వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా
►మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి
సాక్షి, దువ్వూరు : ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లుగా కొన్ని దుష్టశక్తులు తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్ జిల్లా దువ్వూరులో నిన్న (సోమవారం) పార్టీ నాయకుడు సిద్ధయ్యనాయుడు స్వగృహంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు.
కొందరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ సీపీ తరఫున తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆ పార్టీ తరఫున గెలిచి టీడీపీలో చేరడమనేది తన స్వభావానికి పూర్తి విరుద్ధమని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, బొంతపల్లె వెంకటసుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు.