తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న నాగలదిన్నె బ్రిడ్జి
కర్నూలు, ఎమ్మిగనూరు: తుంగభద్ర నదిపై ‘నాగలదిన్నె బ్రిడ్జి’ నిర్మాణం కొనసా..గుతూనే ఉంది. గత పాలకుల వైఫల్యాలు ప్రజలకు శాపాలుగా మారాయి. ఎనిమిదేళ్లుగా అటు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక, ఇటు పుట్టి ప్రయాణాలకు అనుమతుల్లేక ప్రజలు నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయలసీమ – తెలంగాణ జిల్లాలను అనుసంధానం చేస్తూ నందవరం మండలం నాగలదిన్నె, తెలంగాణలోని అయిజ మధ్య తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మాణానికి 1993లో అంకురార్పణ చేశారు. 1992లో తుంగభద్రకు వరదలు రావటంతో బ్రిడ్జి ఆవశ్యకత ఏర్పడింది. 1993లో పనులు మొదలైనా..అధికారికంగా చేపట్టింది మాత్రం 2003లోనే. అయితే.. 2009 అక్టోబర్ 2నతుంగభద్ర వరద కారణంగా అప్పటివరకు కట్టిన బ్రిడ్జి పూర్తిగా నేల మట్టమైంది. మూడేళ్ల అనంతరం 2012లో బ్రిడ్జి పునర్నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలిచి.. పనులను ప్రారంభించారు. 2016 డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని గడువిచ్చారు. పనులు మొదలై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇంతవరకు 80 శాతం కూడా పూర్తి కాలేదు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారుల మధ్య సమన్వయలోపం, చేసిన పనులకు గతంలో సరిగా బిల్లులు ఇవ్వకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.
అడుగడుగునా అవరోధాలు
రూ.41 కోట్లతో చేపట్టిన నాగలదిన్నె బ్రిడ్జి నిర్మాణానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటికీ తుంగభద్ర నది ఆవలి భాగం తెలంగాణలో ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. తుంగభద్ర నదికి అటువైపు భూసేకరణ సమస్యగా మారింది. పాత బ్రిడ్జి స్థానంలో కాకుండా స్వల్ప మార్పులు చేసి కొత్త డిజైన్‌తో నిర్మాణం చేపట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భూ సేకరణ కోసం అక్కడి ప్రభుత్వం, రైతుల మధ్య సమన్వయం కుదరలేదు. ఇప్పటిదాకా మొత్తం 27 పిల్లర్ల నిర్మాణం పూర్తి చేశారు. వాటిపై ప్లాట్‌ఫారంగా 84 పీఎస్‌సీ (ప్రీజ్ స్ట్రక్చర్ కాంక్రీట్) స్లాబ్‌లను వేశారు. అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో భూసేకరణ సమస్యను పరిష్కరిస్తేనే నిర్మాణం పూర్తవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు.
ఇబ్బందుల్లో ప్రజలు
నాగలదిన్నె బ్రిడ్జి పూర్తయితే రాయలసీమ – తెలంగాణ జిల్లాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. నదిలో రెండేళ్లుగా పుట్టి ప్రయాణాలను కూడా నిషేధించారు. దీంతో తుంగభద్ర నది దాటాలంటే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపైనే నడక సాగించాల్సి వస్తోంది. వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. తెలంగాణ వైపు రోడ్డు నుంచి బ్రిడ్జి 40 అడుగుల ఎత్తులో ఉండటంతో ప్రయాణికులు ఇనుపరాడ్లతో కూడిన నిచ్చెన నుంచి దిగాల్సి వస్తోంది. ప్రమాదంతో కూడిన ప్రయాణాలు కావటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment