నవోదయానికి నీరసం | Navodayam program IN Srikakulam | Sakshi
Sakshi News home page

నవోదయానికి నీరసం

Published Tue, Mar 29 2016 11:56 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Navodayam program IN Srikakulam

 జిల్లాను సారా రహిత ప్రాంతంగా మారుస్తామని ప్రకటించిన యంత్రాంగం నిధుల విషయంలో ఇబ్బందులు పడుతోంది. సారా తయారీ, రవాణా, అమ్మకాల ప్రాంతాల్లో గ్రామ సభలు పెట్టి కౌన్సెలింగ్ ద్వారా వారిలో మార్పు తీసుకువస్తామని భావిస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఖర్చు విషయంలో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఫిబ్రవరి 10న జిల్లా వ్యాప్తంగా ‘నవోదయం’ ప్రారంభించారు. లక్ష్యం మంచిదే గానీ, నిధులే ఇబ్బందిగా మారిందని అధికారులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా అధికారి పరిధిలో ఇప్పటివరకు కేవలం రూ.1లక్షే మంజూరైందని, ఆంధ్ర-ఒడిశా ప్రాంతాల్లో భారీగా దాడులు చేస్తున్న తమకు గ్రామస్తుల కౌన్సెలింగ్ కోసం, జనాన్ని చైతన్యం చేసేందుకు డబ్బు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ః రాష్ట్రాల సరిహద్దుల్లో ఇరు వర్గాల అధికారులు సమీక్షించుకుని సారా రహిత ప్రాంతాలుగా చేయాలన్నది ప్రభుత్వ ధ్యేయం. నవోదయం కార్యక్రమం ప్రకటించకముందు జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బంది సహాయంతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని సారా విక్రయ, తయారీ కేంద్రాలపై విరుచుకుపడ్డారు. బెల్లంఊటల్ని, సారా బట్టీలను ధ్వంసం చేశారు. ఏజెన్సీలోని శివారు ప్రాంతాలకూ మఫ్టీలో వెళ్లి సారా తయారీపై ఉక్కుపాదం మోపారు.
 
 అనంతరం ఇరు రాష్ట్రాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు తాజా పరిస్థితులపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని భావించారు. రెండు నెలలవుతున్నా ఇది పూర్తికాలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ యథాతథస్థితే కనిపిస్తోందంటూ సిబ్బంది వాపోతున్నారు. ఒడిశా ప్రభుత్వ సహాయంతో సరిహద్దులోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ దాడులు నిర్వహించామని ఇప్పుడు జిల్లాలోనేఫలితాలు సాధించాల్సి ఉందని అబ్కారీశాఖ అధికారులు చెబుతున్నారు.
 
 సమస్యాత్మక గ్రామాలు 109
 జిల్లా వ్యాప్తంగా ఆరు మండలాల పరిధిలో 109 సమస్యాత్మక గ్రామాల్ని గుర్తించారు. సోంపేట, పాలకొండ, పాతపట్నం, కొత్తూరు, టెక్కలి, పలాస పరిధిలో ఆయా సీఐలు సారా రహిత ప్రాంతాలుగా మార్చాలంటే మరింత పకడ్బందీగా వ్యవహరించాలంటున్నారు. జనం కూడా సహకరిస్తేనే ఫలితాలు సాధించగలం అని చెబుతున్నారు. ఈ మేరకు ఆరుగురు సీఐల్ని ప్రత్యేక బృందంగా గుర్తించి తాజాగా అబ్కారీశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు లక్ష్యాలిచ్చారు.
 
 వీఆర్‌వోలు, హెడ్‌మాస్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు గ్రామసభలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేయించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బెల్లం వ్యాపారులకూ కౌన్సెలింగ్ చేస్తున్నారు. పాల కొండ పరిధిలో రెల్లివీధి, పాలకొండ టౌన్, వీరఘట్టంలోని బీసీ కాలనీ, సీతంపేట పరిధిలో నారాయణగూడ, యాద, సోంపేట పరిధిలో మందస వంటి ప్రాంతాల్లో ‘మాసివ్ రైడ్స్’ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
 
 ఇవీ ఫలితాలు
 నిధుల ఇబ్బంది ఉన్నా అధికారులు పలుచోట్ల లక్ష్యాల సాధనకు గ్రామస్తుల సహకారంతో పాటుపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 82ఐడీ (ఇల్లీసిట్ డిస్టిల్ల్‌డ్ లిక్కర్)కేసుల్ని నమోదు చేశారు. 37మందిని అరెస్టు చేశారు. సీఆర్‌పీసీ 110చట్టం కింద 125మందికి బైండోవర్ విధించారు. 2,375లీటర్ల సారాను, 125లీటర్ల వాష్‌ను థ్వంసం చేశారు. 1లక్ష23వేల 750లీటర్ల బెల్లం ఊటను థ్వంసం చేశారు. 90కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాల్ని అదుపులోకి తీసుకున్నారు. 112చోట్ల గ్రామసభలు నిర్వహించారు.
 
 కేటగిరీలివీ
 పాలకొండ పరిధిలో ఏ (సారా తయారీ, రవాణా, విక్రయం) కేటగిరీల కింద 5ప్రాంతాల్ని గుర్తించగా బీ (స్మాల్ స్కేల్ విక్రయాలు) కేటగిరీ కింద ఏడు ప్రాంతాల్ని, సీ (ఎక్కడో తయారీ, ఇక్కడ అమ్మకాలు) కేటగిరీ కింద మరో 7ప్రాంతాల్ని (మొత్తం 19గ్రామాలు) గుర్తించారు. పాతపట్నం పరిధిలో ఏ కింద 8, బీ కింద 10, సీ కింద ఏడు మొత్తం 25గ్రామాల్నీ, కొత్తూరు పరిధిలో ఏ కేటగిరీ కింద 5, బీ కింద ఆరు, సీ కింద 9, మొత్తం 20గ్రామాల్ని గుర్తించారు. టెక్కలి పరిధిలో ఏ కేటగిరీ కింద మూడు, బీ కింద 2, సీ కింద 9, మొత్తం 14గ్రామాల్నీ, పలాస పరిధిలో సీ కేటగిరీ కింద 6గ్రామాల్ని, సోంపేట పరిధిలో ఏ కింద 2, బీ కింద 15, సీ కింద 8, మొత్తం 25గ్రామాల్నీ ఇలా..మొత్తం 7మండలాల పరిధిలో 109గ్రామాల్ని గుర్తించి ఆరుగురు సీఐల్ని ప్రత్యేకంగా నియమించారు. ఖర్చు విషయంలో ఎలా చేయాలో తెలియక అధికారులు తికమక పడుతున్నారు.  
 
 బైండోవర్లు నేరం చేస్తే కఠిన చర్యలే
 గతంలో నేరం చేసిన నిందితులు మళ్లీ తప్పు చేస్తే వారు ప్రభుత్వానికి చేసిన డిపాజిట్ మొత్తం వెనక్కు రాకుండా అప్రమత్తం చేస్తున్నాం. నేరం చేసినందుకు మళ్లీ కేసులు నమోదు చేస్తాం. తహశీల్దార్ వద్ద ఫైన్ చెల్లించేలా చేస్తున్నాం. జిల్లాను సారా రహిత కేంద్రంగా ప్రకటించేందుకు ఎంతో దూరం లేదు. కొన్ని ఇబ్బందులున్నా అధిగమించే ప్రయత్నం చేస్తాం.
 శివప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement