జానారెడ్డి పెద్ద కుమారుడికి కూడా రాజకీయ బాటలు
భువనగిరి సీటుపై ఇంకా తేల్చని కాంగ్రెస్
ఇక్కడ బీసీలకు టికెట్ ఇచ్చిన బీజేపీ
‘హస్తం’ పార్టీలోనూ అదే అంశంపై తర్జనభర్జన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేసింది. కుందూరు రఘువీర్‌రెడ్డి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో నల్లగొండ అభ్యర్థి పేరును కూడా వెల్లడించింది. భువనగిరి ఎంపీ సీటు విషయాన్ని పెండింగ్‌లో పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ అభ్యర్థిత్వాల విషయంలో నల్లగొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జానారెడ్డి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని తన చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డికి నాగార్జునసాగర్ టికెట్ ఇప్పించుకున్నారు. జయవీర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఆ తరువాత జానారెడ్డి లేదా రఘువీర్‌రెడ్డిలలో ఎవరో ఒకరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం సాగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టికెట్ కోసం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి పోటీపడ్డారు. అధిష్టానం మాత్రం దామోదర్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో రమేష్‌రెడ్డి అలకబూనగా ఎంపీ టికెట్ ఇస్తామని మల్లు రవితోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా అప్పుడు హామీ ఇచ్చారు.
అయితే, పటేల్ రమేష్‌రెడ్డికి టికెట్ ఇస్తారని భావించినా ఆ తరువాత జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి పేర్లే తెరపైకి వచ్చాయి. వీరితో పాటు పలువురు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డికి జానారెడ్డి, అయన కుమారులతో మంచి సంబంధాలు ఉండటంతో అధిష్టానం రఘువీర్‌రెడ్డి అభ్యర్థితాన్ని ఖరారు చేసింది. జానారెడ్డి తాను అనుకున్నట్లుగా పెద్ద కుమారుడికి నల్లగొండ ఎంపీ టికెట్‌ను ఇప్పించుకోవడం ద్వారా తన ఇరువురు కుమారులకు రాజకీయంగా బాటలు వేసినట్లయింది.
పెండింగ్‌లో భువనగిరి అభ్యర్థి పేరు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. దానిని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టింది. భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. కోమటిరెడ్డి సోదరులు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నాలు చేశారు. కోమటిరెడ్డి సూర్యపవన్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి పోటీచేస్తారన్న చర్చ సాగింది. ఆ తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయడం లేదని ప్రకటించారు.
దీంతో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు టీపీసీసీ నాయకుడు పున్నా కై లాష్ నేత, చెవిటి వెంకన్న, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజేపీ అక్కడ బీసీ అభ్యర్థి, గౌడ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్ ఆలోచనల్లో పడ్డాయి. అక్కడ బీసీ అభ్యర్థిని పోటీలో నిలుపాలా.. ఓసీ అభ్యర్థిని నిలపాలా అన్న ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ పడింది. ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారన్నది నాలుగైదు రోజుల్లో తేలనుంది.
పేరు: కుందూరు రఘువీర్ రెడ్డి
తండ్రి: కుందూరు జానారెడ్డి
వయస్సు: 44 (02–01–1980)
విద్యార్హత: డిగ్రీ,
వృత్తి: వ్యాపారం
భార్య పేరు: లక్ష్మి
పిల్లలు: ఈశాన్వి, గౌతమ్‌రెడ్డి
పార్టీ పదవులు : 2009లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సభ్యుడు
2014, 2018లో పీసీసీ సభ్యుడు
2021లో పీసీసీ జనరల్ సెక్రటరీ
Comments
Please login to add a commentAdd a comment