రెడ్డిగూడెం : మతా శిశు మరణాలను అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు, కార్యకర్తల నిర్లక్ష్యం ఫలితంగా నిరుపయోగంగా మారుతున్నాయి. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు తరచూ గాయాల పాలవుతున్నారు. తాజాగా మండలంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సాంబార్‌లో పడి చిన్నారికి తీవ్రగాయాలు
మద్దులపర్వ గ్రామంలోని 173వ సెంటర్‌లో కొనంత మంగమ్మ అనే చిన్నారి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల కోసం తయారు చేసిన సాంబరులో ప్రమాదశాత్తు పడిపోయింది. దీంతో చిన్నారి వీపుభాగం కాలిపోయింది. ఈ సంఘటన అంగన్‌వాడీ కార్యకర్త కె.నిర్మల ఉన్నతాధికారులకు తెలుపకుండా గోప్యంగా ఉంచారు. సూపర్‌వైజర్ బి.కృష్ణకుమారి కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఈవిషయం ఆమె దృష్టికి వచ్చి ంది. దీంతో అవాక్కన ఆమె చిన్నారి వివరాలు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విస్సన్నపేటలో చికిత్స పొందుతున్న చిన్నారి వద్దకు వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు.
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమని, వైద్యం చేయించడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని చిన్నారి తల్లిదండ్రులుకోరగా, ఐసీడీఎస్ సీడీపీవో ఇందిరాకుమారి చిన్నారి తల్లిదండ్రులకు రూ.250 ఇచ్చారు. ఇంత జరిగినా అంగన్‌వాడీ కార్యకర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించకపోవడం గమనార్హం.
గుడ్డు అడిగితే కేసా..?
ఇదే అంగన్ వాడీ కేంద్రంలో.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నెలకు 16 గుడ్లు, మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు,అరకేజీనూనె ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పంపిణీ చేయాల్సి ఉంది. ఇవి లబ్ధిదారులకు సక్రమంగా అందకపోవడంతో వారు అంగన్‌వాడీ కార్యకర్తను అడగ్గా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇద్దరూ బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీడీపీవో ఇందిరాకుమారిని వివరణ కోరగా 173వ కేంద్రంలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తకు మెమో జారీచేశామని, పౌష్టికాహారం పంపిణీపై విచారణ జరిపి నివేదకను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.
నిర్లక్ష్యం నీడలో అంగన్‌వాడీలు
Published Fri, Aug 22 2014 2:45 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement