద్దలు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని పోలీసు ఉన్నతాధికారి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

ప్రశ్న : పక్కా పన్నాగంతో సీసీ కెమెరాలు ఆఫ్‌ చేయడం ఎవరికి సాధ్యం?  సీసీ కెమెరాలు 3 నెలలుగా పనిచేయకున్నా భద్రతా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? దీని వెనుకున్న పెద్దలెవరు? సహకరించిన అధికారులెవరు?  రెస్టారెంట్‌ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌తో విమానాశ్రయ భద్రతా అధికారి వేణుగోపాల్‌కు ఉన్న సాన్నిహిత్యం ప్రభావమెంత? 

10.హత్యాయత్నం గురితప్పింది.. ‘సిట్‌’ విచారణ దారి తప్పింది 
కుట్ర పన్ని ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎప్పటి లాగే ఆ గురువారం (అక్టోబరు 25న) కూడా విశాఖ విమానాశ్రయానికి వచ్చిన జగన్‌.. వీఐపీ లాంజ్‌లో ఉన్నప్పుడు శ్రీనివాసరావు వచ్చి పదునైన కత్తిని జగన్‌ గొంతులోకి దించే లక్ష్యంతో పాశవిక దాడికి పాల్పడ్డారు. కత్తి గొంతులో దిగి ఉంటే.. ప్రాణం దక్కడం అనుమానమే. అదృష్టవశాత్తూ..జగన్‌ పక్కకు వంగడంతో గొంతులో దిగాల్సిన కత్తి గురితప్పి భుజంలో దిగింది. దీంతో జగన్‌ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కత్తిపోటు గురితప్పడంతో.. కుట్ర సూత్రధారుల బండారం బయటకు రాకుండా ‘సిట్‌’ దర్యాప్తును ప్రభుత్వ పెద్దలు దారి తప్పించారు. ఈ విచారణ దారి తప్పడంతో ఎన్నో అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. 

పోలీసు ఉన్నతాధికారులు, విమానాశ్రయ అధికారులకూ ఎన్నో సందేహాలు ఏర్పడ్డాయి. వారికి ఉన్న అనుమానాలను ‘సాక్షి’ బృందంతో పంచుకున్నారు. వారి అనుమానాలు ఇవీ.. 
డీజీపీ, మంత్రులు, సీఎం మాటలకు అర్థాలే వేరులే.. 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో అక్టోబరు 25 గురువారం మధ్యాహ్నం 12.45–12.48 మధ్య హత్యాయత్నం జరిగింది. ప్రతిపక్ష నేతను హతమార్చడానికి పాశవిక దాడి జరిగితే తక్షణ విచారణ చేపట్టి నిగ్గుతేల్చాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. హత్యాయత్నం జరిగిన తర్వాత నిందితుడిని సీఐఎస్‌ఎఫ్‌ తన కస్టడీలోకి తీసుకుంది. 

ప్రశ్న–1:
వైఎస్‌ జగన్‌ మీద హత్యాయత్నం జరిగిన 40 నిమిషాల్లోనే (అప్పటికి నిందితుడు సీఐఎస్‌ఎఫ్‌ కస్టడీలో ఉన్నాడు. సీఎస్‌ఐఎఫ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. నిందితుడిని విచారించలేదు) మధ్యాహ్నం 1.30కు డీజీపీ మీడియాతో మాట్లాడారు. నిందితుడు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు, జగన్‌ అభిమాని అని చెబుతూ అతని పేరు, ఊరు ప్రకటించారు. ప్రచారం కోసమే హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. పోలీసుల కస్టడీలోకి రాకముందే నిందితుడి వివరాలు ఎలా వెల్లడించగలిగారు? విచారణ మొదలుపెట్టకముందే హత్యాయత్నం వెనక ఉద్దేశాన్ని ఎలా చెప్పారు? డీజీపీ ప్రెస్‌మీట్‌లో చెప్పిన విషయాలకు ఆధారమేమిటి? 

ప్రశ్న–2:
డజీపీ మీడియా సమావేశం ముగిసిన వెంటనే.. మ.2 గంటలకు ముగ్గురు మంత్రులు లైవ్‌లోకి వచ్చారు. నిందితుడి వివరాలతో పాటు జగన్‌ బొమ్మతో ఉన్న ఫ్లెక్సీని మొబైల్‌లో చూపించారు. హత్యాయత్నానికి 10 నెలల ముందు ఎక్కడో మారుమూల గ్రామంలో వేసినట్లుగా చెబుతున్న ఫ్లెక్సీ మంత్రులకు ఎలా వచ్చింది? నిందితుడిని పోలీస్‌ కస్టడీలోకి తీసుకోకముందే.. విచారణ ప్రారంభం కాకముందే నిందితుడి పేరు తప్ప మరే వివరాలు వెల్లడించకముందే నిందితుడి గ్రామం, ఫ్లెక్సీ, ఏ పార్టీ అనే విషయాలు మంత్రులు ఎలా చెప్పగలిగారు? నిందితుడు వెల్లడించకముందే ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసిపోవడం ఎలా సాధ్యం? 

మంత్రులు అచ్చెన్నాయుడు, ఆదినారాయణరెడ్డి, నక్కా ఆనందబాబు తదితరులు మీడియా ముందుకు వచ్చారు. హత్యాయత్నం జరిగిన ప్రాంతం కాని, హత్యాయత్నానికి ఒడిగట్టిన నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామంగాని ఆ మంత్రులకు చెందిన జిల్లాల్లో లేవు. వారి శాఖలకూ సంబంధంలేదు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారా? వారికి సమాచారం ఎవరు చెప్పారు? 

ప్రశ్న–3:
సా.4 గంటలు దాటిన తర్వాత సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4.30 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సీఆర్‌పీసీ–156 ప్రకారం.. ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ అయిన తర్వాత విచారణకు అవకాశం ఉంటుంది. సా.4.30 గంటల వరకు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వలేదని సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. నిందితుడిని 4.30 తర్వాత కస్టడీలోకి తీసుకున్నామని ఆయనే చెబితే... అంతకు 3 గంటల ముందే డీజీపీ, మంత్రులు అన్ని వివరాలు ఎలా చెప్పగలిగారు? 

ప్రశ్న–4:
సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ చేసిన ఫిర్యాదులో నిందితుడిది ఏ ఊరనే విషయంలేదు. వారి కస్టడీలో ఉన్న నిందితుడి వివరాలు సీఐఎస్‌ఎఫ్‌కు తెలియలేదు. మరి ప్రభుత్వ పెద్దలకు ఎలా తెలిశాయి? 

హత్యాయత్నంపై టీడీపీ నేతలకు ముందే సమాచారం? 
వైఎస్‌ జగన్‌పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడిన వెంటనే ఠానేలంకలోని నిందితుడి ఇంటి ముంగిట స్థానిక టీడీపీ నేతలు వచ్చి వాలిపోయారు. హత్యాయత్నం జరిగిన (అక్టోబరు 25వ తేదీ, గురువారం) వెంటనే టీవీల్లో చూసి అదే గ్రామానికి చెందిన జనుపల్లి ఇంటిపేరు ఉన్న వారిలో చాలామంది.. ఈ శ్రీనివాస్‌ ఎవరు అని బంధువులకు ఫోన్లుచేసి ఆరా తీస్తుండగానే తమకు ముందుగానే తెలిసినట్లుగా టీడీపీ నేతలు నిందితుడు ఇంటి వద్ద వాలడం.. నిందితుడికి అధికార పార్టీ పెద్దలతో ఉన్న సంబంధాలను స్పష్టంచేస్తోందని గ్రామస్తులు పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన వెంటనే నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్దకు చేరిన టీడీపీ నాయకులు (ఫైల్‌)  

  • మీడియా కంటే ముందుగానే అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు.. శ్రీనివాసరావు  జగన్‌ అభిమాని అంటూ వారే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. స్థానికులు ఎవరైనా మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగానే.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు, కేశవస్వామి దేవస్థానం చైర్మన్‌ నడింపల్లి శ్రీనివాసరాజు, ఠానేలంక గ్రామ టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేశ్వరావు, జన్మభూమి కమిటీ సభ్యుడు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుడు ఇసుకపట్ల ఈశ్వర్‌కుమార్‌లు ముందుకు వచ్చారు. వీరితో పాటు టీడీపీ నేత ఇసుకపట్ల వెంకటేశ్వరావుతో పాటు పలువురు కార్యకర్తలు  మీడియా ముందు నిలబడి వారే ఇరుగుపొరుగు వ్యక్తుల్లా మాట్లాడారు. టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాసరావు జగన్‌ అభిమాని అంటూ పదేపదే చెప్పడం కనిపించింది. శ్రీనివాసరావు కుటుంబీకుల కంటే టీడీపీ నేతలే మీడియా  ముందుండటం కొసమెరుపు. వారన్నట్టుగానే శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ మనిషి అయితే టీడీపీ నేతలు భుజాలు తడుముకొంటున్నట్లుగా అక్కడకు ఎందుకు వచ్చారు? 
  • జగన్‌ మీద హత్యాయత్నానికి తెగబడింది వైఎస్సార్‌సీపీ అభిమాని అని టీడీపీ ప్రచారం చేస్తోంది. మరి నిందితుడి ఇంటికి అంత వేగంగా టీడీపీ నేతలు వచ్చి వాలడం ఎందుకు? వారికేం సంబంధం ఉందని వచ్చారు? 
  • ప్రచారం కోసమే వైఎస్సార్‌సీపీ అభిమాని జగన్‌ మీద దాడిచేశారని డీజీపీ ప్రకటించారు. దాన్ని నిజమని భావిస్తే.. టీడీపీ నేతలు నిందితుడి ఇంటికి వెళ్లరు. వెళ్లాల్సిన అవసరమూలేదు. కానీ, అందుకు భిన్నంగా టీడీపీ నేతలు అక్కడకు వెళ్లడం, నిందితుడి కుటుంబం వైఎస్సార్‌సీపీ అని పదేపదే మీడియాకు చెప్పడానికి ప్రయత్నించడం వెనక ఉద్దేశాలను వెలికి తీయడానికి సిట్‌ బృందం ఎందుకు ప్రయత్నించలేదు? 
  • నిందితుడు ఇంటికి వెళ్లమని వారికి ఎవరి నుంచి ఆదేశాలు అందాయి? టీడీపీ పెద్దల్లో ఎవరు వారికి సూచించారు? ఈ అంశాన్ని నిగ్గు తేల్చడానికి వారి కాల్‌డేటా పరిశీలిస్తే ఇట్టే తేలిపోతుంది. కానీ, సిట్‌ ఈ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయలేదు? 

వాళ్ల కుటుంబం టీడీపీ అని అంటుంటారు 
జగన్‌ పార్టీ వాళ్లకు ఇంటి లోన్లు మంజూరు చేయలేదు. మా బంధువుకు ఇవ్వలేదు. ‘జనుపల్లి’ వాళ్లలో టీడీపీ వాళ్లు ఉన్నారు. వాళ్లకు లోన్లు వచ్చాయి. వాళ్ల కుటుంబం కూడా టీడీపీ అని అంటుంటారు. వాళ్ల చిన్నాన్న నాగేశ్వరరావు టీడీపీయే. మా అబ్బాయి వెంకటేష్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం పెళ్లిలో మా అబ్బాయి వెంకటేష్‌ను శ్రీనివాస్, అతని స్నేహితులు కలిసి కొట్టారు. అంతకు పదిహేను రోజుల క్రితం మా అబ్బాయి పడిపోతే చెయ్యి విరిగిపోయింది. రాజేష్‌ అన్న కుర్రాడు వచ్చి మీ అబ్బాయిని కొట్టిపడేశామని చెప్పాడు. పెద్దల్లో పెట్టినా కూడా ఎవరూ స్పందించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాం. గోపాలం, జనుపల్లి నాగేశ్వరరావు అనేవాళ్లు వచ్చి కేసు రాజీ చేసుకోవాలని కోరారు. కానీ, కేసు వెనక్కి తీసుకోలేదు. వాళ్ల చిన్నాన్న గ్రామ పంచాయితీ వైస్‌ ప్రెసిడెంట్‌. టీడీపీ నేత. వాళ్ల కుటుంబం కూడా టీడీపీ అని అంటుంటారు.  
– కాగిత వెంకటేష్‌ తల్లి సీతారత్నం, శ్రీనివాసరావుపై గతంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి 

కేస్‌ క్లోజ్‌ అంటున్నారు 

  • కేసులు కొట్టేశారని చెప్పుకుంటున్నారు. ప్లీడర్లు వస్తున్నారు. బెయిల్‌ ఇప్పిస్తామని వీళ్లని అడుగుతున్నారట.  
  • విమానాశ్రయంలో ఉద్యోగం కోసం ఎలా వెళ్లాడో మాకు తేలీదు. 
  • ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడని టీవీలో చూసిన తర్వాతే మాకు తెలిసింది.  
  • సర్వశిక్షాభియాన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ టీచర్‌ పోస్టు కోసం కాకినాడ వెళ్తే.. నా రెజ్యూమ్‌లో ఇంటి పేరు జనుపల్లి అని చూసి ఆ అబ్బాయి (శ్రీనివాస్‌) మీకు ఏమవుతాడు అని అడుగుతున్నారు. మీకు ఉద్యోగాలు రావు అంటున్నారు.  –టీడీపీ ఉపసర్పంచ్‌ నాగేశ్వరరావు (నిందితుడు బాబాయి) కుమార్తె నాగమణి

వాడివల్ల మూడు జీవితాలు నాశనమవుతున్నాయి  
ఆ దుర్మార్గుడు మమ్మల్ని ఇరికించాడు. మా కూతురు వాళ్ల ఇంటిలో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడితే దానితో ఎవరికో చేశాడు. పోలీసులు నా కూతురుకు ఫోన్‌చేసి రావాలన్నారు. ఆ ఫోన్‌లోని సిమ్‌ పోలీసులు తీసుకున్నారు. వాడు ఫోన్‌ వాడటంవల్ల మూడు జీవితాలు నాశనమవుతున్నాయని బాధపడుతున్నాం. ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్లం. కానీ, వీడివల్ల అంతా ఏడుస్తున్నాం. నా కొడుకైనా.. ప్రాణం తీసేసినా తప్పులేదు. సామాన్యమైన పని చేయలేదు.  
– శ్రీనివాస్‌ పిన్ని (పక్క ఇల్లు) 

నిందితుడు స్నేహితుడు ఉన్నట్లుండి ధనవంతుడయ్యారు 
నిందితుడు శ్రీనివాసరావు నాలుగో అన్నకు తోడల్లుడు, తనకు స్నేహితుడు అయిన ఈశ్వరరావు గత ఏడాది కాలంలో లక్షాధికారి అయ్యాడు. ట్రాక్టర్, టాటా ఏస్, ఇండికా కారు, పల్సర్‌ బైక్‌ కొనుగోలు చేయడంతో పాటు శానపల్లిలంక (ఈశ్వరరావు సొంత గ్రామం)లో హైస్కూల్‌ ప్రహరీ గోడ కాంట్రాక్టును స్థానిక ఎమ్మెల్యే సిఫార్సులో సొంతం చేసుకున్నాడు. ఈ కాంట్రాక్టు విలువ రూ.14 లక్షలు. ఊర్లో బెల్ట్‌షాప్‌ నడుపుతూ పొట్టపోసుకునే వ్యక్తి హఠాత్తుగా అన్ని వాహనాలు కొనగడం, పి.గన్నవరం ఎమ్మెల్యే పులిపర్తి నారాయణమూర్తి సిఫార్సుతో రూ.14 లక్షల విలువైన కాంట్రాక్టు పొందడం సాధారణ విషయం కాదు. నిందితుడికి టీడీపీ నేతలతో ఉన్న సంబంధాలే అందుకు కారణం అని గ్రామస్తుల అనుమానం. శ్రీనివాసరావు బినామీగా ఈశ్వరరావు వ్యవహరించాడని అంటున్నారు.  

శ్రీనివాస్‌ అన్న సుబ్బరాజుది టీడీపీ అంటారు 
‘జనుపల్లి శ్రీనివాస్‌ అన్నయ్య సుబ్బరాజుది టీడీపీ అంటారు. నాతో పాటు మరో ముగ్గురు స్నేహితులు ప్రభాకర్, చిట్టి, వెంకట దుర్గాప్రసాద్‌లను సిట్‌ అధికారులు ముమ్మిడివరం పిలిచి విచారించారు. స్నేహితులమని మమ్మల్ని పిలిచారు. శ్రీనివాస్‌ ఎటువంటి వాడు, అతని మనస్తత్వం ఎటువంటిది. ఎలా ఉండేవాడని అడిగారు. ఊళ్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. రెండు నెలల క్రితం కనిపించాడు. ఒరేయ్‌ అంటే ఒరేయ్‌ అనుకునే వాళ్లం. రావడం, వెళ్లిపోవడం తప్ప ఎక్కువ రోజులు ఇక్కడ ఉండేవాడు కాదు.      
– మెల్లం రాజు, సిట్‌ విచారణ ఎదుర్కొన్న శ్రీనివాసరావు స్నేహితుడు 


పిల్లల్ని వీధిలో పెట్టాడు.. అభిమానైతే పొడిచేస్తాడా? 
ఇంట్లో పిల్లలందరినీ వీధిలో పెట్టాడు. అభిమానైతే కత్తితో పొడిచేస్తాడా? ఏదో జరిగింది? వెనకెవరో ఉండి ఉంటారు. ఫ్లెక్సీలు ఎవరు బాగా వేస్తారని మా అబ్బాయి గిడ్డి చైతన్యను అడిగినప్పుడు పి.గన్నవరంలో తనకు తెలిసిన ఫ్లెక్సీలు తయారుచేసే షాపు ఒకటి ఉందని.. దాని అడ్రసు ఇచ్చాడు. పి.గన్నవరంలోని ఫ్లెక్సీల షాపు అతనికి మా అబ్బాయి ఫోన్‌చేసి శ్రీనివాసరావు వస్తాడు.. ఫ్లెక్సీ వేసిపెట్టు అని మాత్రమే చెప్పాడు. శ్రీనివాసరావుకు, మా అబ్బాయికి అంత స్నేహం లేదు. ఫ్లెక్సీ షాపు గురించి వివరాలు అడగడం.. అది శ్రీనివాసరావుకు చెప్పడం.. ఫ్లెక్సీ షాపు వాడు ‘ఫ్రూఫ్‌ ఫ్లెక్సీ’ని మా అబ్బాయి సెల్‌కు పంపించడంతో మా వాడు పోలీసుల విచారణ ఎదుర్కోవలసి వచ్చింది.     
– సిట్‌ విచారణ ఎదుర్కొన్న గిడ్డి చైతన్య తల్లి 

శ్రీనివాస్‌ ఫోన్‌లో నెంబర్లున్న యువకులను విచారించారు 
జగన్‌గారిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావు ఇంటి పేరుతో ఉన్న తామంతా బంధువులేమే. అయితే, శ్రీనివాసరావు ఫోన్‌లో ఫీడ్‌ అయిన నెంబర్ల ఆధారంగా వాడి వయస్సుతో సమానంగా ఉన్న తమ ఊరు ముఖ్యంగా పెదపేట యువకులను సిట్‌ పోలీసులు విచారించారు.  
– జనుపల్లి సతీష్, సిట్‌ విచారణ ఎదుర్కొన్న శ్రీనివాస్‌ స్నేహితుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement