సాక్షి, నెల్లూరు: రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరుకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడి నేతలు నిత్యం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంటారు. ఇక్కడి రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. అందుకే జిల్లా కేంద్రమైన నెల్లూరు సిటీ నియోజకవ ర్గంపై అందరి దృష్టి పడింది. ఇది టీడీపీలో ఇంటిపోరుకు దారితీసింది.
ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు నేతలు భావిస్తుండటంతో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. 2009 ఎన్నికల్లో బాలకృష్ణ సహకారంతో టికెట్ తెచ్చుకుని పోటీచేసిన తాళ్లపాక రమేష్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. అనంతరం ఆ పార్టీలో నిస్తేజం ఆవహించింది. అడపాదడపా మొక్కుబడిగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించినా, కాంగ్రెస్ వ్యతిరేకంగా పెద్దగా ఉద్యమించిన దాఖలాలు లేవు. కొంతకాలంగా టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురె డ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ సేవాసమితి పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్న ఆయన టికెట్ విషయంలో తనకు బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. రమేష్‌రెడ్డి సైతం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన రాకను కోటంరెడ్డి, రమేష్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీనే నమ్ముకుని ఉన్న తమను కాదని మరోపార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయడం తగదని వాదిస్తున్నారు.
ఇది పార్టీ కేడర్‌కు ప్రతికూల సంకేతాలు వెళ్లే పరిస్థితికి దారితీస్తుందని ఇప్పటికే చంద్రబాబు దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే కోటంరెడ్డి, రమేష్‌రెడ్డిని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అంచెల వాణిని రంగంలో దింపాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కౌన్సిలర్, కార్పొరేటర్‌గా పనిచేసిన అంచెల వాణి ఇప్పటికే చంద్రబాబును కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మేయర్ భానుశ్రీ పోటీ చేసే అవకాశం ఉన్నందున, బీసీ మహిళనే బరిలో నిలపాలని ఆమె కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సోమిరెడ్డి సైతం ఇదే సమీకరణాలను అధినేతకు వివరించినట్లు తెలిసింది. వాణికి నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణతో బంధుత్వం ఉంది. ఆయన అండ కూడా తోడవడంతో వాణి అభ్యర్థిత్వం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి రమేష్‌రెడ్డి, కోటంరెడ్డిని సోమిరెడ్డి విభే దిస్తూ వస్తున్నారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలోనే ఆయన మధ్యేమార్గంగా అంచెల వాణిని ప్రతిపాదిస్తూ వ్యూహం పన్నినట్లు సమాచారం. బీద రవిచంద్ర సైతం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తోంది.
అంచెల వాణి సామాజిక వర్గం ఓటర్లు నెల్లూరులో అధికంగా ఉండడం, టీడీపీ ముఖ్య నేతలతో పాటు నారాయణ మద్దతు నేపథ్యంలో ఆమెకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. బాలకృష్ణ భరోసాతో టికెట్ తనదేనన్న ధీమా కోటంరెడ్డిలో కనిపిస్తోంది. ముఖ్య నేతల మద్దతు లేకపోవడం ఆయనకు మైనస్. అంచెల వాణి అభ్యర్థి అయితే రమేష్‌రెడ్డి, కోటంరెడ్డికి కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఉంది. మొత్తంగా నగరంలో టికెట్ గొడవ టీడీపీలో కుమ్ములాటలను పతాకస్థాయికి తీసుకెళ్లింది.
టీడీపీలో ఇంటిపోరు
Published Sun, Feb 9 2014 3:21 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement