నెటిజన్లు మెచ్చిన నాయకుడు.. జగన్!!
జగన్.. జగన్.. జగన్.. నెటిజన్లు చేస్తున్న నామజపమిది!! అవును.. మన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చూసినా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న పేరు ఎవరిదో కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డిదే!! కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్.. ఇలాంటి నాయకులందరినీ తలదన్ని జగన్ మోహనరెడ్డి ముందంజలో నిలిచారు. 2009 జనవరి నుంచి 2013 సెప్టెంబర్ వరకు 'గూగుల్ ట్రెండ్స్'ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది.
జగన్, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్.. ఈ నలుగురు నాయకులలో భారతదేశంలో ఉన్న నెటిజన్లు ఎక్కువగా ఎవరిపేరు సెర్చ్ చేస్తున్నారో చూస్తే, అందరి కంటే ఎక్కువగా జగన్ కోసమే సెర్చ్ చేశారు. సగటున చూసుకుంటే జగన్ కోసం 23% మంది, కిరణ్ కుమార్ రెడ్డి కోసం 0% మంది, చంద్రబాబు నాయుడు కోసం 1% మంది, కేసీఆర్ కోసం 13% మంది సెర్చ్ చేసినట్లు గూగుల్ ట్రెండ్స్లో స్పష్టమైంది. జాతీయ పత్రికలు కూడా ఈ విషయాన్ని పతాక శీర్షికలతో ప్రధాన కథనాలలో ప్రచురించాయి.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన నాటినుంచి జగన్కు సంబంధించిన కథనాలు, చిత్రాల కోసం నెటిజన్లు ఇంటర్నెట్ను విపరీతంగా గాలించారు. ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, కొత్తగా పార్టీ ఏర్పాటు... ఇవన్నీ నెటిజన్ల హాట్ ఫేవరెట్లే అయ్యాయి. ఇక తాజాగా 484 రోజుల జైలు జీవితం నుంచి జనజీవితంలోకి జగన్ అడుగుపెట్టగానే ఒక్కసారిగా వెబ్సైట్ల మీద నెటిజన్లు దాడి చేసినంత పనిచేశారు. ఒకేసారి వేల సంఖ్యలో జగన్ విడుదలకు సంబంధించిన కథనాలు, చిత్రాలు, వీడియోలను వీక్షించారు.