
మామ పోయే అల్లుడు వచ్చే..
* రసకందాయం పెనమలూరు టీడీపీ రాజకీయం
* పోటీకి గతంలో బాలకృష్ణ ఆసక్తి
* లోకేష్‌కు సీటు ఇస్తే గెలిపిస్తామంటున్న వైవీబీ
* ‘బోడె’కు చెక్ పెట్టేందుకేనా?
సాక్షి, విజయవాడ : పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌ను పోటీకి దింపితే భారా మెజారిటీతో గెలిపించుకుంటామంటూ మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రకటించడం జిల్లా టీడీపీలో సంచలనం కలిగింది. పెనమలూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఇన్‌చార్జిని చంద్రబాబు నియమించలేదు. ఒక సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ ఇప్పటి వరకు పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది.
దీనికి తగ్గట్లుగానే బాలకృష్ణ కూడా రెండు మూడు నెలలకు ఒకసారి జిల్లాకు వస్తూ.. పార్టీ వ్యవహారాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపధ్యంలో పెనమలూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తే జిల్లాలో పార్టీ కొత్త ఊపు వస్తుందని పార్టీకి చెందిన కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన్ను పక్కన పెట్టి నారా లోకేష్‌కు సీటు ఇస్తే, మంచి మెజారిటీతో గెలిపిస్తానని వైవీబీ ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఎన్టీఆర్ సొంత జిల్లాలో నందమూరి వంశానికి హవా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు. గతంలో హరికృష్ణ, జూ.ఎన్టీఆర్‌లకు జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ ఇద్దరూ విజయవాడ వచ్చినా తెలుగుదేశం నేతలు ఎవ్వరూ వెళ్లి కలవడం లేదు. దీంతో జూ.ఎన్టీఆర్ రావడం తగ్గించారు. ఇప్పుడు బాలకృష్ణ హవాను తగ్గించేందుకే లోకేష్‌ను తెరపైకి తెస్తున్నారా అని ఎన్టీఆర్ అభిమానులు అనుమానిస్తున్నారు.
చంద్రబాబు, బాలయ్యకు దగ్గరయ్యే యత్నం...
పెనమలూరు ఎమ్మెల్యే టికెట్‌ను వైవీబీ ఆశిస్తున్నారు. ఇదే సీటు కోసం బోడే ప్రసాద్, చలసాని పండు భార్య పద్మావతి, మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ, అర్బన్ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చంద్రశేఖర్ తదితర అనేక మంది రేసులో ఉన్నారు. వైవీబీకి వ్యతిరేకంగా బోడేప్రసాద్, చలసాని పండు వర్గం కలిసి పనిచేస్తోంది. దీనికి తోడు బాలకృష్ణతోనూ వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు సత్సంబంధాలు లేవు.
ఈ క్రమంలో పెనమలూరు సీటును నారా లోకేష్‌కు ఇవ్వాలంటూ ప్రతిపాదనను తెరపైకి తెస్తే అటు చంద్రబాబు, ఇటు బాలకృష్ణకు దగ్గర కావచ్చని వైవీబీ ఎత్తుగడ వేశారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. లోకేష్, బాలకృష్ణ ఇద్దరూ రంగంలోకి రాకపోతే వారికి బదులుగా ఆ సీటు తమకే ఇవ్వాలని చంద్రబాబు నాయుడ్ని కోరవచ్చనే వైవీబీ ఈ ప్రకటన చేశారని అనుకుంటున్నారు. కేవలం తాను సీటు దక్కించుకునేందుకే ఈ ప్రకటన చేశారు తప్ప వారిపై అభిమానంతో కాదని ఆయన వ్యతిరేక వర్గం చెబుతోంది.
బోడేకు చెక్ పెట్టే ప్రయత్నం!
మంత్రి పార్థసారథి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలోకి దిగేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆయన టీడీపీలోకి వెళ్లి బందరు ఎంపీ సీటుకు పోటీ చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. పెనమలూరు టికెట్‌ను ఆశిస్తున్న బోడే ప్రసాద్ మంత్రిని రహస్యంగా కలుసుకున్నారు. బందరు ఎంపీ సీటు పార్థసారథికి ఇచ్చే పక్షంలో బోడే ప్రసాద్ కు పెనమలూరు సీటు దక్కే అవకాశం ఉంటుంది.
అందువల్ల ముందుగానే నారా లోకేష్‌ను పెనమలూరుకు ఆహ్వానిస్తే బోడే ప్రసాద్‌తో పాటు ఈ టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలకు చెక్ పెట్టినట్లు ఉంటుందని వైవీబీ భావిస్తున్నారు. మంత్రి పార్థసారథిని బోడే ప్రసాద్ కలవడాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లేందుకు వైవీబీ వర్గం సిద్దమవుతోంది. అభివృద్ధి పనుల విషయం చర్చించేందుకే మంత్రిని కలిసినట్టు బోడే వర్గం చెబుతోంది. బిల్డర్ అయిన బోడే ప్రసాద్ అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకే మంత్రిని కలిశారనే ప్రచారం కూడా జరుగుతోంది.