నీటిపారుదల నిర్లక్ష్యం
- చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు రూ.90 కోట్ల మంజూరు
- ఇప్పటికి రూ.32.50 కోట్ల పనులు మాత్రమే పూర్తి
- నిధుల వినియోగం గడువును మరో రెండేళ్లకు పెంచిన ప్రపంచ బ్యాంకు
- అప్పటికైనా పూర్తయ్యేనో..లేదో..?
చేపా చేపా ఎందుకు ఎండలేదంటే.. ఆవు గడ్డిమేయలేదంట.. ఇది అందరికీ తెల్సిందే. జిల్లాలోని నీటిపారుదల శాఖ అధికారులూ ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. గండి పడ్డ చెరువులు.. దుస్థితికి చేరిన కట్టలకు మరమ్మతులు చేసేందుకు పుష్కలంగా నిధులు మంజూరైనా ఖర్చుచేయలేక చేతులెత్తేశారు. కారణం.. సిబ్బంది కొరత..ఎస్టిమేషన్లలో జాప్యం.. వెరసి వచ్చిన నిధులు వెనక్కెళ్లే ప్రమాదం నెలకొంది. ఎలాగోలా ప్రపంచబ్యాంకు మరో రెండేళ్లు గడువు ఇచ్చింది. ఇప్పటికైనా మేల్కొంటారో.. వదిలేస్తారో వేచిచూడాల్సిందే..!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో 8,058 చెరువులు, కుంటల కింద 30,370 ఎకరాల ఆయకట్టు విస్తరిం చి ఉంది. రాష్ట్రంలో చెరువులు, కుంటల కింద అత్యధిక ఆయకట్టు ఉన్న జిల్లా చిత్తూరే కావడం గమనా ర్హం. శతాబ్దాల క్రితం నిర్మించిన చెరువులు, కుంటలు ఆలనాపాలనా లేకపోవడం వల్ల అధిక శాతం వనరులు నిరర్థకంగా మారాయి. చెరువులు, కుంటల గండ్లు పూడ్చడం.. కట్టలను పటిష్టం చేయడం.. తూములను మరమ్మతు చేయడం.. ఫీడర్, సప్లయ్ చానళ్లను అభివృద్ధి చేయడం ద్వారా చిన్న నీటి వనరులను పునరుద్ధరించాలని 2005లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి భావించారు.
ఈ క్రమంలోనే చిన్న నీటివనరుల పునరుద్ధరణకు సహకరించాలని ప్రపంచ బ్యాంకును కోరారు. వైఎస్ ప్రతిపాదన మేరకు మన జిల్లాలో చెరువులు, కుంటల పునరుద్ధరణకు ట్రిఫుల్ ఆర్(రిపేర్స్ రీకన్‌స్ట్రక్షన్ రినోవేషన్) పథకం కింద రూ.90 కోట్లను 2007లో ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది. ఈ నిధులను 2010 లోగా ఖర్చు చేయాలని సూచించింది. కానీ.. ఆ నిధులను ఖర్చు చేయడంలో చిన్న నీటిపారుదలశాఖ అధికారులు విఫలమయ్యారు.
గడువు ముగియడంతో నిధులను వెనక్కి తీసుకుంటున్నట్లు 2010లో ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు స్పష్టీకరించింది. సిబ్బంది కొరత, ఎస్టిమేట్లలో జాప్యం వల్ల పనులు చేపట్టలేకపోయామని.. మరో నాలుగేళ్లు గడువు ఇవ్వాలని ప్రపంచ బ్యాంను 2010లో ప్రభుత్వం కోరింది. ఇందుకు ప్రపంచ బ్యాంకు సమ్మతించింది.
కానీ.. పొడిగించిన గడువు ముగిసే నాటికి కూడా అధికారులు పనులను పూర్తిచేయలేకపోయారు. జిల్లాలో కేవలం 310 చెరువులను రూ.32.50 కోట్లతో అభివృద్ధి చేయగలిగారు. తక్కిన 57.50 కోట్లను ఇప్పటిదాకా ఖర్చుచేయలేపోయారు. నెలాఖరుతో నిధుల వినియోగానికి గడువు ముగియనుండడంతో ట్రిపుల్ ఆర్ పథకం ప్రగతిని ప్రపంచ బ్యాంకు ఇటీవల ఆరా తీసింది. రూ.57.50 కోట్లను ఖర్చు చేయలేదని పసిగట్టిన ప్రపంచ బ్యాంకు.. ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరింది.
ఇందుకు స్పందించిన ప్రభుత్వం.. మరో రెండేళ్లు గడువు ఇస్తే పనులను పూర్తిచేస్తామని ప్రపంచ బ్యాంకుకు హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు నిధుల వినియోగానికి అక్టోబర్ 2016 వరకూ గడువు ఇచ్చింది. కానీ.. అప్పటికైనా నిధులను వినియోగించుకుని చిన్న నీటివనరులను అభివృద్ధి చేస్తారా అన్న ప్రశ్నకు అధికారవర్గాల నుంచి సరైన సమాధానం లభించకపోవడం గమనార్హం.