
సర్పాలతో చెలిమి
15 ఎళ్ల క్రితం కాలనీలో పది అడుగుల కొండచిలువ ఆరేళ్ల కుర్రాడిని చుట్టేసి బంధించడంతో ఆ కుర్రాడు ప్రాణరక్షణ కోసం విలవిలాడుతూ కేకలు వేశాడు.
మల్కాపురం : సాధారణంగా ఎవరైనా సర్పాన్ని చూస్తే భయంతో గజగజలాడతారు. కానీ ఓ తండ్రి, కొడుకు మాత్రం వాటితో స్నేహంగా మెలుగుతూ, వాటిని మెడలో పెట్టుకొని ఆడిస్తుంటారు. తండ్రి ఆనంద్ అయితే...కొడుకు దేవానంద్.. పాములను పట్టడంలో ఇద్దరూ ఇద్దరే. పాములతో వారి చెలిమి ఎలా మొదలైందంటే...
15 ఎళ్ల క్రితం కాలనీలో పది అడుగుల కొండచిలువ ఆరేళ్ల కుర్రాడిని చుట్టేసి బంధించడంతో ఆ కుర్రాడు ప్రాణరక్షణ కోసం విలవిలాడుతూ కేకలు వేశాడు. అప్పుడా దృశ్యాన్ని చూసిన స్థానికులు అతన్ని రక్షించే సాహసం చేయలేదు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఆనంద్ అనే వ్యక్తి ధైర్యం చేసి కొండచిలువ పట్టు నుంచి బాలుడిని విడిపించాడు. తరువాత కొంతకాలానికి ఇదే కాలనీలో ఓ ఇంటిలోకి విషసర్పం చొరబడింది. ఆ ఇంటి వారిని భయబ్రాంతులకు గురిచేసింది. అప్పుడు కూడా ఆనంద్ ధైర్యం చేసి విష సర్పాన్ని బంధించి ఆ ఇంటి వారిని రక్షించాడు. దీంతో ఆనంద్ పేరు స్థానికుల్లో మార్మోగిపోయింది.
నాటినుంచి పట్నాల ఆనంద్ కాస్తా పాముల ఆనంద్‌గా మారాడు. అప్పటి నుంచి పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడ విషసర్పాల అలజడి కనిపించినా సాయం కోరుతూ ఆనంద్‌కు సమాచారం వెళుతుంది. ఇలా ఇప్పటి వరకూ దాదాపు మూడు వేల వివిధ రకాల సర్పాలను బంధించి బాధితులకు అండగా నిలిచాడు. సింధియా, న్యూకాలనీ ప్రాంతంలో పట్నాల ఆనంద్ ఉంటున్నాడు. అతనికి ఓ కొడుకున్నాడు పేరు దేవానంద్. వయసు పదేళ్లు. ఏడాది క్రితం ఓ ఇంట్లో ఆరడుగుల పాము చొరబడి అక్కడి వారిని కలవర పరిచింది. ఆ సమయంలో ఆనంద్ ఇంట్లో లేడు. కానీ దేవానంద్ ఉన్నాడు. నేనున్నానంటూ ఆ ఇంట్లోకి వెళ్లి పామును పట్టేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. తండ్రిని మించిన ఘనుడంటూ కితాబులిచ్చారు.