
సీతంపేట(విశాఖ ఉత్తర): హనుమంతవాకలో ఉన్న మేకల కబేలాను నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారికవలసకు తరలించిన నేపథ్యంలో నిరసనగా ఆదివారం నుంచి మటన్ విక్రయాలు నిలిపివేస్తున్నట్టు మటన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. అసోసియేషన్ అధ్యక్షుడు కిలాని అప్పారావు మాట్లాడుతూ తగరపువలస నుంచి పెందుర్తి, గాజువాక వరకు ఉన్న 700 మటన్ షాపులు బంద్‌లో పాల్గొంటాయన్నారు. హనుమంతవాకలో కబేలా తెరిచేలా స్పష్టమైన హామీ వచ్చే వరకు బంద్ కొనసాగిస్తామన్నారు.
కబేలా తరలించడం వల్ల వ్యాపారాలు సరిగ్గా సాగక 6700 మంది గొర్రెల పెంపకం దారులు, సుమారు 10 వేల మంది మటన్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమంతవాకలో ఉన్న స్థలంలో రెండస్తుల భవనం నిర్మించి, పార్కింగ్, వాటర్ సదుపాయాలతో అత్యాధునిక కబేలాను నిర్మించి అందుబాటులోకి తేవాలని కోరారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి హనుమంతవాక కబేలా వద్ద నిరసన చేపడతామన్నారు. మటన్ వ్యాపారులంతా పాల్గొని జయప్రదం చేయాలన్నారు.