నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలి..
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య, కుమారుడు, కోడలు, కుమార్తె సహా శిల్పా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. నంద్యాల సంజీవ్‌నగర్ బూత్ నెంబర్ 81లో ఓటు వేశారు.
అనంతరం శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ పూర్తి చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గత రాత్రి కూడా తమ ఇంటిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. పౌరులంతా స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనాలని శిల్పా మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ దౌర్జన్యాలకు ఓటు రూపంలో జవాబు చెప్పాలన్నారు.
జగనన్న సీఎం కావాలనేది అందరి కోరిక..
శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ అధికార పక్ష వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రశాంత వాతారవణాన్ని చెడగొట్టాలని అధికార పక్షం ప్రయత్నిస్తోంది. శాంతియుతంగా ఎన్నికలు జరగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. జగనన్న సీఎం కావాలనేది అందరి కోరిక. ఆ కోరికకు తొలి మెట్టు నంద్యాల ఉప ఎన్నిక.’ అని అన్నారు. శిల్పా నాగినిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఓటర్లు వేసే ఓటు వారికి తప్ప ఎవరికీ తెలియదని పేర్కొన్నారు.
కాగా నంద్యాల ఉప ఎన్నికలో మహిళాలోకం కదలి వస్తోంది. అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళా ఓటర్లు...... పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దాదాపు చాలా పోలింగ్ బూత్స్ వద్ద ....మహిళా ఓటర్లే ఎక్కువుగా కన్పించడం ఇందుకు నిదర్శనం. 85 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణి మహిళలు సైతం ఓటు వేసేందుకు రావడం విశేషం.