
సాక్షి, అమరావతి: తిత్లీ తుపాను అల్లకల్లోలం నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
శ్రీకాకుళం చేరుకున్న సీఎం చంద్రబాబు సహాయ చర్యలపై సమీక్ష
సాక్షి, అమరావతి/ శ్రీకాకుళం పాత బస్టాండ్: ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాత్రి శ్రీకాకుళం చేరుకున్నారు. అధికారులతో సమావేశమై.. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, సీఎం రెండు రోజుల పాటు జిల్లాలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. శుక్రవారం ఆయన టెక్కలి డివిజన్‌లో పర్యటిస్తారని వెల్లడించారు. అంతకుముందుతాత్కాలిక సచివాలయం నుంచి తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎం పర్యటన.. ఫీల్డ్‌కు వెళ్లని అధికారులు
శ్రీకాకుళం–సాక్షి ప్రతినిధి: తిత్లీ పెను ప్రభావం చూపిస్తుందని ముందే ఊహించిన అధికారులు దాన్ని ఎదుర్కొనేందుకు గత రెండు రోజులుగా సన్నద్ధమయ్యారు. బుధవారం రాత్రంతా టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గురువారం తెల్లవారుజామున సహాయక చర్యలు ముమ్మరం చేయాలని భావించారు. అయితే... సీఎం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారనే కబురందడంతో అధికారుల ప్రణాళిక అంతా తారుమారయ్యింది. ఫీల్డ్‌కు వెళ్లకుండా గురువారం అంతా జిల్లా కేంద్రానికే పరిమితం కావాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment