ఆంధ్రప్రదేశ్‌సహా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు కదలికలు ఊపందుకున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌సహా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు కదలికలు ఊపందుకున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. వారికి అందిన తాజా సమాచారం మేరకు రాష్ట్ర సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలు బాగా పెరిగినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలోని సీమాం ధ్రలో సమైక్య ఉద్యమ బందోబస్తులో పోలీసులు బిజీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న నక్సల్స్ తమ కార్యకలాపాలు పెంచి ఉంటారని అనుమానిస్తున్నారు.
దీంతో ముందు జాగ్రత్తగా 4 రాష్ట్రాల సరిహద్దుల్లోనూ పారామిలటరీ, గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఇదిలావుంటే, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జిల్లా కలెక్టర్, పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర గురువారం పేలింది. ఇలాంటి మందుపాతరల ను మన రాష్ట్ర సరిహద్దుల్లో కూడా పెద్ద సంఖ్యలోనే అమర్చినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. పారామిలటరీ బలగాలను లక్ష్యంగా చేసుకుని వీటిని అమర్చినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నక్సల్స్ కోసం వేట ముమ్మరం చేశారు.