నంద్యాలలో మంత్రుల తిష్టపై దృష్టి పెట్టాం: ఈసీ
నంద్యాల: ఎన్నికల నియమవళిని ఉల్లంఘిస్తే మంత్రులకైనా నోటీసులిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. నంద్యాలలో పెద్ద ఎత్తున మంత్రులు తిష్ట వేయడం తమ దృష్టికి వచ్చిందన్నారు. మంత్రుల పర్యటనను సుమోటోగా స్వీకరించామని, వారి పర్యటనపై దృష్టి పెట్టాలని తాము సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నంద్యాల ఉపఎన్నికలకు నేటితో(శనివారంతో) నామినేషన్ల గడువు ముగిసింది.
ఈ సందర్భంగా మాట్లాడిన భన్వర్‌లాల్ ఈ ఉప ఎన్నికకు మొత్తం 48 నామినేషన్లు దాఖలయ్యాయని, చివరి రోజు 28 నామినేషన్లు దాఖలైనట్టు చెప్పారు. ఈ నామినేషన్లను 7న పరిశీలించి, 9 వరకు ఉపసంహరణకు అవకాశం ఇస్తామని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా.. విచారణ చేయమని కలెక్టర్ ఆదేశించినట్టు తెలిపారు.