నారాయణ కళాశాల వద్ద ధర్నా చేస్తున్న తల్లిదండ్రులు
మదనపల్లె: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామంటూ ఇల్లిల్లూ తిరిగి, బతిమాలి కళాశాలలో చేర్పించుకున్న నారాయణ కళాశాల యాజమాన్యం ముందస్తు సమాచారం లేకుండా అర్ధాంతరంగా కళాశాలను మూసివేసింది. శుక్రవారం కళాశాలకు బయలుదేరిన పిల్లలు ఈ విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కళాశాల ఎదుట ధర్నా చేశారు. వారి గోడు వినేవారు, సమాధానం చెప్పేవారు లేకపోవడంతో విలేకరులను ఆశ్రయించారు. స్థానిక ఎస్‌బీఐ కాలనీలో నారాయణ స్కూల్ యాజమాన్యం 1 నుంచి 10 వరకు పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాల నడుపుతోంది. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ గ్రూపులో సుమారు 90 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. 2018–19లో ప్రవేశాల కోసం పదో తరగతి పరీక్షలు ప్రారంభంకాక ముందు నుంచి అధ్యాపకులు పట్టణంలో ఇంటింటికీ తిరిగి పిల్లలను చేర్పించారు. కళాశాల ప్రారంభమై నెల రోజులకు పైగానే నడిచింది.
విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెక్చరర్లు పనిచేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఉన్నట్టుండి కళాశాలను యాజమాన్యం మూసివేసింది. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే.. తిరుపతిలోని తమ బ్రాంచీల్లో ఎక్కడైనా ఇదే అడ్మిషన్ నంబర్‌పై చేర్చుకుంటామని, కాకపోతే ఫీజు ఎక్కువగా ఉంటుందని, హాస్టల్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కట్టిన ఫీజుల్లో అడ్మిషన్ ఫీజు మినహాయించుకుని తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని చెబుతోంది. కానీ ముందస్తు సమాచారం లేకుండా కళాశాల మూసివేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్నా వారికి సమాధానం చెప్పేందుకు, పరిస్థి తి వివరించేందుకు కళాశాల యాజమాన్యం ఎవ రూ లేకపోవడం గమనార్హం. సిబ్బంది ఎవరైనా వస్తారేమోనని ఆశగా ఎదురుచూసి ఉసూరుమంటూ వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment