మీరు ఓటెవరికి వేశారో ఇతరులు ఎవరికీ తెలియదు
నిర్భయంగా ఓటు వేయండి.. నంద్యాల ఓటర్లకు ఈసీ భన్వర్‌లాల్ పిలుపు
- ఓటర్లు 92231 66166 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు
- లైవ్ వెబ్‌కాస్టింగ్‌తో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- 23వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
సాక్షి, హైదరాబాద్: ఓటరు ఎవరికి ఓటు వేసింది ఇతరులకు తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదని, నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా నిర్భయంగా ఓటేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. తమకు నచ్చినవారికి, అభీష్టం మేరకు ఓటు వేయాలని సూచించారు. ఈ విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించినా, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని పునరు ద్ఘాటించారు. సోమవారం హైదరాబా ద్‌లోని కార్యాలయంలో భన్వర్‌లాల్ మీడియాతో మాట్లాడారు.
నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగు తుందని చెప్పారు. ఆరు గంటల సమయానికి పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలో ఉన్న వారిని రాత్రి ఎన్ని గంటల వరకైనా ఓటేయడానికి అనుమతిస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లోపలా, బయట లైవ్ వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, పోలింగ్ తీరును అనుక్షణం పరిశీలిస్తారని భన్వర్‌లాల్ వివరించారు. ఎక్కడ ఏం జరిగినా ఎన్నికల సిబ్బంది క్షణాల్లో స్పందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రచారం ముగిసినందున స్థానికేత రులు నంద్యాల విడిచి వెళ్లాలని ఆయన ఆదేశించారు.
భారీ బందోబస్తు: 2,500 మంది పోలీ సులు, ఆరు కంపెనీల పారామిలటరీ బలగా లు బందోబస్తులో పాల్గొంటున్నారని భన్వర్ లాల్ తెలిపారు. 82 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లంద రికీ ఓటింగ్ స్లిప్‌లు పంపామని, పోలింగ్ బూత్‌ల్లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించామని చెప్పారు. వికలాంగులకు ప్రత్యే క ఏర్పాట్లున్నాయని, అంధులకు బ్రెయిలీ లిపి ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పించామని తెలిపారు. ఓటరు ఎవరికి ఓటు వేసిందీ ఇతరులెవరికీ తెలిసే అవకాశం లేదని, పోలిం గ్ బూత్‌లో ఓటరు తాను వేసిన ఓటును ఏడు సెకన్ల పాటు చూసుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 15 వేలమంది ఓటర్లకు ఓటింగ్ స్లిప్ లు ఇవ్వలేదని, వీరిలో స్థానికంగా లేనివారు, డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టుగా గుర్తించామన్నారు.
చానళ్లపై నిఘా: రాష్ట్రంలోని 16 తెలుగు చానళ్లను 24 గంటలూ వాచ్ చేస్తున్నామని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ప్రసారాలు చేసినా చర్యలు తప్పవని భన్వర్‌లాల్ హెచ్చరించారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్, చర్చలను అనుమతించవద్దని ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలను కోరారు. పోలింగ్ ఫలితాలను ప్రభావితం చేసేలా ఎలాంటి కథనాలు ప్రసారం చేసినా దాన్ని ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్, బల్క్ ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం కొనసాగుతుం దన్నారు.
వీటినీ ఎన్నికల సిబ్బంది గమనిస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని చెప్పారు. ఓటర్లు తమకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, పార్టీలు నిబంధనలు ఉల్లంఘించినా 9223166166 అనే నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేసినట్టు వచ్చిన ఫిర్యాదులపై భన్వర్‌లాల్ స్పందించారు. దీనిపై ఎన్నికల కమిషన్ వివరణ కోరిందని, తమకు అందిన వివరణతో జిల్లా కలెక్టర్ ఓ నివేదిక పంపారని, అయితే, దాన్ని మరోసారి పరిశీలించి నివేదిక పంపాలని ఆయన్ను కోరినట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.1.16 కోట్ల నగదు సీజ్ చేశామని, 316 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.