సాక్షి, కర్నూలు: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో అడ్డగోలు నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నా.. నిలువరించాల్సిన పట్టణ ప్రణాళిక విభాగంఅధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ఒకప్పటి రాజధానిగా పేరుపొందిన కర్నూలు.. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందడం లేదు. నగరపాలక సంస్థ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల నిర్లక్ష్యంతో అనధికారిక కట్టడాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
నగరవ్యాప్తంగా 900కుపైగా అక్రమ కట్టడాలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఏ-క్యాంపులో ఓ వ్యక్తి అక్రమ భవన నిర్మాణం చేపడుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని 23వ వార్డు పరిధిలోని ధనలక్ష్మినగర్, సోమిశెట్టినగర్, గణేష్‌నగర్‌లలో అనేక అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగానే సాగుతున్నాయి.
అలాగే సి-క్యాంపు సమీపంలో సుద్దవాగు వంక వద్ద ఓ బిల్డర్ అక్రమంగా వాణిజ్య భవనాన్నే నిర్మిస్తున్నా.. ప్రశ్నించే అధికారులే కరువయ్యారు. కొత్తబస్టాండు ఎదురుగా ఉన్న ఓ లాడ్జీ, అలాగే అక్కడ సమీపంలోని అనేక వాణిజ్య భవనాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవే.
సి-క్యాంప్‌లోని ఓ వాణిజ్య సముదాయానికి అనుమతి సమయంలో పార్కింగ్ సదుపాయం చూపించి అనుమతి పొందిన తర్వాత ఆ స్థలంలో నాలుగు వాణిజ్య దుకాణాలను నిర్మించారు. టీడీపీ కార్యాలయంలో ఎదురుగా ఉన్న ఓ వాణిజ్య భవనం ఇంకా నిర్మాణ దశలో ఉండగా.. ఓ కళాశాల, ఓ టెక్స్‌టైల్ షాపు నిర్వహిస్తున్నారు. దీనికి నగరపాలక సంస్థ అధికారుల నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సైతం తీసుకున్నట్లు లేదని తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది.
కాగితాలపైనే సెట్‌బ్యాక్‌లు..
పురపాలక శాఖ నిబంధనల మేరకు వాణిజ్య, నివాస భవనాలు నిర్మించాలంటే వాటి చుట్టూ సెట్‌బ్యాక్ వదలాల్సిందే. అయితే నగరంలో ఇలాంటి నిబంధనలు మచ్చుకైనా కానరావు. జీవో నం. 168 ప్రకారం కర్నూలు నగరంలో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే తొలుత ఆయా భవనాలకు సంబంధించిన ప్లాన్‌తో నగరపాలక సంస్థలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లాన్‌లో కచ్చితంగా నాలుగు వైపులా నిబంధనల మేరకు సెట్‌బ్యాక్స్ చూపించాలి. అయితే నిర్మాణ అనుమతుల కోసం ఇవన్నీ కాగితాల్లో బాగానే చూపుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇవేవీ అమలు చేయడం లేదు. ఒక్కసారి నగరపాలక సంస్థ అనుమతి ఇచ్చిందా చాలు.. ఇక నిర్మాణదారులు అడ్డదిడ్డంగా కట్టడాలు కట్టేస్తున్నారు.బాపుజీ నగర్‌లో ఓ వ్యక్తి నిర్మిస్తున్న నాలుగు అంతస్తుల భవనానికి ఎలాంటి సెట్‌బ్యాక్స్ లేవు.
ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రాజ్‌విహార్ వెళ్లే మార్గంలోనూ, ఆర్‌ఎస్ రోడ్డు, డీఎస్పీ సమీపంలోనూ, ఎస్పీ కార్యాలయంలో ఎదురుగా ఉన్న ప్రాంతంలోనూ, ఉస్మానియా కళాశాల రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎలాంటి సెట్‌బ్యాక్స్ లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి.
కర్నూలులో ఉన్న దాదాపు 30కిపైగా ఉన్న కల్యాణ మండపాలలో 20కిపైగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు.
పట్టణ ప్రణాళిక అధికారులు వీటిని గుర్తించి, మార్పులు చేసుకోవాలని, లేకపోతే కూల్చివేస్తామని, కొళాయి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసినా పరిస్థితి ఇప్పటి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది.
పార్కింగ్ స్థలాలూ అద్దెకు..
వాణిజ్య సముదాయాలు నిర్మించాలంటే కచ్చితంగా పార్కింగ్ సౌకర్యం ఉండాల్సిందే. పార్కింగ్ సదుపాయం చూపించకపోతే నిర్మాణ అనుమతులు ఇవ్వరు. అయితే నగరంలో ముఖ్యకూడల్లో నిర్మించిన వాణిజ్య భవనాల్లో పార్కింగ్ స్థలాలు ఉన్నా.. వాటిని సైతం అద్దెకు ఇచ్చే సంస్కృతి ఉంది. ఉదాహరణకు కృష్ణానగర్‌లోని ఆంధ్రబ్యాంక్ పక్కన ఉన్న ఓ వాణిజ్య సముదాయంలోని పార్కింగ్ స్థలాన్ని వ్యాపారులకు అద్దెకిచ్చారు. ఆ వాణిజ్య భవనానికి వచ్చే వాహనదారులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడం రోడ్దుపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నిత్యం అక్కడ ట్రాఫిక్ సమస్యతోపాటు చిన్నపాటి ప్రమాదాలకు పరిపాటిగా మారింది. అలాగే ఓ మాజీ మంత్రికి చెందిన వాణిజ్య సముదాయంలోని పార్కింగ్ స్థలాన్ని కూడా అద్దెకు ఇవ్వడం గమనార్హం. క్రిస్‌వర్డ్ సమీపంలోని ఓ కాంప్లెక్‌లో సైతం ఇదే పరిస్థితి.
సిబ్బంది అంతంత మాత్రమే..
కర్నూలులో 5.50 లక్షల మంది నివాసం ఉంటున్నారు. మొత్తం లక్షన్నర భవనాలుండగా.. పట్టణ ప్రణాళిక విభాగంలో ఆ స్థాయికి సరిపడా సిబ్బంది లేదు. దీంతో అక్రమ నిర్మాణాలకు ఊతం ఇస్తోంది. సిటీ ప్లానర్ పోస్టు ఉన్నా ఐదేళ్లుగా ఇక్కడ ఇన్‌చార్జీతోనే కాలం వెళ్లదీస్తున్నారు. రెండు అసిస్టెంట్ సిటీ ప్లానర్ పోస్టులుండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. నిర్మాణాల పర్యవేక్షణ చేయాల్సిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల కొరతా వేధిస్తోంది. ఉన్న కొంత మంది సిబ్బంది కార్యాలయానికే పరిమితమవుతున్నారు.
ప్రస్తుతం ఇప్పుడు నగరం మరింత విస్తరించింది. నగరానికి ఆనుకునే ఉన్న మూడు గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. ఒక్క స్టాంటన్‌పురం గ్రామ పంచాయతీలోనే గతంలో 40కిపైగా అపార్ట్‌మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వగా.. వాటిని గుర్తించి చర్యలు చేపట్టే విషయంలో అధికారులు మొద్దు నిద్రపోతుండడం విడ్దూరం.
కఠినంగా వ్యవహరిస్తాం
నగరంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలకు తావివ్వం. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. పార్కింగ్ స్థలాలను పార్కింగ్‌కు కాకుండా ఇతరత్రా వినియోగిస్తున్నట్లు మా దృష్టికి తెస్తే వారికి నోటీసులు ఇస్తాం. వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తున్నట్లు తేలితే చర్యలు తప్పవు.
- పీవీవీఎస్ మూర్తి,
కమిషనర్, కర్నూలు కార్పొరేషన్
అంతా మాఇష్టం..!
Published Mon, Feb 16 2015 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM
Advertisement
Advertisement