ఢిల్లీకి... రాజు వెడలె
- అశోక్‌ను కేంద్రమంత్రిగా తీసుకుంటున్నట్లు ఎన్డీఏ నుంచిఆహ్వానం
- నేడు ప్రమాణస్వీకారం
- జిల్లానుంచి కేంద్ర మంత్రి పదవిని అలంకరిస్తున్న రెండో వ్యక్తిగా రికార్డు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ సీనియర్ నేత, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజును కేంద్రమంత్రి పదవి వరించనుంది. ఈ మేరకు ఎన్డీఏ నుంచి ఆహ్వానం అందడంతో ఆయన ఢిల్లీలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులు బయలుదేరి వెళ్లారు.
జిల్లా నుంచి రెండో వ్యక్తి
కేంద్రమంత్రి పదవిని అధిష్టించిన వారిలో జిల్లా నుంచి రెండోవ్యక్తిగా అశోక్ గజపతిరాజు చరిత్ర కెక్కనున్నారు. గతంలో జిల్లాకు చెందిన వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్ రెండు పర్యాయాలు కేంద్రమంత్రి పదవిని అలంకరించారు. చరణ్‌సింగ్ ప్రభుత్వంలో ఉక్కు, బొగ్గు గనుల శాఖా మంత్రిగా, మన్మోహన్‌సిం గ్ ప్రభుత్వంలో కేంద్ర పంచాయతీరాజ్, గిరిజన వ్యవహారాల శాఖామంత్రిగా పనిచేశారు. ఆయనకు తప్ప మరొకరికి కేంద్రంలో ఇంతవరకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అశోక్‌గజపతిరాజు ఎంపీగా ఎన్నికైన తొలిసారే కేంద్ర మంత్రి పదవిని అధిష్టించనున్నారు.
రాష్ట్రమంత్రిగా అత్యధిక కాలం రికార్డు అశోక్‌దే
కేంద్రమంత్రి పదవిని అలంకరించనున్న అశోక్ గజపతిరాజు రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. జిల్లా నుంచి అత్యధికకాలం మంత్రిగా కొనసాగిన రికార్డు ఆయన పేరునే ఉంది. 1978లో జనతా పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన అశోక్ గజపతిరాజు ఎన్టీఆర్ హయాంలో మొట్టమొదట మంత్రి పదవిని చేపట్టారు. 1985లో వాణిజ్య పన్నుల శాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1994లో కూడా అదే మంత్రి పదవిని అలంకరించారు. ఎన్టీఆర్ పదవీచ్యుతులైన తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా నాలుగేళ్లు కొనసాగారు. ఇక, 1999లో ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వంలో రెవెన్యూ శాఖామంత్రిగా 2004వరకు కొనసాగారు.
అశోక్ అనుచరుల్లో ఆనందం
ఈసారి అశోక్ ఎంపీగా పోటీ చేయడం నియోజకవర్గ పార్టీ శ్రేణులకు, ఆయన అనుచరులకు తొలుత ఏమాత్రం రుచించలేదు. బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ నేతను ఏం చేద్దామనుకుంటున్నారంటూ వాగ్వాదానికి కూడా దిగారు. అయితే పార్టీతో పాటు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో అశోక్ అనుచరుల్లో ఉత్తేజం వచ్చింది. తమ నేతకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఆశించారు. అనుకున్నట్టుగా మోడీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా అశోక్ బాధ్యతలు స్వీకరించనుండడంతో విజయనగరం నియోజకవర్గ టీడీపీ నేతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.