
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పై-లిన్ తుపాను పట్ల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తుపాన్ ప్రభావం ఉండే 21 మండలాల్లో 23 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కావలి, విడవలూరుకు ఇద్దరు చొప్పున అధికారులు నియమితులయ్యారు. 21 మండలాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జిల్లాలో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే మండలాల అధికారులతో కలెక్టర్ శ్రీకాంత్ తరచూ సంప్రదిస్తున్నారు. మండలాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వారికి సూచనలు ఇస్తున్నారు.
ప్రత్యేక అధికారులు రాత్రి వేళలో మండలాల్లోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులు చేపల వేటకెళ్లకుండా చర్యలు చేపట్టారు. తీరప్రాంత గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోలు రూం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన నిత్యావసర సరుకులు సిద్ధమయ్యాయి. తుపాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూంకు తెలియచేయాలని అధికారులు సూచించారు.
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నంబర్లు: 1800 425 2499, 08612-331477
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477