తమ్ముళ్లకు ఉపాధి!
వీఆర్పీలుగా టీడీపీ కార్యకర్తలను
నియమించేందుకు రంగం సిద్ధం
నిబంధనలు బేఖాతర్.. జన్మభూమి కమిటీ సిఫార్సుచేసిన వారికే పోస్టులు
నక్కపల్లి: ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు (వీఆర్పీలు)గా టీడీపీ కార్యకర్తలను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా కేంద్రప్రభుత్వ నిబంధనలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ చట్టాన్ని తుంగలో తొక్కేందుకు యత్నిస్తోంది. జన్మభూమి కమిటీల సిఫార్సు మేరకు వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వివిధ కారణాల వల్ల తొలగించిన వారి స్థానంలో ఖాళీలు భర్తీచేసే క్రమంలో ఈ ఆదేశాలు పాటించాలని పేర్కొన్నట్లు సమాచారం. ఉపాధి హమీ పథకం ద్వారా గ్రామల్లో చేపట్టే పనులకు హాజరయ్యే కూలీలకు మస్తర్లువేయడం, పనులు గుర్తించడం, పేఆర్డర్లు జనరేట్ చేయడం, జాబ్‌కార్డులు జారీ చేయడం వంటి పనులు ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకానికి అప్పట్లో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు. వీరికి సుమారు రూ. 4 వేల వరకు వేతనం ఇచ్చేవారు. కొద్దిరోజుల పాటు కూలీలకు పేమెంట్లు కూడా వీఆర్‌పీలే చెల్లించారు. త ర్వాత పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు.
ఉపాధి హమీ పథకంలో కొంతమంది వీఆర్‌పీలు అవకతవకలకు పాల్పడ్డారని, గ్రామంలో లేనివారి పేరున, చనిపోయిన వారిపేరున మస్తర్లు వేసి లక్షలాది రూపాయలు స్వాహా చేశారని సామాజిక తనిఖీల్లో వెల్లడవడంతో కొంతమంది వీఆర్‌పీలను తొలగించారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 350 వీఆర్‌పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో కూలీల్లో సంతకం చేయడం వచ్చి మస్తర్లు వేయడం తెలిసిన ఒకరిని మేట్‌గా నియమించి పనులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నేధ్యంలో టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వీఆర్‌పీ పోస్టులను వారితో భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు భోగట్టా. నిబంధనల ప్రకారం తొలగించిన వీఆర్‌పీ స్థానంలో గ్రామంలో ఎక్కువ రోజులు ఉపాధి పనులకు వచ్చిన వ్యక్తిని వీఆర్‌పీగా నియమించాలి. కానీ ప్రస్తుతం నియమించబోయే వీఆర్‌పీల విషయంలో ప్రభుత్వం ఈ నిబంధనలను పక్కన పెట్టాలని నిర్ణయించింది. జన్మభూమి కమిటీ ముగ్గురు పేర్లను సిఫార్సు చేసి ఎంపీడీవోకు పంపిస్తే వారిలో ఒకరిని ఎంపీడీవో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఎంపికచేయాలని పేర్కొన్నట్టు సమాచారం.