ఖర్చు తగ్గింపా.. కక్ష సాధింపా!
ఎల్.ఎన్.పేట:దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం వ్యవసాయ పనులు లేని సమయాల్లో లక్షలాది గ్రామీణ ప్రాంత రైతులు, కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. ఈ పనుల పర్యవేక్షణకు క్షేత్ర సహాయకుల(ఫీల్డ్ అసిస్టెంట్లు)ను నియమించారు. 2007 జూన్ 12న విధుల్లో చేరిన వీరి భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ పథకం కింద అధిక శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇటీవల అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఖర్చు తగ్గింపు పేరుతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే ఆలోచనను తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు పలుమారు ఇటువంటి ప్రకటనలు చేయడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనకు గురవుతున్నారు.
8 ఏళ్లుగా సేవలు
ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి .. గత ఎనిమిదేళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. సగటున ఒక్కో పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను అప్పట్లో నియమించారు. ఆ లెక్కన ప్రస్తుతం జిల్లాలో 1103 మంది పని చేస్తున్నారు. ప్రారంభంలో రూ.1200 వేతనం పొందిన వీరికి ప్రస్తుతం రూ.5,440 లభిస్తోంది. ఇది కాకుండా వేతనదారులతో ఎక్కువ పని దినాలు చేయిస్తే ప్రోత్సాహకాలు ఇస్తారు. నెలకు 2వేల పని దినాలు చేయించిన వారికి రూ.250, 5వేల పని దినాలు చేయించిన వారికి రూ.500 అదనంగా ఇస్తున్నారు. ఈ అరకొర జీతాలతోనే నిత్యం ఎండ లో ఉంటూ వేతనదారులతో పనులు చేయిస్తూ పథ కం లక్ష్యాలు సాధించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేస్తున్నారు. ఇచ్చేది తక్కువ జీతమే అయినా.. ప్రస్తుతం రెగ్యులర్ కాకపోయినా భవిష్యత్తులోనైనా తమను పర్మినెంట్ చేస్తారన్న కొండంత ఆశతో ఉన్న వీరికి కొత్త ప్రభుత్వ ఆలోచనలు మింగుడు పడటంలేదు.
కక్ష సాధింపునకేనా?
వాస్తవానికి ఎన్నికలకు ముందు ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిం ది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించింది. ఎన్నికల్లో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని భావించడమే దీనికి కారణమని తెలిసింది. అయితే ఎవరో కొందరు వ్యతిరేకంగా పని చేసినంత మాత్రాన అందరినీ తొలగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్న పళంగా తమను తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, అందువల్ల ఆలోచనను విరమించుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరుతున్నారు.