
రేపు సీఎం రాక
సిరిపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాకు రానున్నారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో సాయంత్రం జరిగే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జన్మభూమి కార్యక్రమం ముగింపు దశకు వచ్చినందున ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు.
బడి పిలుస్తోంది కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉన్నందున అందుకు ఏర్పాట్లు చేయాలని డీఈవో ఎం.వెంకట కృష్ణారెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీవో బి.నగేశ్‌లను ఆదేశించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని గతంలోలా కాకుండా వినూత్న రీతిలో నిర్వహించాలని వ్యవసాయశాఖ జేడీ లీలావతిని ఆదేశించారు. నీరు-చెట్టు కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని డుమా పీడీకి సూచించారు.
పేదరికంపై గెలుపు కార్యక్రమంలో భాగంగా పెన్షన్లు అందించడంతో పాటు ముఖ్యమంత్రి వారితో మాట్లాడేందుకు వీలుగా కొంతమంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ నెల 17వతేదీన జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నామని ఇన్‌చార్జి కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, జెడ్‌పీ సీఈవో మహేశ్వర్‌రెడ్డి, డీఎంఎండ్‌హెచ్‌వో రెడ్డి శ్యామల, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎ.కృష్ణారావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.