హీరోయిన్ కావడమే లక్ష్యం
బాలనటిగా రాణిస్తున్న అమలాపురం బాలిక
15 చిత్రాల్లో నటించి ప్రతిభ చూపిన శ్రీయవర్మ
నాట్యంలో జాతీయస్థాయి అవార్డు కైవసం
అమలాపురం టౌన్ : ఆ చిన్నారి నటన, నర్తనలను రెండు కళ్లుగా భావించి ఆ రెండు రంగాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ ప్రయత్నంలో చాలా వరకూ సఫలమైంది. మరిన్ని ఉన్నత లక్ష్యాలు చేరాలని అటు నటనలో, ఇటు నర్తనలో శిక్షణ పొందుతోంది. అమలాపురం కె.అగ్రహారం రవీంద్రనగర్‌కు చెందిన శ్రీయవర్మ బాలనటిగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కూచిపూడి నృత్యంలోనూ పురస్కారాలందుకుంటోంది. ఆక్వా రైతు సరిపెల్ల శ్రీరామరాజు, లక్ష్మీసౌమ్య దంపతుల కుమార్తె శ్రీయవర్మ ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. 12 ఏళ్ల ఆ పాప గత ఆరేళ్లుగా ఇప్పటివరకూ 15 సినిమాల్లో బాలనటిగా నటించింది. ‘మనసారా, కరెంట్, స్నేహితుడా, ఆ ఒక్కడు, శంఖం, ఏం పిల్లో... ఏం పిల్లడో, జయీభవ, నమో వెంకటేశ, శంభో శివ శంభో, డా ర్లింగ్, రాజన్న తదితర చిత్రాల్లో నటించింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన జాతీయ కూచిపూడి నృత్య పోటీల్లో సోలో విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. అమలాపురంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన అభినందన సభలో శ్రీయ చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
బహుముఖ ప్రతిభ
శ్రీయ చదువులో చురుగ్గా ఉండడమే కాక పలు రంగాల్లోనూ ప్రతిభ చూపుతోంది. టెన్నిస్ క్రీడాకారిణిగా రాణిస్తోంది. స్విమ్మింగ్‌లోనూ దిట్టే. పలు ఈత పోటీల్లో పాల్గొని బహుమతులూ గెలుచుకుంది. శ్రీయ పలు యాడ్ ఫిలిమ్స్‌లోనూ నటించింది. బిగ్ బజార్, త్రిబుల్ ఎక్స్ సోప్, రావు బ్రదర్స్ చిట్‌ఫండ్స్, అపర్ణ సరోవర రియల్ ఎస్టేట్ యాడ్స్‌ల్లో మోడల్‌గా నటించింది. మా టీవీ ధారావాహికంగా ప్రసారం చేసిన ‘చిట్టి కథల చింటూ’ కార్యక్రమానికి యాంకరింగ్ చేసింది. 2010లో సెలికాన్ ఆంధ్ర జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
శ్రీదేవి అంటే ఇష్టం, హీరోయిన్ కావడమే లక్ష్యం
తనకు అలనాటి అందాల తార శ్రీదేవి అంటే ఇష్టమని శ్రీయ చెప్పింది. బాలనటిగా శ్రీదేవి చిత్రాలు చూసే తనలా బాలనటి కావాలన్న ఆకాంక్షతో... మా అమ్మా నాన్న ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టానంది. భవిష్యత్‌లో హీరోయిన్ కావాలన్న లక్ష్యంతో ఉన్నానంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో హీరోయిన్ కాగలనన్న ధీమా వ్యక్తం చేసింది. ఎప్పటికైనా శోభానాయుడు అంతటి నృత్యకారిణి కావాలన్నదీ తన ధ్యేయమంటోంది.