
వెంకటగిరి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్షలంటే సమీప గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. పుట్టెడు దుఃఖంతో శవాలను శవపరీక్షలకు తీసుకొచ్చే బంధువులను ఆస్పత్రి వైద్యులు తమ వ్యవహారశైలితో మరింతగా కుంగిదీస్తున్నారు. గురువారం బాలయపల్లి మండలం భైరవరం గ్రామానికి చెందిన అల్లం శంకరమ్మ (35) విద్యుత్‌షాక్‌తో మృతి చెందగా, బంధువులు శవ పరీక్షల నిమిత్తం అదే రోజు సాయంత్రం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే చీకటి పడిపోయిందని శుక్రవారం శవపరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పడంతో చేసేది లేక పడిగాపులు పడ్డారు.
అయితే శుక్రవారం శంకరమ్మ శవపరీక్షల ప్రక్రియలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం శవపరీక్ష చేస్తానని చెప్పిన వైద్యుడు శ్రీనివాస్ జాప్యం చేశాడు. చివరకు 10.30 గంటల సమయంలో ఆస్పత్రికే చెందిన మరో వైద్యుడు జిలానీబాషాకు ఆ విధులను అప్పగిం చాడు. ఆయన శవపరీక్ష చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అడ్డుకుని ఓపీ రోగులను పరీక్షించిన అనంతరమే వెళ్లాలని సూచించాడు. దీంతో చేసేది లేక వైద్యుడు జిలానీబాషా రోగులను పరీక్షించిన అనంతరం శంకరమ్మ మృతదేహం వద్దకు వెళ్లాడు.
మృతదేహాన్ని పరిశీలించి పలుచోట్ల గాయాలు ఉన్నాయిని, నెల్లూరుకు చెందిన ప్రత్యేక వైద్యనిపుణులతో శవపరీక్షలు చేయించాలని బంధువులకు సూచించి వెళ్లిపోయాడు. కాగా డాక్టర్ శ్రీనివాస్ నగదు డిమాండ్ చేశాడని, తాము ఇచ్చుకోలేని పేదలమని చెప్పడంతో శవపరీక్ష చేయడంలో జాప్యం చేస్తున్నాడని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూషణలకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటల్లో భైరవరం గ్రామానికి చెందిన తిరుపాలయ్యకు చేతివేళ్లు రెండు విరిగిపోయారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్సై కొండపనాయుడు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు.
ఎమ్మెల్యే రామకృష్ణకు పరాభవం
వైద్యుల వ్యవహార శైలిని బంధువులు ఫోన్‌లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన డాక్టర్ శ్రీనివాస్‌కు ఫోన్ ఇవ్వాలని సూచించగా, బంధువులు అందించే ప్రయత్నం చేశారు. అయితే వైద్యుడు ఫోన్ స్వీకరించలేదు. పలువురు ఫోన్‌ల ద్వారా డాక్టర్ శ్రీనివాస్‌తో మాట్లాడాలని ఎమ్మెల్యే విఫలయత్నం చేశారు. చేసేది లేక వ్యవహారాన్ని జిల్లా వైద్యాధికారి వరసుందరం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వైద్యుడు శ్రీనివాస్‌తో చర్చించి వైద్యుల బృందం ఆధ్వర్యంలో శవపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు శంకరమ్మ మృతదేహానికి శవపరీక్షలు పూర్తిచేశారు.