టి.నరసాపురం : పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన పడాల వంశీకృష్ణ అనే విద్యార్థి ఒడిశాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో ఇక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన పడాల పాండురంగారావు, సుబ్బాయమ్మ మూడో సంతానం వంశీకృష్ణ. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలోని సెంచూరియన్ యూనివర్సిటీలో బీఎస్సీ (అగ్రికల్చర్) ఫైనలియర్ చదువుతున్నాడు.
తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తల్లిదండ్రులు అంటున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వంశీకృష్ణ గతనెల 18న ఇంటి నుంచి కళాశాలకు వెళ్లాడు. అతడు మృతిచెందినట్టు మంగళవారం ఉదయం అతడి స్నేహితులు తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో వంశీకృష్ణ చినతాత పడాల సత్యనారాయణ, అతని బంధువులు గండబోయిన కిషోర్, పి.రంగారావుతోపాటు పది మంది ఒడిశా వెళ్లారు. వంశీకృష్ణది హత్యే అని, కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పడాల సత్యనారాయణ అక్కడి పోలీసులను కోరారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అక్కడి డీఎస్పీ వీరికి హామీ ఇచ్చారు.
హైదరాబాద్ నుంచి పర్లాకిమిడి వెళ్లాడు
బుధవారం సాయంత్రం మృతదేహానికి పర్లాకిమిడిలో పోస్టుమార్టం నిర్వహించారు. గురువారం ఉదయం మృతదేహాన్ని బొర్రంపాలెం తీసుకువస్తామని వంశీకృష్ణ బంధువులు తెలిపారు. ఈ నెల 9న ప్రాజెక్ట్ పనిమీద హైదరాబాద్ వెళ్లిన వంశీకృష్ణ 10న తిరిగి పర్లాకిమిడి చేరుకున్నాడు. 11న స్నేహితులు ఫోన్ చేయడంతో కళాశాలకు వెళ్లాడు. 12న ఉదయం కళాశాలలో వంశీకృష్ణ మృతిచెంది ఉండటాన్ని గుర్తించిన స్నేహితులు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వంశీకృష్ణ తండ్రి రంగారావు మూడెకరాలు వ్యవసాయం చేస్తూ తన ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు వినోద్‌ను ఎంబీఏ చదివించగా కుమార్తె ఏలూరులో ఎంటెక్ చదువుతోంది. చివరగా 11న రాత్రి తమతో ఫోన్‌లో మాట్లాడిన వంశీకృష్ణ హైదరాబాద్ నుంచి క్షేమంగా ఒడిశా చేరుకున్నానని చెప్పాడని అన్నారు.
మా అబ్బాయిది ముమ్మాటికీ హత్యే
Published Thu, Jul 14 2016 2:30 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement
Advertisement