ఏటూరునాగారం, న్యూస్‌లైన్ :
ఆదివాసీలు స్వయం పాలనను సాధిం చుకునేందుకు సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని ఆదివాసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పశ్చిమగోదావరి జిల్లా బాధ్యుడు మడకం వెంకటేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివాసీ సేన ద్వితీయ మహాసభలు, బహిరంగ సభ ఏటూరునాగారంలోని కొమురంభీం మినీ స్టేడియంలో మంగళవారం ఆదివాసీ సేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడి రాంచందర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కణితి లక్ష్మణ్‌రావు, మండకం వెంకటేశ్వర్‌రావు హాజరయ్యారు. లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. అగ్రకులాలు, పెట్టుబడిదారులు ఆదివాసీ ప్రజానీకాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపంచారు. 2008లో స్థాపించిన ఆదివాసీ సేన ఉద్యమ ఫలితంగానే కొన్ని చట్టాలు అమలవుతున్నాయన్నారు. పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
కేసులకు వెనకాడేది లేదు..
ఆదివాసీల హక్కుల సాధన కోసం పోరాడినందుకు తనపై ప్రభుత్వం 150 కేసులు పెట్టి, ఆరేళ్లు జైలు పాలు చేసిందని, అయినా ఆదివాసీల కోసం పోరాడుతూనే ఉంటానని వెంకటేశ్వర్‌రావు స్పష్టం చేశారు. ఈ పోరాటం ఫలితంగానే పశ్చిమగోదావరి జిల్లాలో 20 వేల ఎకరాల భూమిని ఆదివాసీలకు పంచారన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మల త్యాగ ఫలాలు ఆదివాసీలకే చెందాలన్నారు. ఈ సందర్భంగా వనదేవతల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు కాదని.. ఆదివాసీల హక్కన్నారు. దాన్ని ప్రభుత్వం అడ్డగోలుగా పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని చూస్తోందని ఆరోపించారు.
పుస్తకాల్లో కనిపించని ఆదివాసీల చరిత్ర
పుస్తకాల్లో ఆదివాసీలు, కొమురంభీం లాంటి మహానేతల చరిత్రను ఎందుకు ప్రచురించడం లేదని వెంకటేశ్వర్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. దేశ దోహ్రుల చరిత్రను మాత్రం పుస్తకాల్లో అచ్చు వేయిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఆదివాసీ ప్రాంతాలను ఏకం చేస్తూ స్వయం పరిపాలన ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, బాక్సైట్ వెలికితీత, కవ్వాల టైగర్ జోన్, ఓపెన్ కాస్టులు, ఎలిఫెంట్ జోన్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు.. ఇవన్నీ ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసకాండ అని ధ్వజమెత్తారు. ఆదివాసీలకు భూమి, అడవికి మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు. స్వయం పాలన సాధించే వరకూ పోరాటాలను వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ బహుజన సంస్కృతిక సమాఖ్య సంఘం కళాకారులు ఉద్యమ గీతాలను ఆలపించారు. మం డలంలోని చింతలపాడుకు చెందిన గొత్తికోయ మహిళలు వారి భాషలో పాటలు ఆలపిం చారు. సభలో ఆదివాసీ సేన ఆదిలాబాద్ బాధ్యతులు తొడసం ప్రభాకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్మి సంపత్, విశాఖ బాధ్యులు మండే గురుస్వామి, ఆదివాసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు మడి సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి ముక్తి సాంబశివరావు, వరంగల్ జిల్లా కార్యదర్శి వాసం లింగయ్య, నాయకులు గొం ది కిరణ్, మైపతి సంతోష్ పాల్గొన్నారు.
సమ్మక్క-సారక్క స్ఫూర్తితో ఉద్యమించాలి
Published Wed, Feb 5 2014 2:53 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement