పాలమూరు, న్యూస్‌లైన్: ఉన్నతాధికారులు, తహశీల్దార్లకు సార్వత్రిక ఎన్నికల బదిలీ బెంగ పట్టుకుంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే గెజిటెడ్ అధికారులను సొంతజిల్లాల నుంచి ఆర్నెళ్ల ముందునుంచే ఇతర జిల్లాల కు పంపించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం అమలులో ఉంది. ఈ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే పలువురు ఉన్నతాధికారు లు, తహశీల్దార్లను జిల్లా నుంచి బదిలీచేసే అవకాశం ఉంది. 2009 ఎన్నికల సమయంలో కేవలం 15రోజుల ముందు సొంత జిల్లాకు చెందినవారు, మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లకు మరో చోటకు పంపి అక్కడి వారిని మన జిల్లాలో నియమించారు.
ఎన్నికల విధులు ముగియగానే ఎక్కడివారిని అక్కడికి మార్చారు. అయితే ఈసారి ఆరునెలల ముందే పంపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించడంతో సాధారణ పరిపాలనశాఖ తగిన కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ విధానం కొనసాగితే ఎన్నికల ప్రక్రియకు ఆరునెలల ముందుగానే జిల్లాలోని పలువురు అధికారులు, తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ తప్పదని తెలుస్తోంది.
36 మండలాల్లో స్థానికులు
జిల్లాలో 64 మండలాలకు 28 మండలాల్లో నల్గొండ జిల్లాకు చెందినవారు తహశీల్దార్లుగా పనిచేస్తున్నారు. మిగిలిన 36 మండలాల్లో స్థానికులే కొనసాగుతున్నారు. వీరందరికీ స్థానచలనం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. జిల్లాలో పనిచేస్తున్న అదే జిల్లా అధికారులు, మూడేళ్లుగా పనిచేస్తున్న వారి వివరాలను పంపించాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం వివరాలను సేకరించనుంది. 2009 ఎన్నికల సమయంలో పదవీ విరమణ చేసే వారికి మినహాయింపు ఇచ్చిన ఎన్నికల సంఘం ఈసారి దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో 2014 ఏప్రిల్‌కు అటు ఇటూ పదవీ విరమణ చేసేవారిలో సందిగ్ధం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో ఎలాగూ బదిలీతప్పదని భావించిన సొంతజిల్లా అధికారులు ఇప్పటినుంచే ఇతర జిల్లాలకు బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
మరి కొందరు తహ శీల్దార్లు ఎన్నికల విధులతో సంబంధం లేని విభాగాలకు వెళ్లేందుకు ముందస్తుగానే సిద్ధపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది నిర్ణయించనప్పటికీ.. 2014 ఏప్రిల్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరునెలలు ముందుగానే బదిలీ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని, అలాగైతే నవంబర్, డిసెంబర్ నెలల్లో సొంత జిల్లాలోని అధికారులు బదిలీలు చేపట్టనున్నారు. 36 మండలాలకు చెందిన తహశీల్దార్లు మనజిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం వీరిని ఇతర చోట్లకు బదిలీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. కాగా దీన్ని ఇప్పటికిప్పుడు అమలుచేయాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని డిఆర్వో రాంకిషన్ పేర్కొన్నారు.
అధికారులకు బదిలీ బెంగ !
Published Fri, Nov 1 2013 4:05 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement